అసలే దూరం ..దూరంగా జరిగిపోతున్న పార్టీని… హరీష్ రావు వీలైనంతగా అంటి పెట్టుకుని ఉండే ప్రయత్నం చేస్తూంటే… సందర్భం వచ్చినప్పుడల్లా.. ఆయన టీజ్ చేస్తూ.. అటు కాంగ్రెస్ నేతలు.. ఇటు కొంత మీడియా కూడా హడావుడి చేస్తోంది. ఏప్రిల్ ఫస్ట్ సందర్భంగా… డెక్కన్ క్రానికల్ బ్యానర్ వార్తగానే… హరీష్ రావు బీజేపీలో చేరబోతున్నారని ప్రకటించింది. చివర్లో ప్రాంక్ న్యూస్ అని.. ఏప్రిల్ ఫస్ట్ అని కవర్ చేసుకుంది. కానీ.. ఈ వ్యవహారం కలకలం రేపింది. కొంత కాలంగా హరీష్ రావుకు.. టీఆర్ఎస్ లో ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. చివరికి స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కూడా పేరు లేదు. అయితే… వివాదాస్పదం కావడంతో..పేరు చేర్చారు కానీ .. ఆయనకు ఎలాంటి ప్రచార బాధ్యతలు ఇవ్వలేదు. అయితే.. మెదక్ ఎంపీ బాధ్యతను ఆయనే తీసుకుని… సొంతంగా ప్రచార కార్యక్రమాలు పెట్టుకుని పని చేస్తున్నారు.
టీఆర్ఎస్తో తనకు గ్యాప్ లేదని చెప్పుకోవడానికి ఆయన తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. ఆయన జాగ్రత్తలకు.. మీడియాతో పాటు ఇతరులు.. గండి కొడుతున్నారు. ఈ వార్తను చూసి హరీష్ రావు కూడా అసహనానికి గురయ్యారు. ఆ వార్తా కథనాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ‘‘ప్రముఖ మీడియా సంస్థ నాపై ప్రచురించిన వార్త.. ఫేక్ న్యూస్‌కు గొప్ప ఉదాహరణగా చెప్పొచ్చు. అయితే యావత్ భారతదేశం మొత్తం ఫేక్ న్యూస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఇలాంటి తరుణంలో తప్పుడు వార్తలను, అది ఫ్రాంక్ న్యూస్ అయినా సరే ప్రసారం చేయడం పద్ధతి కాదు. ఇటువంటి చిల్లర వార్తలను ఇంకెప్పుడూ ప్రచురించొద్దని మీడియా సంస్థలను కోరుతున్నారు. ఇదే సమయంలో.. తనపై తప్పుడు వార్తను ప్రచురించిన పేజీలోనే మంగళవారం క్షమాపణలు చెబుతూ మరో వార్తను ప్రచురించాలని డిమాండ్ చేస్తున్నాను’’ అని హరీశ్ రావు ట్విట్టర్ లో డిమాండ్ చేశారు.
అయితే… ఈ వార్తను… డెక్కన్ క్రానికల్ ప్రాంక్ న్యూస్ గా ప్రచురించడం వెనుక చాలా పెద్ద కథ ఉందని చెబుతున్నారు. కొన్నాళ్లుగా బీజేపీలో కొంత మంది నేతలు చేరుతున్నారు. బీజేపీకి ఎలాంటి బలం లేకపోయినా వారెందుకు చేరుతున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు. ఢిల్లీలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే కాబట్టి.. పదవులు ఆఫర్ చేస్తన్నారనేది బహిరంగ రహస్యమే. అయితే చేరే వాళ్లతో.. బీజేపీకి కొత్తగా వచ్చే లాభం ఏమీ ఉండదు. వారి గురి హరీష్ రావుపై ఉందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ నేతలే.. హరీష్ పై ఇలాంటి స్కెచ్ వేసి.. ఒత్తిడి పెంచుతున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. డెక్కన్ క్రానికల్ పత్రికను ఇప్పుడు…. అప్పులిచ్చిన ఆర్థిక సంస్థలే నడుపుతున్నాయి. వాటిని కేంద్ర సంస్థల ద్వారా మేనేజ్ చేయడం చాలా సులువు. అదే చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.