తెలుగు 360 జిల్లాల వారీగా నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయసేకరణ, విశ్లేషణలో భాగంగా అందిస్తున్న… సర్వేల వివరాల్లో ఈ రోజు కడప జిల్లాకు చెందిన వివరాలను చూద్దాం. కడప జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ జిల్లా ఎప్పుడూ.. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటే. అయితే… కాంగ్రెస్ పార్టీని మించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ తెచ్చుకోవడం… ఆ ఇమేజ్ అండగా.. ఆయన కుమారుడు.. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టుకోవడంతో.. ఇప్పుడు… కడప జిల్లాలో కాంగ్రెస్ కాస్తా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయింది. 2009లో, 2014లో టీడీపీకి పది నియోజకవర్గాల్లో ఒక్క చోట మాత్రమే విజయం లభించింది. 2009లో ప్రొద్దుటూరు, 2014లో రాజంపేటలో మాత్రమే విజయం సాధించారు. అయితే.. ఒకటి , రెండు నియోజకవర్గాల్లో మినహా… మిగిలిన చోట్ల గట్టిపోటీనే ఇచ్చారు.
పులివెందుల నియోజకవర్గం వైఎస్ కుటుంబానికి పెట్టని కోట. ఎంపీటీసీ దగ్గర్నుంచి ఎంపీ వరకూ.. అందరూ.. వైఎస్ కుటుంబానికి చెందిన వారే ఉంటారు. ఈ సారి కూడా ఈ నియోజకవర్గంపై వారి పట్టు సడల లేదు. కానీ వైఎస్ ఉన్నప్పటి పరిస్థితి ఇప్పుడు లేదని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. వైఎస్ మార్క్ రాజకీయాలకు… టీడీపీ.. కొత్త పద్దతిలో పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేసింది. పులివెందుల మొత్తం నీరు పారిస్తోంది. అన్ని చెరువులను నింపారు. ప్రతీ వేసివిలో అక్కడ ట్యాంకర్లే అవసరాలు తీర్చేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. సంక్షేమ పథకాలతో దాదాపు ప్రతి ఇంటికి.. లబ్ది చేకూర్చారు. ఎప్పుడూ వైఎస్ కుటుంబంపై పోటీ చేసే సతీష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన నీరు తెచ్చే వరకూ గడ్డం తీయనని సవాల్ చేసి.. నిలబెట్టుకున్నారు. అయినా.. పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ సెంటిమెంటే ఎక్కువగా ఉంది. గెలుపుపై… జగన్‌కు ఎలాంటి ఢోకా లేదు.. కానీ… మెజార్టీ మాత్రం గతంలో ఉన్నంత రాకపోవచ్చు. కమలాపురంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన పుత్తా నరసింహారెడ్డి-రవీంద్రనాధరెడ్డి మధ్య పోటీ సాగుతోంది. పుత్తా నరసింహారెడ్డి టీడీపీ నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. 2009, 2014 ఎన్నికల్లో ఓటమి చెందారు. మరో కీలక నేత వీరశివారెడ్డి.. తనకు అవకాశం వస్తుందని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దాంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. చంద్రబాబు సర్దుబాటు చేశారు. వైసీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి జగన్ మేనమామ. గత ఎన్నికల్లో కేవలం ఐదు వేల ఓట్ల మెజార్టీతో మాత్రమే విజయం సాధించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అండతో.. ఈ సారి పుత్తా నరసింహారెడ్డి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇప్పటికైతే.. పుత్తా నరసింహారెడ్డికి కాస్త అనుకూలంగా ఉంది.
రాయచోటిలో జగన్ బాల్య స్నేహితుడు శ్రీకాంత్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి రమేష్ కుమార్ రెడ్డి మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. రాయచోటి లో టీడీపీలో ఉన్న గ్రూపు రాజకీయాలను చంద్రబాబు సరిదిద్దారు. మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు, ఆయన తనయుడు టీటీడీ బోర్డు మెంబరు సుగవాసి ప్రసాద్‌బాబు, టీడీపీ అభ్యర్థి రమేష్ రెడ్డి కలిసికట్టుగా ప్రచారం చేస్తున్నారు. విజయాసాయిరెడ్డి సమీప బంధువు, మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి ఈ సారి టీడీపీకి మద్దతిస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో… ముస్లింల ఓట్లే కీలకం. గత ఎన్నికల్లో టీడీపీ.. బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో… వచ్చే కొన్ని ఓట్లు కూడా ఆ వర్గానివి పడలేదు. ఈ సారి… బీజేపీకి వైసీపీ దగ్గరగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. అలాగే… ముస్లింలకు ఇచ్చిన కొన్ని హామీలను.. జగన్, శ్రీకాంత్ రెడ్డి నెరవేర్చలేదు. దాంతో కొంత అసంతృప్తి ఉంది. అయినప్పటికీ.. పరిస్థితి చూస్తే.. ఇప్పటికీ… వైసీపీకే అనుకూలంగా ఉంది. మైదుకూరులో పోరు మహాపోరుగా మారింది. పుట్టా సుధాకర్‌యాదవ్ టీడీపీ నుంచి, రఘురామిరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డి.. వైసీపీకి మద్దతు ప్రకటించారు. ఇక్కడ రెడ్డి, నాన్ రెడ్డి అన్న విధంగా ఓటింగ్ మార్చడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికైతే పరిస్థితి వైసీపీకే అనుకూలంగా ఉంది.
