గొట్టిపాటి టీడీపీలోకి వస్తే… కరణం వైసీపీలోకి వెళ్తారు అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేసుకున్నారు. ఓ సందర్భంలో విజయసాయిరెడ్డి కరణంతో.. వారానికోసారి చర్చలు జరిపి… ఆఫర్లు మీద ఆఫర్లు ఇచ్చారు. కానీ.. చివరికి ఆ సమస్యను టీడీపీకి ఇబ్బంది లేకుండా వైసీపీనే పరిష్కరించింది. చీరాల ఎమ్మెల్యేను… వైసీపీలో చేర్చుకోవడంతో.. ఆ స్థానాన్ని కరణం బలరాంకు టీడీపీ ఇవ్వడంతో… రెండు వర్గాలకూ అవకాశం లభించినట్లయింది. ఎలా పరిష్కరించుకోవాలా.. అని ఎదురు చూస్తున్న టీడీపీ అధినేత.. ఆమంచి రూపంలో జగనే.. మంచి సాయం చేశారు.
అద్దంకి నియోజక వర్గంలో దశాబ్దాల నుంచి కరణం, గొట్టిపాటి వర్గీయుల మధ్య వైరం ఈనాటిది కాదు. మార్టూరు నియోజకవరం ఇప్పుడు లేదు. అప్పట్లో.. ఈ నియోజకవర్గం పరిధిలో.. కరణం వర్సెస్ గొట్టిపాటి అన్నట్లుగా ఫ్యాక్షన్ తరహా రాజకీయం జరిగింది. హత్యలు కూడా జరిగాయి. టీడీపీ ఆవిర్భావం సమయంలో కాంగ్రెస్‌లో కరణం బలరామకృష్ణమూర్తి 1985లో చంద్రబాబుతో కలిసి టీడీపీలో చేరారు. మార్టూరు నియోజక వర్గం నుంచి టీడీపీ తరపున పోటీచేసి గెలు పొందారు. అంతకుముందు మార్టూరు నియోజక వర్గం నుంచి గొట్టిపాటి హనుమంత రావు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేశారు. గొట్టిపాటిని కాదని కరణంను ప్రొత్సహించడంతో ఇరువర్గాల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఒకరు, కాంగ్రెస్ మరొకరు టీడీపీలో ఉంటూ వచ్చారు. గొట్టిపాటి హనుమంతరావు మృతి తర్వాత … ఆయన వారసుడిగా నర్సయ్యను టీడీపీలోకి తెచ్చారు. ఉపఎన్నికల్లో లక్షకుపైగా మెజార్టీతో గెలిచారు. కానీ వైఎస్ ఆ తర్వాత గొట్టిపాటి కుమారుడు రవిని కాంగ్రెస్‌లోకి తేవడంతో మళ్లీ కరణం వర్సెస్ గొట్టిపాటి అన్నట్లుగా మారిపోయింది.
గొట్టిపాటి హనుమంతరావు మరణం తర్వాత ఆయన కుటుంబాన్ని టీడీపీలోకి తెచ్చారు. ఆ తర్వాత కరణం… అద్దంకికి మారారు. మార్టూరును.. గొట్టిపాటికి ఉంచేశారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన పేరుతో వైఎస్ రాజకీయం చేసి మార్టూరును రద్దు చేసేశారు. అద్దంకి నుంచి గొట్టిపాటి రవి, తెలుగుదేశం నుంచి కరణం బలరాం బరిలోకి దిగారు. దీంతో మరలా కరణం, గొట్టిపాటి వర్గీయుల మధ్య వైరం ప్రారంభమైంది. 2009లో జరిగిన ఎన్నికలలో గొట్టిపాటి రవికుమార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు. ఇక 2014 ఎన్నికలలో రవికుమార్ వైసీపీ తరపున పోటీ చేయగా, తెలుగుదేశం తరపున కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ పోటీచేయగా రవి కుమార్ విజయం సాధించారు. గత ఎన్నికల అనంతరం నెలకొన్న పరిణామాల్లో గొట్టిపాటి రవికుమార్‌ను సీఎం చంద్రబాబు పార్టీలోకి చేర్చుకున్నారు. రవికుమార్ టీడీపీలోకి చేరడంతో మళ్లీ పార్టీలో గొడవ మొదలైంది.
బలరాంకి ఎమ్యెల్సీ పదవి ఇచ్చి రవికుమార్‌కు టిక్కెట్ ఇవ్వాలని డిసైడయ్యారు. అయితే..ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి తీరాల్సిందేన్న ఉద్దేశంలో వారు ఉన్నారు. చివరికి ఎలా అయినా.. వారిని వైసీపీ ఆహ్వానిస్తుందని అనుకున్నారు. కానీ చీరాలను ఖాళీ చేయించి… టీడీపీకి వైసీపీ మేలు చేసింది. ప్రస్తుతం చీరాల నుంచి బల రాంను పోటీకి దించటం ద్వారా ఇరువర్గీయులకు ప్రాధ్యాన్యం ఇచ్చినట్లయింది. దీంతో కరణం వర్గీ యులు కూడా సంతృప్తి చెందారు. వర్గ విభేధాలతో అట్టుడికి గ్రామాల్లో ప్రశాంత వాతా వరణం ఏర్పడుతోంది. రెండు వర్గాలను కలుపుకొని పోయే విషయంలో ఎమ్మెల్యే రవికుమార్ కూడా విజ్ఞతతో వ్యవహరిస్తున్నారు. గ్రామాలలో అందరినీ ఏకం చేస్తున్నారు. కరణం, గొట్టిపాటివర్గాలు కలసి పని చేసినట్లు ఓటర్లు తక్కువ ఉన్నప్పుడే… మార్టూరులో రూ. లక్షకుపైగా మెజార్టీ వచ్చింది. ఈ సారి అంత రాకపోయినా… సగం అయినా వస్తుందన్న ఉద్దేశంతో టీడీపీ వర్గాలున్నాయి.