గత ఎన్నికల్లో విశాఖ ఎంపీగా బరిలోకి దిగారు వైకాపా గౌరవ అధ్యక్షురాలు వై.యస్. విజయమ్మ. అయితే, ఘోర పరాజయం ఎదురైంది. వైకాపా అభ్యర్థి అనగానే… కొన్ని గ్యాంగులు విశాఖకు వచ్చాయనీ, అక్కడి భూములపై కన్నేశాయనీ, అక్కడి ప్రశాంతతకు భంగం కలిగే వాతావరణం రాబోతోందనే ఆందోళన ప్రజల్లో మొదలైందనీ… అవే విజయమ్మ ఓటమికి కారణాలని చాలా విశ్లేషణలు వచ్చాయి. ఇది వైకాపాకి అక్కడున్న గతానుభవం. మరి, ఇప్పుడు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలి… గత చర్చలేవీ తెరమీదికి రానీయకుండా ప్రచారం సాగాలి. ప్రస్తుతం విజయమ్మ పోటీలో లేకపోయినా.. ఉత్తరాంధ్ర పర్యటనలో ఆమె ఎక్కువగా రౌడీయిజం అనే టాపిక్ తో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు!
శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన విజయమ్మ.. టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే రౌడీ అనీ, ఆయనే తునిలో రైలు తగలబెట్టారనీ, తన బిడ్డ ఏ అరాచకమూ చెయ్యలేదనీ ఆమె వ్యాఖ్యానించారు. రాజధాని భూములను చంద్రబాబు కబ్జా చేశారని ఆరోపించారు. జగన్ కి ఓటేస్తే ఆత్మహత్య చేసుకున్నట్టే అని చంద్రబాబు అన్యాయంగా మాట్లాడుతున్నారనీ, కానీ తన బిడ్డకు ఓటేస్తే ప్రాణం పోస్తాడని ఆమె చెప్పారు. గత ఎన్నికల్లో విశాఖపట్నంలో ఇలానే విషప్రచారం చేశారని విజయమ్మ గుర్తుచేశారు. జగన్ మీద నిరంకుశంగా కేసులు బనాయించారనీ, ఆస్తులను ఈడీ ఎటాచ్ చేసిందనీ ఆమె ఆరోపించారు. చంద్రబాబుది రౌడీ పాలన అంటూ విమర్శించారు. విజయమ్మ పాల్గొన్న ఐదు సభల్లోనూ ఈ రౌడీయిజం టాపిక్ తీసుకొచ్చి… టీడీపీపై విమర్శలు చేశారు.
గత ఎన్నికల్లో విశాఖ ఓటమిని ఇప్పుడు గుర్తు చేయాల్సిన అవసరం ఏముంది.? ఉత్తరాంధ్ర జిల్లాల్లో రౌడీయిజం టాపిక్ తో విమర్శించడం వల్ల ఏమైనా లాభం ఉంటుందా.. అంటే, నష్టానికే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఈ భావన రేకెత్తడం వల్లనే కదా విశాఖలో వైకాపా ఓడిపోయింది! అది ప్రజలు ఇచ్చిన తీర్పు కాబట్టి… చంద్రబాబు నాయుడు చేసిన దుష్ప్రచారంగా ఇప్పుడు దాన్ని కొట్టిపారేయడం సరైంది కాదు. ఆ ప్రచారం ప్రభావం గత ఎన్నికల్లో వైకాపాపై ఉన్నప్పుడు… ఈసారి ప్రచారంలో అటువైపుగా ప్రజల ఆలోచనా ధోరణిని మళ్లించే వ్యాఖ్యానాలేవీ చెయ్యకుండా జాగ్రత్తపడాలి. ప్రభుత్వాన్ని విమర్శించడానికీ, చంద్రబాబుపై వక్తిగతంగా ఆరోపణలు చేయడానికి చాలా అంశాలు వైకాపా దగ్గర ఉన్నాయి కదా! ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రచారానికి వెళ్లిన విజయమ్మ… విశాఖలో గత ఎన్నికల పరాజయ అనుభవాన్ని గుర్తుచేసి, ప్రజా తీర్పును టీడీపీ దుష్ప్రచారంగా చెప్పడం సరైంది కాదనేది విశ్లేషకుల అభిప్రాయం. పైగా, ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో రౌడీయిజం అనే అంశానికి పెద్దగా రిలవెన్స్ ఉండదు. ఆ కోణంలో విమర్శలు చేయడం కూడా సరైన వ్యూహంగా కనిపించడం లేదు.