జిల్లా కేంద్రం కడపలో… తెలుగుదేశం పార్టీ.. ఈ ఐదేళ్ల కాలంలో బలమైన నాయకత్వాన్ని వృద్ధి చేసుకోలేకపోయింది. కానీ గ్రూపులకు మాత్రం తక్కువేం లేవు. ఎన్నికల్లో చివరి క్షణంలో… మాజీ మంత్రి అహ్మదుల్లాను పార్టీలో చేర్చుకుని ఆయన కుమారుడికి టిక్కెట్ ఖరారు చేసినా… అక్కడి నేతలంతా… మార్చాల్సిందేనని పట్టుబట్టడంతో.. చివరికి.. ఎప్పటి నుండో టీడీపీని అంటి పెట్టుకుని ఉన్న అమీర్ బాబుకు టిక్కెట్ కేటాయించారు. ఇక్కడ వైసీపీ బలంగా ఉంది. వైఎస్‌పై ముస్లింలలో అభిమానం ఉంది. ఈ కారణంగా.. వైసీపీకి ఎదురులేదని చెప్పుకోవచ్చు. మెజార్టీ తగ్గించడమే టీడీపీ లక్ష్యం. రాజంపేటలో.. గత ఎన్నికల్లో టీడీపీ తరపు నుంచి గెలిచిన మేడా మల్లిఖార్జునరెడ్డి ఈ సారి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. వైసీపీకి ఈ నియోజకవర్గానికి పెద్ద దిక్కుగా ఉన్న ద్వారకానాథ్ రెడ్డి అనుచరులు… ఆయనకు సహకరించే పరిస్థితి లేదు. మేడా స్థానంలో బలమైన బలిజ సామాజికవర్గానికి చెందిన చెంగల్రాయుడుని టీడీపీ అధినేత బరిలోకి దింపారు. అక్కడ ఆయనకు.. మంచి పట్టు ఉంది. మేడా.. పార్టీ మారిన మరుక్షణమే ఆయనకు టిక్కెట్ ఖరారు చేయడంతో.. మండలాల వారీగా వ్యూహం అమలు చేస్తున్నారు. ఇక్కడ మేడాకు… సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండటమే మైనస్ అవుతోంది. తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గం మరో సారి పట్టం కట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
జమ్మలమడుగు నియోజకవర్గం రాజకీయం ఈ సారి సాదాసీదాగా ఉంది. ప్రతీ సారి… ఆదినారాయణరెడ్డి ఓ వర్గం, రామసుబ్బారెడ్డి మరో వర్గంగా పోరాడేవి. రెండు వర్గాల మధ్య ఫ్యాక్షన్ కక్షలు ఉండటంతో.. టెన్షన్ ఉండేది. ఈ సారి రెండు వర్గాలు కలసి మెలసి పని చేస్తున్నాయి. వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి.. రాజకీయాలకు కొత్త. వైఎస్‌పై అభిమానం ఓట్లుగా వచ్చి పడుతుందని అనుకుంటున్నారు. కానీ.. టీడీపీ లక్ష్యం మాత్రం.. జమ్మలమడుగులో వచ్చే మెజార్టీతోనే… కడప ఎంపీ సీటును గెలుచుకోవడం. ఇక్కడ టీడీపీ అభ్యర్థికి మెజార్టీనే ముఖ్యం. బద్వేలు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. అయితే.. ఈ సారి.. ఆర్డీ రాజశేఖర్ అనే డాక్టర్‌కు టీడీపీ టిక్కెట్ లభించింది. కానీ.. టీడీపీ నేత విజయజ్యోతి ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నారు. వైసీపీ కి అండగా ఉండే సామాజికవర్గం… నియోజకవర్గంపై పట్టు సాధించింది. ఇక్కడ వైసీపీ గెలుపు సునాయసమే.
వ్యాపార వాణిజ్య రంగానికి కేంద్రమైన ప్రొద్దుటూరులో పట్టుకోసం వైసీపీ.. పరువుకోసం టీడీపీ పోటీ పడుతున్నాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఈ స్థానాన్ని దక్కించుకుంది. రాష్ట్రంలో తమ ప్రభుత్వం హాయాంలో చేపట్టిన పథకాలు నియోజకవర్గంలో అందరికీ చేరాయని, ఈ పథకాలే తమను గెలిపిస్తాయనే ధీమాలో టీడీపీ నేతలున్నారు. టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డికి చాన్సిచ్చారు. వరదరాజుల రెడ్డి వర్గం పని చేస్తుందో లేదోనన్న సందేహం ఉంది. ఇప్పటికి ఉన్న పరిస్థితిని బట్టి.. వైసీపీకే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. కడప జిల్లాలో రిజర్వ్డ్ నియోజకవర్గమైన రైల్వేకోడూరులో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తిరిగి పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా నరసింహ ప్రసాద్‌కు చాన్సిచ్చారు. బలిజ వర్గం మొత్తం టీడీపీకి అండగా ఉంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది. పార్టీ ఆవిర్భావం నుంచి వరుసగా ఆ పార్టీకి చెందిన నేతలే ఐదుసార్లు ఎన్నికయ్యారు. నియోజకవర్గాల పునిర్విభజనలో భాగంగా వైసీపీ బలంగా ఉన్న పెనగలూరు మండలం రైల్వేకోడూరు నియోజకవర్గంలో చేరింది. దీంతో ఆ నియోజకవర్గం వైసీపీకి అనుకూలంగా మారింది. గత ఎన్నికలో కేవలం 1900 ఓట్ల తేడాతో వైసీపీ గెలిచింది. ఈ సారి టీడీపీ అభ్యర్థికి విజయావకాశాలు కనిపిస్తున్నాయి.
[table id=3 /]