భీమవరం లో జరిగిన ఒక సభలో ఫుల్లుగా మద్యం తాగి, ఊగిపోతూ రఘురామ కృష్ణంరాజు ఇచ్చిన స్పీచ్ కి సంబంధించిన వీడియో రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయం అని తెలిసి కూడా తాగి ఊగుతూ ప్రజల మధ్యకు వచ్చి స్పీచ్ ఇస్తున్నాడంటే, ప్రజలు అంటే ఈయనకు ఎంత అలుసో కదా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకుపడిన విషయం తెలిసిందే. అయితే తాను అసలు ఏమాత్రం తాగ లేదని, జనాలే తన వీడియోని స్లో మోషన్ లో చూపించటం ద్వారా తాగినట్టు కనిపించేలా గ్రాఫిక్స్ సృష్టించారని, అసలు ఆ వీడియో మొత్తం మార్ఫింగే అని అంటూ మీడియా మీద, సోషల్ మీడియా మీద రఘు రామ కృష్ణంరాజు రివర్స్ లో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కూడా తెలిసిందే. అయితే ఈ ఎపిసోడ్ ఇంకా మరువకముందే మరొక సంచలనం సృష్టించారు రఘురామకృష్ణంరాజు. ఈసారి ప్రస్తావన అవసరం లేని చోట కూడా కులాల ప్రస్తావన తెస్తూ తన రాజకీయ ప్రత్యర్థుల మీద ఆయన వ్యాఖ్యలు చేసిన వైనం జనాలకు కంపరం కలిగించింది.
రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు మామూలే. అందులోనూ ఎన్నికల సమయంలో వీటి ధాటి మరి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అయితే నరసాపురం నుండి వైఎస్ఆర్సీపీ తరపున ఎంపీ గా పోటీ చేస్తున్న రఘు రామ కృష్ణంరాజు జనసేన తరపున అదే స్థానానికి పోటీ పడుతున్న నాగబాబు ను ఉద్దేశించి కులాల ప్రస్తావన తో విమర్శలు చేశారు. ఎవరైనా ఏదైనా తప్పుచేస్తే “తాటతీస్తా” అన్న పదం తెలుగులో ఒక పద ప్రయోగం గా ఎప్పటి నుండో ఉంది. పవన్ కళ్యాణ్ అవినీతిపరుల తాట తీస్తా అంటూ పలుమార్లు వ్యాఖ్యలు చేసిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఏమన్నాడంటే, ” మీరు కాపులు. కాపు కాసే వాడు కాపు.
మీ పని మీరు చేసుకోండి. నార తీసే వృత్తి వేరు , తాట తీసే వృత్తి వేరు . వాళ్ళని వాళ్ళ పని చేసుకోనివ్వండి. మీ తమ్ముడేమో నార తీస్తా , తాట తీస్తా అంటాడు. నువ్వు ఇంత లావు ఉండి.. తంతే చూస్తూ ఊరుకుంటామా. రండి చూసుకుందాం.” ఇవీ రఘురామ కృష్ణంరాజులు చేసిన వ్యాఖ్యలు.
అయితే సోషల్ మీడియాలో రఘు రామ కృష్ణంరాజు వ్యాఖ్యల మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాము రాజులం కాబట్టి తాము మాత్రమే పరిపాలన చేయాలి అన్న అర్థం వచ్చేలా ఆయన మాట్లాడాడంటూ, ఇది ఆయన అహంకారానికి నిదర్శనం అంటూ వివిధ వర్గాల వారు ఆయన వ్యాఖ్యలను తప్పు పడుతున్నారు. అదీ కాకుండా, కులాలకు- చేసే పనులకు ఒకప్పుడు పూర్తిగా పొంతన ఉందేమో కానీ, ఇప్పుడు అన్ని కులాలవారు అన్ని వృత్తుల లోనూ ఉన్నారు. కానీ ఈ ప్రజాస్వామ్య స్పృహ ని ఆయన గుర్తించకుండా ఇప్పటికీ ఏదో రాచరికపు కాలం లో ఉన్నట్లు ఆయన మాట్లాడుతున్న విధానం మీద సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.