తణుకులో జనసేన పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బహిరంగ సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ వైయస్ జగన్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మొన్నామధ్య వైఎస్ఆర్సిపి ఎన్నికల ప్రచారంలో భాగంగా గిద్దలూరు లో జగన్ మాట్లాడుతూ వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, అధికారుల్లో అవినీతి లేకుండా చేస్తానని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే జగన్ చేసిన ఈ వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ తణుకు సభలో ఎద్దేవా చేశారు.
వైయస్ జగన్ అన్నది నిజమే నని, జగన్ అధికారంలోకి వస్తే అధికారులకు కూడా మిగల్చకుండా తానొక్కడే మొత్తం అవినీతి చేస్తాడని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించాడు. అవినీతి లేకుండా చేస్తానని, అవినీతి కేసుల కారణంగా రెండేళ్లు జైల్లో కూర్చున్న జగన్ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈయన చేసిన అవినీతి కారణంగానే ఐఏఎస్ అధికారులు సైతం జైలుకు వెళ్లాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ ప్రజలకు మరొక్కసారి గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు, తమ కుటుంబం తప్ప వేరొకరెవరూ రాజకీయాలు చేయలేరని భావిస్తున్నారని అన్న పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి టికెట్లు భారీగా అమ్ముకున్నారని ఆరోపించారు. ఐదేళ్ల పాటు నాయకులను వాడుకొని, ఏడాదికి ఒకరికి టికెట్ ఆశ చూపి వారి చేత ఖర్చు పెట్టించుకుని, చివరికి ఎన్నికలు వచ్చేసరికి ఖర్చుపెట్టిన వారందరినీ పక్కనపెట్టి కొత్తగా ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికి జగన్ టికెట్లు ఇచ్చారని పవన్ కళ్యాణ్ అన్నారు.
కెసిఆర్ ఉద్యమం చేసినప్పుడు తాను కూడా కేసీఆర్ ను గౌరవించానని, కానీ అందుకోసం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదని వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్, జగన్ మాత్రం కెసిఆర్ బిస్కెట్ల కోసం ఆశ పడుతున్నాడని తీవ్రంగా విమర్శించారు. అమిత్ షా కు జగన్ పార్ట్ నర్ గా మారిపోయాడని పవన్ కళ్యాణ్ జగన్ పై పదునైన వ్యాఖ్యలు చేశారు.