ఆంధ్రప్రదేశ్‌లో దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు ఉన్నాయని… వాటిని తీసేసేందుకు… ఫామ్-7లు పెట్టామని… వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. యాభై లక్షల ఓట్లను యాభై పెన్ డ్రైవుల్లో పెట్టుకెళ్లి ఈసీకి కూడా ఇచ్చారు. అయినా తీసేయలేదనే ఫిర్యాదులు చేశామన్నారు. కానీ.. అసలు ఆ జాబితాలో.. జగన్ కుటుంబానికి చెందిన ఓట్లు ఉన్నాయన్న విషయాన్ని ఆయన గుర్తించలేకపోయారు. షర్మిలకు హైదరాబాద్, పులివెందులలో ఓట్లు ఉన్నాయి. అనిల్‌కుమార్‌కు అంబర్పేట్, పులివెందులలో ఓట్లు ఉన్నాయి. జగన్ కుమార్తె హర్షిణీరెడ్డికి ఒకే అడ్రస్‌తో రెండు ఓట్లు ఉన్నాయి. తెలంగాణ ఎన్నికల్లో షర్మిల, అనిల్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇలా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్లకు.. ఏపీలో ఓటు హక్కు వినియోగించుకోనివ్వవద్దని ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఈ లెక్కన షర్మిల, బ్రదర్ అనిల్ పులివెందులలో ఓటు హక్కు వినియోగించకోకుండా ఉండాలి. పులివెందులలో షర్మిల, అనిల్ ఓట్లను తొలగించాలని ఈసీని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు.. ఓట్ల విషయంలో… జగన్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఇలా చేసి.. చివరికి తన ఇంట్లోనే.. ఏపీ, తెలంగాణలో ఓటు హక్కు, డబుల్ ఓట్లు ఉన్న విషయాన్ని గుర్తించలేకపోయారు.
తెలుగుదేశం పార్టీ నేతలు దీన్నో రాజకీయ అస్త్రంగా మార్చుకుంటున్నారు. ఇంట్లో దొంగ ఓట్లు పెట్టుకుని.. అసలు ఓట్లను.. తొలగించడానికి.. దరఖాస్తులు ఇచ్చారని ఆరోపణలు చేస్తున్నారు. ఫామ్-7లపై.. ఇప్పటికే.. మూడు వందలకుపైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. తాను వచ్చిన తర్వాత అన్ని కేసులు తీసేస్తానని.. జగన్ పార్టీ క్యాడర్ కు చెబుతున్నారు. కానీ ఏపీ సిట్ మాత్రం.. ఈ విషయంలో.. ఐడీ అడ్రస్‌లతో అసలు కుట్ర కోణాన్ని చేధించడానికి ప్రయత్నిస్తోంది.