ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ రావాల్సి ఉందని.. నరేంద్రమోడీ రాజమండ్రిలో ఘనంగా ప్రకటించారు. మోడీ ప్రకటనతో రాజకీయవర్గాల్లో ఇప్పటి వరకూ ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యే పరిస్థితి ఏర్పడింది. వైసీపీ తమ మిత్రపక్షమేనని.. బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు. కానీ జగన్ వైపు నుంచి ఖండన రావడం లేదు. ఇప్పుడు.. మోడీ కూడా.. వైసీపీ ఎన్డీఏలోనే ఉన్నట్లుగా… ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని చెప్పుకొస్తున్నారు. రామ్ మాధవ్ కూడా.. వచ్చే ఎన్నికల తర్వాత ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా మిత్రులతో కలిసి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతూ ఉంటారు. ఇప్పుడు మోడీ కూడా.. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వ ప్రస్తావన తెచ్చారు. ఇప్పటికైతే.. ఏపీ నుంచి ఎన్డీఏలో ఎవరూ లేరు. ఏపీలో బీజేపీ లేదు. బీజేపీతో కలిసే పార్టీలు ఏవీ లేవు. అయినా మళ్లీ ఎన్డీఏ సర్కార్ రావాలని.. మోడీ కోరుకుంటున్నారంటే.. దాని వెనుక డబుల్ మీనింగ్ ఉన్నట్లే..!
2014 ఎన్నికల ప్రచార సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన మోదీ మాటలకు.. ఇప్పటి మాటలకు స్పష్టమైన తేడా కనిపిస్తోంది. రాజమండ్రిలో… బహిరంగసభలో మాట్లాడిన మోడీ.. చంద్రబాబుపై.. సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు లాంటి నేతలు చేసే ఆరోపణలు చేశారు కానీ.. గత ఎన్నికల్లో తామిచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో చెప్పడం లేదు. పైగా అవినీతి గురించి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్ట్, కేంద్ర నిధుల్లో దుర్వినియోగం జరుగుతోందని చెప్పుకొచ్చారు కానీ…జగన్ గురించి.. గతంలో జగన్ అవినీతి గురించి తాను చేసిన అవినీతి ఆరోపణల గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఆయన ట్వీట్లు, ప్రసంగాలు అన్నీ చంద్రబాబును గురి పెట్టే ఉన్నాయి. పోలవరాన్ని పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి టీడీపీకి లేదని చెప్పుకొచ్చారు. కానీ నిర్మాణం బాగా జరుగుతోందంటూ.. అనేక అవార్డులు… కేంద్ర ప్రభుత్వ విభాగాలిచ్చాయి. పోలవరం అంచనాలనుకమీషన్ల కోసం అంచనాలను పెంచుతూ పోతున్నారని ఆరోపించారు.
చంద్రబాబు వైఖరి బాహుబలిలో భళ్లాలదేవలా ఉంటుందని మోడీ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు చేయలేని పనులను మిగతావారిపై రుద్దుతున్నారని ఆరోపించారు. చివరికి సేవామిత్ర యాప్ గురించి కూడా..మోడీ విమర్శలు చేశారు. వాళ్లు సేవ చేయడం లేదు.. మిత్రులు కూడా కాదుని చెప్పుకొచ్చారు. సేవామిత్ర పేరుతో డేటాని చోరీ చేస్తున్న వాళ్లు.. రాష్ట్రం మొత్తం చేతుల్లో ఉంటే ఏం చేస్తారో ఆలోచించండని పిలుపునిచ్చారు. ఈ చౌకీదార్… జగన్ అవినీతి ఆరోపణలు, ఆయనపై విమర్శలపై మాత్రం స్పందించలేదు. దీంతో.. జగన్ కోసమే… మోడీ ఏపీలో పర్యటనలు చేస్తున్నారన్న అంశంపై.. రాజకీయ వర్గాలకు క్లారిటీ వస్తోంది.