తెలుగు360 నిర్వహిస్తున్న అభిప్రాయసేకరణలో భాగంగా.. ఈ రోజు విశాఖ జిల్లా సర్వేను ప్రకటిస్తున్నాం. వీలైనంత ఎక్కువగా… వివిధ వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకుని… నిపుణుల ద్వారా విశ్లేషించి.. అంచనాలకు రావడం జరిగింది. గత మూడు రోజుల నుంచి ప్రకటిస్తున్న సర్వేల్లో కచ్చితత్వం ఉందన్న అభిప్రాయం మెజార్టీ పాఠకుల నుంచి వచ్చింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా.. మరింత జాగ్రత్తగా విశాఖ జిల్లా సర్వేను ప్రకటిస్తున్నాం.
విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీకి ఓ విధంగా కంచుకోటలాంటి. పార్టీ పెట్టినప్పటి నుంచి మంచి ఫలితాలను సాధిస్తూనే ఉంది. టీడీపీ గాలి వీచినప్పుడు… ఏకపక్ష ఫలితాలను నమోదు చేసింది. గత ఎన్నికల్లో జిల్లాలో పదిహేను స్థానాల్లో… పదకొండు చోట్ల విజయం సాధించారు. ఒక్క చోట బీజేపీ అభ్యర్థికి మద్దతిచ్చి గెలిపించారు. మూడు చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలిచారు. ఆ మూడింటిలో ఒకటి.. మాడుగుల నియోజకవర్గంలో.. 4,700 మెజార్టీ సాధించగా.. మిగిలిన రెండు .. ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలయిన పాడేరు, అరకు. అప్పటికి ఇప్పటికి వైసీపీ పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడకపోగా.. మరింత దిగజారిందని… సర్వేలో వెల్లడయింది. ఓ విధంగా.. జనసేన, వైసీపీ సమానబలంతో కనిపిస్తున్నాయి.
విశాఖ సిటీలో నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ మూడు, బీజేపీ ఒకటి గెలిచింది. విశాఖ దక్షిణంలో.. సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మళ్లీ పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి ఈ నాలుగేళ్ల కాలంలో పార్టీకి సరైన దిశానిర్దేశం లేకుండా పోయింది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కోలా గురువులకు ఆర్థిక సామర్థ్యం లేదని పక్కన పెట్టి.. రమణమూర్తి అనే డాక్టర్‌ను తెచ్చి పాదయాత్ర సమయంలో సమన్వయకర్త పదవి ఇచ్చారు. చివరికి టిక్కెట్లు ప్రకటించే ఒక్క రోజు ముందు.. ద్రోణంరాజు శ్రీనివాస్‌ను పార్టీలోకి తీసుకుని.. టిక్కెట్ ఇచ్చేశారు. దీంతో.. వైసీపీ క్యాడర్లో స్తబ్ధత ఏర్పడింది. ద్రోణంరాజుకు.. వైసీపీ క్యాడర్ సహకరించడం లేదు. బ్రాహ్మణ సామాజికవర్గం ఓట్లు వచ్చినా.. ఇతర వర్గాలు మద్దతిచ్చే అవకాశం కనిపించడం లేదు. మత్స్యకార వర్గానికి చెందిన కోలాగురువులుకు అవకాశం ఇవ్వకపోవడంతో.. ఆ వర్గం ఆగ్రహంతో ఉంది. జనసేన తరపున మత్స్యకార ప్రతినిధి గంపల గిరిధర్ పోటీ చేస్తున్నారు. దీంతో.. ముగ్గురి మధ్య హోరాహోరీ పోరు ఉండనుంది. అంతిమంగా ఇది.. తెలుగుదేశం అభ్యర్థి వాసుపల్లి గణేష్‌కుమార్ విజయానికి తోడ్పడనుంది. విశాఖ నార్త్‌లో… మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపున రియల్ ఎస్టేట్ వ్యాపారి కేకే రాజు బరిలో ఉన్నారు. బీజేపీ తరపున విష్ణుకుమార్ రాజు.. ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో పోటీ చేసి 18వేల మెజార్టీ సాధించారు. జనసేన తరపున పసుపులేటి ఉషాకిరణ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడి నాలుగు పార్టీల మధ్య ఓట్లు చీలిపోనున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా… విష్ణుకుమార్ రాజు.. పరిస్థితి ఎలా ఉంటుందో.. అంచనా వేయడం కష్టమే. భీమిలీ నుంచి విశాక నార్త్‌కు మారాలన్న ఉద్దేశంతో.. గంటా చాలా ముందుగానే ప్రపిరేషన్ చేసుకున్నారు. సామాజికవర్గాల వారీగా నేతల్ని పార్టీలో చేర్చుకుని .. రాజకీయం చేస్తున్నారు. గంటా.. ఈ సారి నియోజకవర్గం మారిన జైత్రయాత్ర కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. విశాఖ ఈస్ట్‌లో.. వైసీపీ అభ్యర్థి విషయంలో చేసిన తప్పు.. ఆ పార్టీకి మొదటే రేసు నుంచి వైదొలిగేలా చేసింది. అక్కడ టీడీపీ తరపున వెలగపూడి రామకృష్ణబాబు పోటీ చేస్తున్నారు. రెండు సార్లుగా ఆయనే ఎమ్మెల్యే. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ…సర్వీస్ చేస్తారన్న పేరు ఉంది. గత ఎన్నికల్లో ఆయనకు ఏకంగా 47వేల మెజార్టీ వచ్చింది. యాదవ సామాజికవర్గం ఎక్కువగాఉండే ఆ నియోజకవర్గంలో వైసీపీ తరపున వంశీకృష్ణయాదవ్ పని చేసుకున్నారు. కానీ చివరి రోజున ఆయనను కాదని.. భీమిలికి చెందిన అక్కరమాని విజయనిర్మలకు టిక్కెట్ ఇచ్చారు. దాంతో.. వైసీపీకి సెల్ఫ్ గోల్ అన్నట్లుగా మారిపోయింది. జనసేన అభ్యర్థిగా కోన తాతారావు పోటీ చేస్తున్నారు. ఆయన చాలా కాలం టీడీపీ నేతగా ఉన్నారు. కాస్త ప్రభావం చూపించగలరు. రెండో స్థానంలో..ఉండటానికి అవకాశం ఉంది. విశాక పశ్చిమ స్థానంలో… టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే పీవీజీఆర్ నాయుడు అలియాస్ గణబాబు మళ్లీ పోటీచేస్తున్నారు. గత ఎన్నికల్లో దాడి రత్నాకర్ పోటీ చేసి .. 30వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ సారి వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ్ ప్రసాద్ ను రంగంలోకి దింపారు. ఇక్కడ జనసేన కూటమి తరపున సీపీఐ అభ్యర్థి జేవీ సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. ప్రధాన పోటీ.. టీడీపీ, వైసీపీ మధ్యే ఉండనుంది. టీడీపీకే ఇక్కడ కూడా విజయావకాశాలు ఉన్నాయి.
మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నంలో పరిస్థితి అనూహ్యంగా టీడీపీకి అనుకూలంగా మారింది. వైసీపీ టిక్కెట్‌ను మల్లీ పెట్ల ఉమాశంకర్ గణేష్‌కే ఇచ్చారు. దాంతో.. బలమైన అనుచరవర్గం ఉన్న ఎర్రా పాత్రుడు, మాజీ ఎమ్మెల్యే బోళెం ముత్యాలపాప … టీడీపీలో చేరిపోయారు. అయ్యన్నకు పూర్తి స్థాయిలో మద్దతిస్తున్నారు. వీరిద్దరూ వైసీపీలో ఉంటే… వైసీపీకి విజయం సునాయాసం అయ్యేది. పైగా.. వైసీపీ క్యాడర్లో