జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేయించిన అభ్యర్థుల వివరాలు బయటకు వచ్చే కొద్దీ ఆశ్చర్యకరమైన వాస్తవాలు తెలుస్తున్నాయి. తనకున్న పరిమితుల్లోనే, వీలైనంతవరకు సామాజిక సేవలో పాలుపంచుకున్న సామాన్యులకు జనసేన టికెట్ ఇవ్వడం ఆహ్వానించదగ్గ పరిణామం.
శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గంలో లో ఉద్దానం సమస్య మీద పని చేసి, అక్కడి ప్రజలను చైతన్యవంతం చేసి, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సంధాన కర్తగా వ్యవహరించిన గేదెల చైతన్య అనే కండక్టర్ కొడుకైన ఒక సామాన్య యువకుడికి పవన్ కళ్యాణ్ టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే విజయనగరం జిల్లాలోని పార్వతీపురం నియోజకవర్గంలో గౌరీ శంకర్ అనే ఒక రైతు కూలి కొడుక్కి పవన్ కళ్యాణ్ టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక దెందులూరులో లో చింతమనేని ప్రభాకర్ మీద కొల్లేరు ప్రజల సమస్యల మీద అ మత్స్యకారుల సమస్యల మీద పోరాడి, ప్రధాని దృష్టికి ఆ సమస్యలను తీసుకువెళ్లిన మత్స్యకారుల జాతీయ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఘంటసాల వెంకటలక్ష్మి కి జనసేన టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డ ఇక్కుర్తి లక్ష్మీ నరసింహ విషయంలోనూ పవన్ కళ్యాణ్ ఎంతో కసరత్తు చేసి టికెట్ ఇచ్చిన విషయం అర్థమవుతుంది.
2018లో ప్రధాని చే ” రూరల్ అచీవర్ అవార్డు” అందుకున్న లక్ష్మీ నరసింహ:
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకొని 2010 లో తన స్వగ్రామమైన యాజలి కి వచ్చేసిన లక్ష్మీ నరసింహ “యాజలి నా జన్మ భూమి” సంస్థను స్థాపించాడు. దీని ద్వారా బాపట్ల నియోజకవర్గం లో ఉన్న తన స్వగ్రామం అయిన యాజలి లో వ్యవసాయ సమస్యల మీద.. ఆల్కహాలిజం మీద పోరాడాడు. తన సంస్థ ద్వారా తరచూ మెడికల్ క్యాంపులు నిర్వహించడం, సేంద్రియ వ్యవసాయం తో పాటు అతి తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేసేలా స్థానిక రైతులకు సదస్సులు నిర్వహించి వారిని చైతన్యవంతం చేయడం, ఇలాంటి కార్యక్రమాలు చేశారు. వ్యవసాయ విషయంలో తాను చేసిన కృషి ఫలించి, రైతులు లాభాలు పొందుకున్నారు. ఇవే కాకుండా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏటేటా ఎక్కువ మంది విద్యార్థులు చేరేలా కృషి చేశారు.
మొత్తానికి తన కృషి గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2018లో తనని “రూరల్ అచీవర్” అవార్డుతో సత్కరించింది. ప్రధాని మోడీ చేతుల మీదుగా లక్ష్మీనరసింహ ఈ అవార్డు అందుకున్నారు.
బాపట్ల జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా లక్ష్మీనరసింహ ని నిలబెట్టిన పవన్ కళ్యాణ్:
గ్రామస్తులతో మమేకమైపోయి ఉండడం, ఆకర్షణీయమైన జీతాన్ని వదులుకొని సామాజిక సేవలో దాదాపు తొమ్మిదేళ్ల పాటు కృషి చేసి ఉండడం, కేంద్ర ప్రభుత్వం చేత గుర్తింపబడే స్థాయిలో తన కృషిని కొనసాగించి ఉండడం లాంటివి దృష్టికి రావడంతో పవన్ కళ్యాణ్ లక్ష్మీ నరసింహ ని బాపట్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. సుమారుగా ఒకటిన్నర లక్షల మంది ఓటర్లు కలిగిన నియోజకవర్గం బాపట్ల. తనను ఇక్కడి నుండి పోటీ చేయమని పవన్ కళ్యాణ్ చెప్పగానే, తాను ఆశ్చర్యపోయానని, ముందుగా తాను ఆసక్తి చూపకపోయినప్పటికీ తను చేస్తున్న సామాజిక కార్యక్రమాలను రాజకీయాల ద్వారా మరింత బలంగా తీసుకెళ్లడానికి వీలవుతుందని పవన్ కళ్యాణ్ సూచించిన తర్వాత తాను పోటికి ఒప్పుకున్నానని లక్ష్మీనరసింహ చెప్పుకొచ్చారు. అయితే మిగిలిన పార్టీల అభ్యర్థుల మాదిరిగా తాను డబ్బు ఖర్చు పెట్టలేనని, రాజకీయాల్లో గెలిచినా, గెలవకపోయినా తాను చేస్తున్న సామాజిక కార్యక్రమాలను కొనసాగిస్తానని లక్ష్మీ నరసింహ అన్నారు.
ప్రజలను విస్మయపరుస్తుంది మీడియా తీరు:
ఎన్నికలయిన మరు నాటి నుండి రాజకీయ వ్యవస్థ మారాలి, అన్ని పార్టీలు మంచి అభ్యర్థులను పోటీకి నిలబెట్టాలి అంటూ లెక్చర్లు దంచే మీడియా సంస్థలు, ఎన్నికల ముందు మాత్రం పోటీలో నుంచున్న మంచి అభ్యర్థుల గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా, ఆ విషయంలో చైతన్యం చేయకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్న తీరు ప్రజలను విస్మయపరుస్తోంది.
మంచి అభ్యర్థులు ఏ పార్టీలో ఉన్నా ప్రోత్సహించాలి:
ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అన్నది పక్కన పెట్టి, సామాజిక సేవా నేపథ్యం నుండి వచ్చిన అభ్యర్థులను ప్రజలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలలో కనీసం ఒక పది మంది అయినా ఇటువంటి నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లు అసెంబ్లీలో ఉన్నట్లయితే అది కాలక్రమేణా ఒక “Dominos effect” కి దారి తీసి సమాజాన్ని మెరుగు పరిచే అవకాశం ఉంది.
మరి మన రాష్ట్ర ప్రజలు మంచి అభ్యర్థులకు పట్టం కడుతారా, లేదంటే షరామామూలుగా డబ్బులు పంచిన, మద్యం పంచిన అభ్యర్థులకు ఓట్లు వేసి, ఆ తర్వాత నాలుగేళ్లపాటు టీవీ కెమెరాల ముందు ” మా ఎమ్మెల్యే మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ” శాపనార్థాలు పెడుతూ కూర్చుంటారా అన్నది ప్రజల చేతుల్లోనే ఉంది.
-జురాన్ (@CriticZuran)