తెలుగువాళ్లకు సినిమాకి మించిన వినోదం లేదు. శుక్రవారం వచ్చిందంటే చూపులన్నీ థియేటర్ వైపు దారులు కడతాయి. ఏ సినిమా వచ్చింది? అనే ఆరా మొదలవుతుంది. కొత్త సినిమాపోస్టర్ కనిపిస్తే… టికెట్ తెగ్గొట్టాలన్న కోరిక పుడుతుంది. ఏ నలుగురు కలసినా సినిమా ముచ్చట్లే. అందుకే…తెలుగు నాట సినిమా ఓ పరిశ్రమగా మారిపోయింది. అయితే.. ఈ యేడాదెందుకో.. తెలుగు నాట `సినిమా` జోష్ కనిపించడం లేదు. మంచి సినిమాలు రాకపోవడం ఓ కారణం అయితే… సినిమా కంటే ‘రాజకీయాల్లో’నే కావల్సినంత వినోదం దొరకడం మరో కారణం. అందుకే.. 2019 తొలి క్వార్టర్లీలో.. టాలీవుడ్ కళ తప్పింది. వరుస పరాజయాలతో బాక్సాఫీసు వెలవెలబోయింది. మూడు నెలల్లో ఫ్లాపులు తగిలాయి…. నిర్మాతలకు అప్పులు మిగిలాయి. టాలీవుడ్ క్వార్టర్లీ రిపోర్ట్ పరిశీలిస్తే…
2019 సంక్రాంతి సీజన్‌కి పెద్ద దెబ్బే తగిలేసింది. కథానాయకుడు, వినయవిధేయరామా ఫ్లాపుల లిస్టులో చేరిపోయాయి. వినయ విధేయ రామకి కనీసం ఓపెనింగ్స్ అయినా వచ్చాయి. ఆ సినిమా ఫ్లాప్ అయినా రూ.50 కోట్ల మార్క్ చేరుకుంది. కథానాయకుడుకి అదీ లేదు. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్లోనే అతి పెద్ద పరాజయాల్లో ఒకటిగా నిలిచిపోయింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘పేటా’ కూడా తెలుగు అభిమానుల్ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. జనవరి మొత్తానికి, సంక్రాంతి సీజన్‌కి ఒకే ఒక్క హిట్టు దొరికింది అది కూడా… ‘ఎఫ్ 2’ రూపంలో. వెంకటేష్, వరుణ్ తేజ్ కథానాయకులుగా నటించిన ఈ చిత్రం వంద కోట్లు దక్కించుకుంది. దిల్ రాజు బ్యానర్లో అత్యధిక లాభాల్ని తెచ్చిపెట్టిన సినిమా ఇదే. ఇప్పుడు ఎఫ్ 2 బాలీవుడ్‌కి కూడా వెళ్తోంది. ఇదే నెలలో విడుదలైన అఖిల్ ‘మజ్ను’ కూడా నిరాశ పరిచింది. అఖిల్ ఫ్లాపులలో ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టేశాడు.
ఫిబ్రవరిలో విడుదలైన యాత్రకి మంచి రివ్యూలే వచ్చాయి. కానీ వసూళ్లు మాత్రం ఆశించినంత దక్కలేదు. ఎన్టీఆర్ బయోపిక్ పరంపరలో వచ్చిన `మహానాయకుడు` మరోసారి నందమూరి అభిమానుల అంచనాలు తల్లకిందులు చేసింది. కథానాయకుడితో పోలిస్తే.. వసూళ్ల పరంగానూ మహానాయకుడు దిగువ స్థానంలో నిలిచింది. మార్చిలో ప్రతీ వారం రెండు మూడు సినిమాలు బాక్సాపీసు దగ్గర అదృఫ్టం పరీక్షించుకోవడానికి వచ్చాయి. అయితే వాటిలో కాసిన్ని వసూళ్లు తెచ్చుకుంది మాత్రం కల్యాన్ఖ రామ్ సినిమానే. గుహన్ దర్శకత్వంలో వచ్చిన 118 దాదాపుగా 12 కోట్లు వసూలు చేసి, నిర్మాతని సేఫ్ జోన్లో పడేసింది. ఈవారం విడుదలైన రెండు సినిమాలూ.. ఫ్లాపుల లిస్టులో చేరిపోయాయి. వర్మ ప్రచారం కోసం చేసిన ఆర్భాటం సినిమాలో లేకపోవడంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ తేలిపోయింది. ఇది లక్ష్మీ పార్వతి బయోపిక్ అని జనాలు సెటైర్లు వేసుకుంటున్నారు. నిహారిక సినిమా సూర్యకాంత డిజాస్టర్ జాబితాలో చేరిపోయింది. జనవరి నుంచి మార్చి వరకూ దాదాపుగా 25 చిన్న సినిమాలైనా వచ్చాయి. అయితే.. అందులో ఒక్కటి కూడా నిర్మాతల్ని ఒడ్డున పడేయలేకపోయింది. చీకటి గదిలో చితక్కొట్టుడు అనే ఏ సర్టిఫికెట్ సినిమాకి మాత్రం టికెట్లు తెగాయి.
ప్రస్తుతం తెలుగు జనాల మాట సినిమాలపై లేదన్నది సుస్పష్టం. రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. ఏప్రిల్ 11 వరకూ.. వాటిపైనే దృష్టంతా. ఇక పరీక్షలు, ఐపీఎల్ హడావుడి ఎలాగూ ఉండనే ఉంది. యువతరం అంతా వాటిపైనే మొగ్గు చూపిస్తోంది. అయితే.. ఓ మంచి సినిమా వస్తే మాత్రం వీళ్లంతా థియేటర్లకు పరుగులు పెట్టడం ఖాయం. మరి… అలా అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకోగలిగే సినిమా ఏదవుతుందో చూడాలి. మొత్తానికి ఈ క్వార్టర్లీ రిజల్ట్ తెలుగు సినిమా నిర్మాతలలో గుబులు పుట్టించేలా చేసింది. అయితే సమ్మర్ సీజన్ ఇంకా మొదలు కాలేదు. ఏప్రిల్ 5న రాబోతున్న మజిలీతో ఈ సీజన్‌కి శ్రీకారం చుట్టబోతోంది చిత్రసీమ. ప్రతీ వారం ఓ క్రేజీ సినిమాని థియేటర్లలో చూడొచ్చు. మరి రాబోయే మూడు నెలలైనా.. టాలీవుడ్‌కి హిట్లు పడతాయేమో చూడాలి.