కూడా.. ఉమాశంకర్ గణేష్‌పై.. సదభిప్రాయం లేదు. అయ్యన్న పాత్రుడు మరోసారి అసెంబ్లీకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అచ్చంగా ఇదే పరిస్థితి యలమంచిలి నియోజకవర్గంలో ఉంది. అక్కడ నియోజకవర్గంలో పని చేసుకుంటున్న నేతల్ని కాదని.. టీడీపీ నుంచి టిక్కెట్ ఆఫర్‌తో.. మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజును పార్టీలో చేర్చుకుని టిక్కెట్ ఇవ్వడంతో… గత ఎన్నికల్లో పోటీ చేసిన ప్రగడ నాగేశ్వరరావు.. మరో కీలక బొడ్డేడ ప్రసాద్ టీడీపీలో చేరిపోయారు. జనసేన అభ్యర్థి భారీగా ఓట్లు చీల్చుకునే ప్రమాదం ఉండటంతో.. యలమంచిలిలో వైసీపీ పరిస్థితి డొలాయమానంలో పడింది. టీడీపీ అభ్యర్థి పంచకర్ల రమేష్.. గెలుపు కష్టమనుకున్న టీడీపీ..మారిన పరిస్థితులతో.. భరోసా పెంచుకుంది. పెందుర్తిలో నిన్నామొన్నటి వరకు…బండారుకు భరోసా లేకుండా పోయింది. కానీ.. కొణతాలను పార్టీలో చేర్చుకోవడంలో.. జగన్ విఫలం కావడంతో… పరిస్థితి మారిపోయింది. కొణతాల ముఖ్య అనుచరుడు, గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన గండి బాబ్జీ.. టీడీపీలో ఉండిపోయారు. కొణతాల నేరుగా టీడీపీకి ప్రచారం చేస్తూండటంతో… గండి బాబ్జీ కూడా.. బండారుకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. ఇక్కడ ఈ తేడాతోనే టీడీపీ గట్టెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అనకాపల్లి నియోజకవర్గంలో టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపున గుడివాడ అమర్నాథ్ బరిలో ఉన్నారు. జనసేన తరపున గంటా శ్రీనివాస్ బంధువు పడుచూరి భాస్కర్ రావు బరిలో ఉన్నారు. అయితే..ఈ నియోజకవర్గానికి చెందిన దిగ్గజ నేతలు.. కొణతాల, దాడి ఇద్దరూ గత ఎన్నికల సమయంలో వైసీపీలో ఉన్నారు. కానీ టీడీపీ గెలిచింది.ఈ సారి కొణతాల టీడీపీకి మద్దతు ఇస్తున్నారు. దాడి.. వైసీపీలో ఉన్నా… టిక్కెట్ ఇవ్వకపోవడంతో.. ఆ పార్టీకి సహకరించే పరిస్థితి లేదు. ఇక్కడ కూడా.. ఈసారి టీడీపీకే అడ్వాంటేజ్ కనిపిస్తోంది.
పాయకరావుపేట నుంచి ఈసారి వంగలపూడి అనితకు చాన్సివ్వలేదు. బంగారయ్య అనే కొత్త నేతకు టిక్కెట్ ఇచ్చారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన చెంగల వెంకట్రావు… జైలు శిక్షకు గురయ్యారు. ఆయన కుటుంబం టీడీపీలోకి వచ్చింది. టిక్కెట్ కోసం ప్రయత్నించారు కానీ.. చంద్రబాబు చాన్సివ్వలేదు. ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసి ఉపసంహరించుకున్నారు. సంప్రదాయంగా ఇది టీడీపీకి కంచుకోటలాంటి నియోజకవర్గం. ఇక్కడ వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పోటీ చేస్తున్నారు. జనసేన నుంచి నక్కారాజబాబు రంగంలో ఉన్నారు. నక్కా రాజబాబు చీల్చే ఓట్లే జయాపజయాల్ని నిర్ధారించబోతున్నాయి. టీడీపీకే ఇక్కడ కూడా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి.
