“వదిలేస్తే గాలికిపోతావన్న” జగన్ మాట వంగవీటి రాధాకృష్ణను.. తీవ్రంగా ప్రభావితం చేసింది. తాను వదిలేస్తే.. జగన్ హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌కు పారిపోతాడని.. ఆయన చేతల్లో నిరూపించడానికి పట్టుదలగా ఉన్నారు. టీడీపీలో చేరిపోయారు. తనకు సీటు కావాలని పట్టుబట్టలేదు. కానీ… జగన్ ను ఓడించడానికి అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తున్నారు. స్టార్ క్యాంపెయినర్‌గా… చంద్రబాబు అవకాశం కల్పించడంతో పాటు.. ఓ షెడ్యూల్ కూడా రెడీ చేశారు. వంగవీటి ప్రభావం ఉంటుందనుకున్న ప్రతీ నియోజకవర్గానికి ఆయనను పంపి ప్రచారం చేయిస్తున్నారు. దీనికి అదనంగా.. చంద్రబాబు కోసం.. వంగవీటి మరో ప్రయత్నం చేస్తున్నారు. అదే … యాగం. యాగం అంటే.. ఎన్నికల యాగం కాదు.. నిజంగానే యాగం చేస్తున్నారు.
విజయవాడలోని పిన్నమనేని పాలీక్లినిక్ ఎదురు రోడ్డులో ఉన్న మున్సిపల్ ఎంప్లాయుస్ కాలనీలోని కె.జె.గుప్తా కల్యాణ మండపంలో ఆదివారం ఉదయం 8.12 గంటలకు 40 మంది రుత్వికులు శ్రీయాగాన్ని ప్రారంభించారు. పండితుల వేదమంత్రోచ్ఛారణలతో యాగం మూడురోజుల పాటు కొనసాగనుంది. వంగవీటి రాధా సోదరి ఆషా దంపతులు తొలిరోజు ఆదివారం పీటలపై కూర్చుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గోపూజ, వాస్తు హోమం జరిపించారు. అనంతరం దుర్గామాత పూజతో శ్రీ యాగం ప్రారంభమైంది. ఇది ఏప్రిల్ 3వ తేదీ ఉదయం 9.45 గంటలకు పూర్ణాహుతితో పరిసమాప్తమవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షతో వంగవీటి రాధా ఆధ్వర్యంలో శ్రీయాగం నిర్వహిస్తున్నారు.
మొత్తానికి నిన్నామొన్నటిదాకా వైసీపీలో ఉన్న వారే.. ఇప్పుడు .. చంద్రబాబు విజయం కోసం.. తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒక్క వంగవీటి రాధాకృష్ణ మాత్రమే కాదు.. కొణతాల దగ్గర్నుంచి చిత్తూరులోని సీకే బాబు వరకూ.. టీడీపీ గెలవడానికి పదవులతో సంబంధం లేకుండా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ వైపు జగన్.. సినిమా యాక్టర్లను చేర్చుకుంటే.. మరో వైపు ప్రజల్లో బలం ఉన్న వారిని… వదులుకుంటున్నారు. ఆ ప్రభావం ఎన్నికల్లో కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.