తెలంగాణ అధికార పార్టీతో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఉన్న దోస్తీ ఎలాంటిదో ప్రజలకు తెలియంది కాదు. ఆ రెండు పార్టీల మధ్య స్నేహం ఏర్పడించే ఉమ్మడి రాజకీయ కక్ష సాధింపుల కోసం. అలాంటప్పుడు తెరాసతో వైకాపా పోరాటం చేస్తుందీ, విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన వాటాలను సాధించుకునే క్రమంలో కేసీఆర్ సర్కారుపై జగన్ ఒత్తిడి తీసుకొస్తాని ఎవరైనా ఊహిస్తారా..? కానీ, వైకాపా నాయకుడు బొత్స సత్యనారాయణ అదే పని చేస్తామంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రాకి రావాల్సిన లక్ష కోట్ల ఆదాయాన్ని లాలూచీ పడి వదులుకున్నారన్నారు. ఆ ఆదాయాన్ని తెలంగాణకు వదిలేశారన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఆయన తోక ముడుచుకుని తెలంగాణ నుంచి అమరావతికి పరుగులు తీసుకుంటూ వచ్చారన్నారు.
తాము అధికారంలోకి రాగానే, రాజ్యాంగబద్ధంగా తెలంగాణ నుంచి ఆంధ్రాకి రావాల్సిన ఆదాయాన్ని కచ్చితంగా వసూలు చేసి తీరతామన్నారు. అనుభవం ఉందని ఆయనకి గత ఎన్నికల్లో ప్రజలు అధికారమిస్తే, పదేళ్లపాటు ఉండాల్సిన రాజధాని హైదరాబాద్ ని వదులుకుని ఆంధ్రాకి వచ్చేశారన్నారు బొత్స. ఇప్పుడు, ఎన్నికల ప్రచారంలో స్థానిక నేతలపై చంద్రబాబుకి నమ్మకం పోయిందీ, అందుకే జాతీయ నేతల్ని ప్రచారానికి తీసుకొస్తున్నారనీ, వారు కూడా చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీలకు కక్కూర్తిపడి వస్తున్నారంటూ బొత్స ఎద్దేవా చేశారు. ఇక, రొటీన్ విమర్శలు, శాపనార్థాలు ప్రస్థావనకు అనర్హం.
తెలంగాణ నుంచి రావాలసిన ఆదాయాన్ని వైకాపా సాధించగలదు అనే కోణంలో ఇంతవరకూ ఆ పార్టీ నాయకులెవ్వరూ మాట్లాడలేదు. ఆ రెండు పార్టీల దోస్తీని ప్రజలు కూడా ఎప్పుడూ అలా చూడలేదు. చివరికి జగన్ కూడా… ఫెడరల్ ఫ్రెంట్ లో భాగంగా తెరాసతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నామని మాత్రమే చెప్పుకొస్తున్నారు. అంతేగానీ, తెలంగాణ నుంచి రావాల్సిన వాటాలను సాధించుకుంటామని ఆయనా చెప్పడం లేదు. ఇప్పుడు బొత్స చెబుతున్నట్టు తెరాసతో పోరాడే పరిస్థితి జగన్ కి ఉండదు. చంద్రబాబు నాయుడుకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నాకే… జగన్ తో స్నేహం బలపడింది. రాజకీయంగా తెరాస అవసరాలకు వైకాపా ఉపయోగపడగలదేమో తప్ప… రాష్ట్ర ప్రయోజనాల సాధనలో భాగంగా కేసీఆర్ ని నిలదీసే స్థాయి వైకాపాకి ఉందనే నమ్మకం ఒక్క బొత్సకి తప్ప… ఆ పార్టీ నేతలకు కూడా ఉండదు అనడంలో ఆశ్చర్యం లేదు.