టీడీపీలో .. ఓటమెరుగని నేతల్లో ఒకరు ధూళిపాళ్ల నరేంద్ర. తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో.. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చినప్పటి నుంచి ప్రతీ ఎన్నికలోనూ గెలుస్తున్నారు. వైఎస్ హవాలో… గుంటూరు జిల్లాలో టీడీపీ ఓ సందర్భంలో తుడిచి పెట్టుకుపోయింది. అప్పుడు కూడా.. ఒక్క ధూళిపాళ్లను మాత్రం… వైఎస్ టచ్ చేయలేకపోయారు. నియోజకవర్గాల పునర్విభజన చేసినప్పుడు.. అసలు పొన్నూరుకు సంబంధం లేని .. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండే గ్రామాలను పెద్ద ఎత్తున పొన్నూరు నియోజకవర్గంలో కలిపినా.. నరేంద్రను… వైఎస్ ఓడించలేకపోయారు. మరి తప్పుల మీద తప్పులు చేస్తూ…జగన్ ఓడించగలరా…?
ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఆరో సారి బరిలో ఉన్నారు. వైసీపీ తరపున ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారి వెంకట రోశయ్య, జనసేన తరపున బోని పార్వతి బరిలో ఉన్నారు. నియోజకవర్గం మొత్తం నరేంద్రకు కొట్టిన పిండి. ప్రతీ గ్రామంలోనూ… పేరు పెట్టి పిలిచేంత చనువు ఉన్న వారు ఉన్నారు. సంగం డైరీ ఆయన గుప్పిట్లోనే ఉంది. రైతులందరితో సన్నిహిత సంబంధాలున్నాయి. అవినీతి ఆరోపణలు లేకపోవడం ఆయన ప్లస్ పాయింట్. సోదరుడి వరుస అయ్యే ఓ బంధువుపై గతంలో ఆరోపణలు వస్తే వెంటనే దూరం పెట్టేశారు. తను బలంగా ఉన్నానని.. సైలెంట్‌గా ఉండే రకం కాదు. ఇప్పటికే.. నియోజకవర్గన్ని చుట్టేసి ప్రచారం చేశారు. వైసీపీకి సంప్రదాయ ఓటర్లుగా ఉన్న ముస్లిం, ఎస్సీ వర్గాలను ఆకర్షించగలిగారు.
వైసీపీ తరపున చివరి క్షణంలో… ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారి రోశయ్యకు టిక్కెట్ ఇచ్చారు జగన్. ఆయనకు గతంలో గుంటూరు వెస్ట్.. ఆ తర్వాత గుంటూరు పార్లమెంట్ బాధ్యతలు ఇచ్చారు. చివరికి పొన్నూరు టిక్కెట్ ఇచ్చారు. ఏదో ఓ అవకాశం ఇవ్వకపోతే.. సీనియర్‌గా ఉమ్మారెడ్డి ఫీలవుతారని..జగన్ అలా సర్దుబాటు చేసినట్లు చెబుతున్నారు. అప్పటికే గత ఎన్నికల్లో అక్కడ పోటీ చేసి ఓడిపోయి… ఐదేళ్లుగా పని చేసుకుంటున్న రావి వెంకటరమణకు జగన్ చివరి క్షణంలో హ్యాండిచ్చారు. దాంతో రావి వర్గం.. వైసీపీ అభ్యర్థి ఎలా గెలుస్తాడో చూస్తామని ప్రకటించారు. వైసీపీ కౌన్సిలర్లు టీడీపీకే బహిరంగంగా మద్దతు పలుకుతున్నారు.
సామాజిక సమీకరణాల విషయంలోనూ.. ఈ సారి నరేంద్రకు ప్లస్ పాయింట్లు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో 33వేల వరకూ కాపు సామాజికవర్గం ఓట్లు ఉన్నాయి. వైసీపీ, జనసేన అభ్యర్థులు అదే సామాజికవర్గానికి చెందిన వారు. దీంతో వైసీపీ ఓటు బ్యాంక్ చీలిపోవడం ఖాయంగా కనిపిసతోంది. ధూళిపాళ్లపై.. ఇప్పటి వరకూ.. ఓ సరైన ప్రత్యర్థిని పార్టీలు ఎంపిక చేసుకోలేకపోయారు. ఐదు సార్లూ.. కొత్త అభ్యర్థులపైనే నరేంద్ర గెలిచారు. అందరూ స్థానికేతరులే. ఈ సారి కూడా కొత్త అభ్యర్థే.. స్థానికేతరుడే. మరి ఫలితం ఎలా ఉంటుందో..?