విద్యానికేతన్ ఫీజుల చెల్లింపుల విషయంలో రోడ్డుకెక్కి.. చంద్రబాబు నాయుడుపై పోరాటం మొదలెట్టినప్పుడే.. మోహన్ బాబు త్వరలో రాజకీయంగా ఓ నిర్ణయం తీసుకోబోతున్నారన్న విషయం జనాలకు అర్థమైంది. నాలుగు రోజులు తిరక్కముందే.. ఆయన వైకాపా పార్టీలో చేరి, ఆ కండువా కప్పుకోవడం ఎవ్వరినీ ఆశ్చర్యానికి గురి చేయలేదు. అయితే.. మోహన్ బాబు వైకాపాలో చేరడానికి విష్ణు నే ప్రధాన కారణం అని తెలుస్తోంది. కొంత కాలంగా మోహన్ బాబు రాజకీయాల విషయంలో తటస్థంగా వ్యవహరిస్తున్నారు. అన్ని పార్టీలలోనూ ఆయనకు కావల్సినవాళ్లు ఉన్నారు. అందుకే.. ఆ మైత్రీ బంధం కొనసాగించడం కోసం.. మౌనంగా ఉండిపోయారు. బీజేపీలో మోహన్ బాబు చేరతారని ప్రచారం జరిగింది. ఆయన సొంతంగా పార్టీ స్థాపిస్థారని కూడా అనుకున్నారు.
అయితే వైకాపాలో చేరమని బలవంతం చేసింది మాత్రం విష్ణునేనట. కొన్ని రోజుల క్రితం విష్ణు జగన్‌ని కలిశారు. అప్పుడే.. మంచు ఫ్యామిలీ వైకాపాలో వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు అర్థమైంది. ఆరోజే.. మోహన్ బాబు చేరికకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టైంది. అయితే అటు మనోజ్‌కి గానీ, ఇటు లక్ష్మీ ప్రసన్నకు గానీ.. వైకాపాలో చేరడం ఇష్టం లేదని సమాచారం. ఎన్నికల ముందు పార్టీలు మారడం కరెక్ట్ కాదని, పైగా ఎన్నికలలో పోటీ చేసే ఉద్దేశం లేనప్పుడు ఎలాంటి ఉపయోగం ఉండదని గట్టిగా చెప్పారట. మోహన్ బాబు కూడా ఈ విషయంలో తర్జన భర్జనలు పడ్డారని, అయితే ఎన్నికలలో గాలి జగన్‌వైపే ఉందని గ్రహించిన మోహన్ బాబు, ఫలితాలు వచ్చిన తరవాత కంటే, ముందే.. ఆ పార్టీలో చేరితో మంచిదని ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఓ దశలో తిరుపతి నుంచి మోహన్ బాబు టికెట్టు కోసం ప్రయత్నించారని, జగన్ కాదనడంతో.. పోటీ చేసే ఆలోచన విరమించుకున్నట్టు సమాచారం.