భీమిలీ నియోజకవర్గంలో.. టీడీపీ స్వయంకృతం ఆ పార్టీకి మైనస్‌గా మారింది. చివరి క్షణం వరకూ అభ్యర్థిని ఖరారు చేయకపోవడం… గంటా కారణం లేకుండా.. నియోజకవర్గాన్ని వదిలేయడంతో.. ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. చివరి క్షణంలో సబ్బంహరికి టిక్కెట్ ప్రకటించారు. ఆయనకు అక్కడ మంచి పరిచయాలు ఉన్నా… గెలుపు మాత్రం అంత తేలిక కాదన్న అభిప్రాయంతో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో.. వైసీపీ అభ్యర్తిగా పోటీ అవంతి శ్రీనివాస్‌కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జనసేన తరపున పోటీ చేస్తున్న పంచకర్ల సందీప్.. వైసీపీ ఓట్లను అధికంగా చీలిస్తే.. ఫలితం తేడా రావొచ్చు. ఇప్పటికైతే… వైసీపీకే అనుకూలంగా ఉంది. చోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున రెండు సార్లు గెలిచిన కేఎస్ఎన్ రాజు మూడో సారి రంగంలో ఉన్నారు వైసీపీ తరపున కరణం ధర్మశ్రీ, జనసేన తరపున పీవీఎస్ఎన్ రాజు పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థిపై వ్యతిరేకత ఉంది. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్లతోనే బయటపడ్డారు. ఈ సారి జనసేన అభ్యర్థి కూడా టీడీపీ ఓట్లను చీల్చుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ వైసీపీకే అనుకూలంగా ఉంది. మాడుగుల నియోజకవర్గంలో… గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన గవిరెడ్డి రామానాయుడు ఈ సారి ఊపు మీద ఉన్నారు. వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు పోటీ చేస్తున్నారు. ఆయన ఐదేళ్ల కాలంలోఏమీ చేయలేకపోవడం ఇబ్బందికర పరిస్థితుల్ని తెచ్చి పెట్టింది. గవిరెడ్డి సోదరుడే.. జనసేన తరపున పోటీ చేస్తున్నా.. ఆ ప్రభావం కొంతే ఉంది. ఈ సారి ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలిచే అవకాశాలున్నాయి.
ఇక ఎస్టీ నియోజకవర్గాలయిన పాడేరు, అరకుల్లో గత ఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీలు సాధించింది. కానీ.. ఈ ఐదేళ్ల కాలంలో.. వైసీపీ నాయకత్వం.. ఈ నియోజకవర్గాల నాయకత్వాలను తీవ్రంగా నిర్లక్ష్యం చేసింది. జగన్ కోసం ప్రాణం ఇస్తానని.. చెప్పే.. విధేయురాలిగా పేరు పడిన… గిడ్డి ఈశ్వరి కూడా పార్టీకి గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. దీంతో ఆమె అక్కడ ఈ సారి టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపున భాగ్యలక్ష్మి అనే నేతకు టిక్కెట్ ఇచ్చినా… ఇద్దరు వైసీపీ నేతలు రెబల్స్‌గా బరిలో ఉన్నారు. జనసేన తరపున మాజీ మంత్రి బాలరాజు రంగంలో ఉన్నారు. వీరందరి మధ్య ఓట్ల చీలికతో.. గిడ్డి ఈశ్వరి మరోసారి విజయం సాధించనుంది. అరకులో ..కిడారి సర్వేశ్వరరావు హత్య తర్వాత ఆయన కుమారుడ్ని పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబు టిక్కెట్ కూడా కట్టబెట్టారు. వైసీపీలో … చెట్టి ఫల్గుణకు చాన్సిచ్చినా.. ఇద్దరు రెబల్స్ బరిలో ఉన్నారు. అయినా.. కుంభా రవిబాబు అనే నేత యాక్టివ్‌గా వైసీపీ కోసం పని చేస్తున్నారు. ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో క్రస్టియానిటీని చాలా పకడ్బందీగా చొప్పించారు. వారంతా.. వైసీపీ లీడర్ ఎవరు అని చూడకుండా ఓట్లేసే పరిస్థితి ఉంది. అందుకే.. ఈ సారి అరకులో వైసీపీకే అనుకూలంగా కనిపిస్తోంది.
ఇక చివరిగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న గాజువాకలో.. పరిస్థితి హోరాహోరీగా ఉంది. మాజీ పీఆర్పీ నేత పల్లా శ్రీనివాసరావు ఆ తర్వాత టీడీపీలో చేరి … గాజువాక నుంచే ఎమ్మెల్యే అయ్యారు. పల్లా విశాఖ లోక్‌సభకు పోటీ చేసినప్పుడు.. ఇక్కడ పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసిన వెంకట్రామయ్య భారీ మెజార్టీతో విజయం సాధించారు. పల్లాది యాదవ సామాజికవర్గం, పవన్ కు కాపు సామాజికవర్గం అండ ఉంటుంది. అయితే.. పవన్ కు ఉన్న ఆకర్షణతో… పల్లా కు ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. వైసీపీ ఇక్కడ మూడో స్థానంలో ఉండే అవకాశం ఉంది. గాజువాకలో పవన్ గెలవొచ్చుకానీ.. వార్ వన్ సైడ్ కాదని చెప్పొచ్చు.
[table id=4 /]