తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒకలా పట్టు సాధించాలని భారతీయ జనతా పార్టీ ఎప్పట్నుంచో వేచి చూస్తోంది. కానీ, సరైన అవకాశాలు రావడం లేదు. తెలంగాణ ప్రాంతంలో గతంలో కొంత ఉనికి ఉన్నా… ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక నెమ్మదిగా భాజపా కేడర్ తగ్గుతూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీకి గత ఎన్నికల్లో కొంత అవకాశం దక్కింది. టీడీపీతో పొత్తు కారణంగా కొన్ని ఎమ్మెల్యేలు, ఎంపీ సీట్లు కూడా గెలుచుకోగలిగారు. కానీ, పార్టీని విస్తరించుకోలేకపోయారు. ఇప్పుడు ఆంధ్రాలో పరిస్థితి భాజపాకి పూర్తి వ్యతిరేకంగా ఉంది. విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న ఆగ్రహం ప్రజల్లో తీవ్రంగా ఉంది. తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిసినా, అక్కడా ప్రయత్నాలు తగ్గించుకోలేదు భాజపా. ఎన్నికల ప్రచార సభల్లో ప్రధానే స్వయంగా వచ్చి పాల్గొంటున్న పరిస్థితి.
భాజపాకి తెలంగాణలో కొంత బేస్ ఏర్పడే అవకాశం ఇప్పుడు కనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులను భాజపా లక్ష్యంగా చేసుకుంది. ఇప్పటికే రంగంలోకి దిగిన రామ్ మాధవ్ ప్రముఖ కాంగ్రెస్ నేతలను ఆకర్షించే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కి బలమైన నాయకులుగా ఉంటూ వస్తున్న డీకే అరుణ, పొంగులేటి వంటివారు ఇప్పుడు భాజపా గూటికి చేరిపోయారు. మరొకంతమంది కూడా ఇదే బాటలో ఉన్నట్టు సమాచారం. ద్వితీయ శ్రేణి నాయకుల్ని కూడా పెద్ద సంఖ్యంలో భాజపాలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. వీలైనంత మంది నాయకుల్ని ఆకర్షించడం ద్వారా భాజపాకి బలమైన పునాదులు తెలంగాణలో నెమ్మదిగా పడుతున్నాయి. ఇదంతా ఒక దీర్ఘకాలిక లక్ష్యంతో జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది.
తనకు ప్రతిపక్షమే లేకుండా చేసుకోవాలన్నది కేసీఆర్ లక్ష్యం. ఆ క్రమంలోనే టీడీపీని బలహీనపరచారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా అదే తరహాలో దెబ్బతీద్దామనుకుంటే… నేరుగా భాజపా రంగంలోకి దిగేసింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికిప్పుడు ఇదో పెద్ద పరిణామంగా కనిపించకపోయినా… మరో ఐదేళ్ల తరువాత ఎన్నికలు వచ్చేనాటికి తెలంగాణలో తెరాసకు ప్రధాన ప్రత్యర్థి స్థాయికి భాజపా వచ్చే అవకాశాలున్నాయి. ఇది కేసీఆర్ కి సవాల్ గా మారే అవకాశం ఉంది. టీడీపీని బలహీనపరచడంతో కేసీఆర్ రాజకీయ దురందరుడిగా బలంగా కనిపించారుగానీ… రాబోయే రోజుల్లో ఆయన భాజపాని ఎదుర్కోవాల్సి వస్తుంది. స్థూలంగా చెప్పాలంటే… ఒక బలమైన జాతీయ పార్టీ, ఒక రాష్ట్రంపై ఫోకస్ పెట్టి విస్తరణ ప్రారంభిస్తే ఎలా ఉంటుందో… ఆ వ్యూహం అమలును తెలంగాణలో భాజపా ప్రారంభించింది. దాన్ని ఒక ప్రాంతీయ పార్టీ ఎదుర్కోవాల్సి వస్తుంది. భాజపా వ్యూహాన్ని కేసీఆర్ అంచనా వెయ్యకుండా ఉంటారని అనుకోలేం. కానీ, రాబోయే రోజుల్లో తెరాసకి భాజపా నుంచి కొత్త సవాల్ ఎదురు కావడం ఖాయంగానే కనిపిస్తోంది.