జనసేన పార్టీ నాయకులపై, కార్యకర్తలపై ఇరు పార్టీల, పార్టీల నాయకుల దాడులు కొనసాగుతున్నాయి. వైయస్ జగన్ సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ లని అడ్డుపెట్టుకొని జనసేన పై, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా దాడి చేస్తున్నాడు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీతో జనసేన కుమ్మక్కయింది అంటూ ఆరోపణలు కూడా చేస్తున్నాడు. అయితే తెలుగుదేశం పార్టీ తాను కూడా ఏమీ తక్కువ తినలేదు అని ఇటీవల పరిణామాలతో నిరూపించుకుంది.
రాజంపేట జనసేన ఎంపీ అభ్యర్థి ని బెదిరించిన టీడీపీ ఎంపీ అభ్యర్థి కొడుకు:
ఇది రెండు రోజుల కిందట జరిగిన సంఘటన. దినపత్రికల్లో కూడా వచ్చింది. అయితే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే ఈనాడు, ఆంధ్రజ్యోతి లో కానీ, జగన్ కరపత్రిక అయిన సాక్షిలో కానీ రాలేదు అనుకోండి అది వేరే విషయం. జనసేన పార్టీ రాజంపేట ఎంపీ అభ్యర్థి సయ్యద్ ముకరంచంద్ ఇంటికి రాజంపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి సత్యప్రభ కొడుకు గురువారం రాత్రి 12 గంటలకు చేరుకున్నాడు. అనుచరులతో సహా వచ్చి జనసేన ఎంపీ అభ్యర్థి ని బెదిరించాడు. దాదాపు తెల్లవారుజామున మూడు గంటల వరకు ఈ తతంగం కొనసాగింది. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో 15 లక్షల ఓట్లు ఉంటే అందులో దాదాపు మూడు లక్షలు ముస్లిం ఓట్లు కావడం గమనార్హం. దిన పత్రికలు ఈ వార్తపై సయ్యద్ సంప్రదించగా దాడులు జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు పోలీస్ కంప్లైంట్ ఇవ్వబోతున్నాడని కూడా చెప్పుకొచ్చారు.
అనంతపురంలో జనసేన స్టేజ్ తొలగించిన టీడీపీ నేత ప్రభాకర్ చౌదరి:
అనంతపురం సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ టీడీపీ నేత ప్రభాకర్ చౌదరి పై విమర్శనాస్త్రాలు సంధించారు. పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా జనసేన కార్యకర్తలు, నాయకులు ఏర్పాటు చేసిన స్టేజ్ ని ప్రభాకర్ చౌదరి, తన అనుచరులతో కలిసి తొలగిస్తే జనసేన నాయకులు అప్పటికప్పుడు ఒక లారీని తీసుకొనివచ్చి తాత్కాలిక స్టేజ్ ఏర్పాటు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ తన ఉపన్యాసంలో జనసేన నాయకులను కూడా తప్పు పట్టడం గమనార్హం. “మీరు అప్పటికప్పడు తాత్కాలికంగా స్టేజ్ ఏర్పాటు చేశామని చెబితే అది నాకు ఆనందాన్ని ఇవ్వదు. అసలు స్టేజ్ తొలగించడానికి టీడీపీ నాయకులు ప్రయత్నిస్తే మేము దాన్ని ధైర్యంగా ఎదురొడ్డి ఆపగలిగాము అని చెప్పి ఉంటే ఎంతో సంతోషించేవాణ్ని” అని వ్యాఖ్యానించాడు పవన్ కళ్యాణ్. అయితే ప్రభాకర్ చౌదరి మీద మాత్రం గట్టిగా విమర్శనాస్త్రాలు సంధించాడు.” ప్రభాకర్ చౌదరీ, మాది కొత్త పార్టీ, మా దగ్గర ఉన్న నాయకులు కొత్తవాళ్ళు, యువకులు, మా స్టేజి తొలగించి నువ్వు ఏదో గొప్ప మగాడని అనుకోవద్దు. నీకు నిజంగా దమ్ముంటే వైఎస్సార్సీపీ నాయకుల స్టేజ్ తొలగించి రా. అప్పుడు నువ్వు మగాడివి అని ఒప్పుకుంటా” అంటూ ఈ ప్రభాకర్ చౌదరి లాంటి నాయకుల ప్రతాపం అంతా జనసేన లాంటి పార్టీల మీదేనంటూ చురకలంటించారు.
పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం పర్యటన రద్దు చేయడం పై టీడీపీ మీద విరుచుకు పడుతున్న జనసైనికులు
పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం పర్యటన అనుమతి రద్దు అయింది. ముఖ్యమంత్రి పర్యటన కారణంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ అక్కడ కేంద్రీకృతం కావాల్సి ఉందని అందుచేత మిగతా పర్యటనకు అనుమతి ఇవ్వమంటూ పోలీసు శాఖ పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం పవన్ కళ్యాణ్ పర్యటనకు అనుమతి రద్దు చేస్తోందంటూ జనసైనికులు తెలుగుదేశం పార్టీ మీద భగ్గుమంటున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడంతో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి రేఖా గౌడ్ కన్నీటిపర్యంతమయ్యారు.
జనసేనకు ప్రచారం చేస్తున్న రిక్షావాలా పై దాడి:
స్వచ్ఛందంగా జనసేన కు ప్రచారం చేస్తున్న ఒక రిక్షావాలా పై టీడీపీ నాయకులు దాడి చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కి సంబంధించి కానీ, జనసేన కి సంబంధించి కానీ వార్తలను ప్రధాన మీడియా చానల్స్ బహిష్కరించడంతో, జనసేన వార్తల విషయమై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మాల్సి వస్తోంది. విజయవాడలో స్వచ్ఛందంగా తన రిక్షా పై జనసేనకు ప్రచారం చేస్తున్న వ్యక్తిని టిడిపి కార్యకర్తలు చితకబాదినట్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు స్థానికంగా సంచలనం కలిగించాయి.
జగన్ ఏమో, టీడీపీ జనసేన కుమ్మక్కు అయ్యాయి అంటూ దాడి చేస్తాడని, టీడీపీ నాయకులు, టీడీపీ నేతలు, టీడీపీ ప్రభుత్వం ఏమో జనసేన ను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తోందని జనసైనికులు వాపోతున్నారు. మరి ఈ రెండు ప్రధాన పార్టీల మధ్య స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తాను అంటూ వస్తున్న జనసేన ఏ విధంగా నిలబడుతుంది అన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాలి.