పెళ్లయ్యా సమంత ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. రంగస్థలం, యూ టర్న్, రాజుగారి గది 2.. ఇలా ఎప్పటికప్పుడు విభిన్నమైన కథలనే ఎంచుకుంటోంది. గ్లామర్ రోల్స్‌కి పూర్తిగా దూరమైంది. తమిళంలో చేసిన `సూపర్ డీలక్స్` సైతం ఆమెకు కొత్తరకమైన పాత్రే. ఈసారి `మజిలీ`తో మురిపించడానికి సిద్దమైంది. పెళ్లయ్యాక చైతన్యతో కలసి చేసిన తొలి సినిమా ఇది. ఏప్రిల్ 5న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సమంతతో చేసిన చిట్ చాట్ ఇది.
* హాయ్ సమంత..
– హాయ్
* పెళ్లయ్యాక నాగచైతన్యతో చేసిన తొలి సినిమా ఇది. సెట్స్‌లో కూడా భార్యాభర్తలుగా ఉన్నారా? లేదంటే ప్రొఫెషల్ నటులుగా మారిపోయారా?
– ఒక్కసారి సెట్లోకి వెళ్లాక, దర్శకుడు యాక్షన్ చెప్పిన తరవాత.. నా ముందు ఎవరున్నారన్నది పట్టించుకోను. ఆ వ్యక్తి తో నాకున్న రిలేషన్ ఏమిటన్నది కూడా అనవసరం. ఓ నటికి అది చాలా అవసరం కూడా. అయితే ఎలాగూ చైతోనే నటిస్తున్నాను కాబట్టి…సెట్లో తనతో గడపడానికి మరింత టైమ్ దొరికింది. ఇద్దరం కలిసి షూటింగ్‌కి వెళ్లడం, పేకప్ అయ్యాక మళ్లీ ఇంటికి చేరుకోవడం.. ఇవన్నీ బాగా అనిపించాయి.
* ఓ నటుడిగా చై లో ఏమైనా మార్పులు కనిపించాయా?
– ఈ సినిమాలో చై చాలా సెటల్డ్గా నటించాడు. తనలో చాలా మార్పు వచ్చింది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఇంకా బాగా నటించాడు.
* ఇద్దరూ ఇంటికెళ్లాక తీసిన సీన్ గురించి, సినిమా గురించి మాట్లాడుకునేవారా?
– ఆ టాపిక్ ఎంత వద్దనుకున్నా వచ్చేసేది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ గురించి మా ఇద్దరి మధ్య బాగా డిస్కర్షన్ జరిగేది. ఎందుకంటే ఈ సినిమాకి క్లైమాక్స్ అనేది చాలా కీలకం. దాని గురించే ఎక్కువగా మాట్లాడుకున్నాం.
* పెళ్లయ్యాక.. ఇలాంటి కథే చేస్తే బాగుంటుంది అనిపించిందా?
– పెళ్లయ్యాక ప్రేమలో చాలా మార్పులు వస్తాయి. నిజానికి ఆ ప్రేమే నిజమైనది. అలాంటి కథతో ఎవరైనా సినిమా చేస్తే బాగుంటుంది కదా అనిపించేది. సరిగ్గా అలాంటి కథతోనే శివ వచ్చాడు. నేనూ, చై రొమాన్స్ చేసుకోవడం ఇది వరకు సినిమాల్లో అందరూ చూశారు. ఇప్పుడు పెళ్లయ్యాక కూడా అలాంటి సీన్లే చేస్తే ఏం బాగుంటుంది. అందుకే మజిలీ లాంటి కథ ఎంచుకున్నా.
* ఓ కథ వింటున్నప్పుడు ఈ సినిమా తప్పకుండా హిట్టవుతుంది అని అంచనా వేయగలరా?
– వేయొచ్చు. దాదాపు పదేళ్ల నుంచీ పరిశ్రమలో ఉన్నా. ఎన్నో కథలు విన్నా. రకరకాల సినిమాలు చేశా. ఇప్పటికీ జడ్జిమెంట్ రాకపోతే ఎలా?
* కథ చెప్పాక మీవైన మార్పులు చెబుతున్నారా?
– ఓ కథ విన్నప్పుడు నాకు నచ్చకపోతే అసలు చేయను. ఆ తరవాత ఎన్ని మార్పులు చేసుకొచ్చినా… కన్వెన్స్ అవ్వను. ఓసారి నచ్చిన తరవాత.. ఎలాంటి జోక్యం చేసుకోను. ఎందుకంటే అన్నీ నచ్చిన తరవాతే కదా సినిమా ఒప్పుకునేది. ఆ తరవాత కూడా మార్పుల పేరుతో దర్శకుడ్ని హింసించడం ఎందుకు?
* తమిళంలో విడుదలైన సూపర్ డీలక్స్‌కి మంచి స్పందన వస్తోంది.. ముఖ్యంగా మీ పాత్రకు మంచి రివ్యూలు వచ్చాయి?
– నిజంగా అది నాకు ఆశ్చర్యం కలిగించింది. ఈ సినిమాలో నేను చాలా బోల్డ్‌గా నటించా. ఈ సినిమా చూశాక ట్రోల్స్ వస్తాయని అనుకున్నా. కానీ నన్ను మెచ్చుకుంటున్నారు. అందుకే హ్యాపీ.
* ట్రోలింగ్‌ని లైట్ తీసుకుంటారా?
– ఇది వరకు చాలా సీరియస్‌గా తీసుకునేదాన్ని. ఇప్పుడు మాత్రం.. అంతా లైటే.
* కమర్షియల్, రొటీన్ సినిమాలకు సమంత దూరమైనట్టేనా?
– సినిమా సినిమాకీ ఎదురుతూ వచ్చాను. ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నా. ఒకప్పుడు చేతిలో సినిమా లేకపోతే భయంగా ఉండేది. సమంత పని అయిపోయిందా? అనిపించేది. అందుకే ఎలాంటి కథ వచ్చినా సినిమాలు ఒప్పుకునేదాన్ని. ఇప్పుడు కూడా అలాంటి కథలే ఎంచుకుంటే అర్థముంది? యేడాదికి ఒక్క సినిమా చేసినా చాలు. మంచి పాత్ర దొరకాలంతే.
* ఇంకా ఏమైనా గోల్స్ ఉన్నాయా?
– స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఓ సినిమా చేయాలనివుంది. ఓ ఆటగాడు ఎదిగే క్రమం చాలా ఆసక్తిగా ఉంటుంది. ఎక్కడైనా అలాంటి కథలు ఆడతాయి. అలాంటి సినిమా ఒకటి చేయాలి.
* కెరీర్ కొత్తలో సినిమాపై ఓ ఫ్యాషన్ ఉండేది కదా? అది ఇప్పటికీ ఉందా?
– ఇంకొంచెం పెరిగింది. తెలిసో తెలియకో.. దూకుడు టైమ్‌లో మహేష్ బాబు గారు నాకో అద్భుతమైన సలహా ఇచ్చారు. ప్రతి సినిమానీ తొలి సినిమాగానే భావించమని చెప్పారు. ఆ సలహా నాకు చాలా ఉపయోగపడింది. ఇప్పటికీ ఆ మాటని గుర్తు పెట్టుకుంటా.