లోక్సభ ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లే లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్ఎస్కు.. ప్రచారంలో అంత ఊపు కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికలు మొన్ననే పూర్తి కావడం.. మళ్లీ మళ్లీ బహిరంగసభకు జన సమీకరణ చేయడం.. నేతలకు కష్టం అవుతోంది. చాలా మంది లైట్ తీసుకుంటున్నారు. బరిలో నిలబడిన వారికి సహకరించడం లేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి కేటీఆర్ రంగంలోకి దిగారు. పార్లమెంటుకు పోటీ చేస్తున్న అభ్యర్దులకు కొంత మంది ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సహకరించడం లేదని గుర్తించి.. అందర్నీ పిలిచి మీటింగ్ పెట్టారు. ఎల్బీ స్టేడియం సభకు జనాలను తరలించకపోవడంపై కారణాలను అడిగారు. నిర్లక్ష్యం చూపించకుండా… పార్టీ అభ్యర్దులకు సపోర్టుగా ప్రచారం నిర్వహించి అత్యధిక మెజార్టీ సాధించేందుకు కృషిచేయాలని హిత బోధ చేసారు. కార్పొరేటర్లు అభ్యర్ది విజయానికి సహకరించక పోతే వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో టెకెట్లు ఇవ్వబోమని హెచ్చరించి పంపించారు.
ప్రతి ఒక్క కార్పొరేటర్ పార్లమెంట్ అభ్యర్థి గెలుపు కోసం గట్టిగా కృషి చేయాల్సిందేనన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిదిలో తాను నిర్వహించే రోడ్డు షోలకు భారీగా ప్రజలు హాజరయ్యేలా చూడాలని వారికి దిశానిర్దేశం చేసారు. ఇంటింటికి ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 16 ఎంపీ స్థానాలను టీఆర్ఎస్ గెలుస్తుందని గ్రేటర్ పరిధి లో ఉన్న చేవెళ్ల, సికింద్రాబాద్ మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాల్లోనూ టిఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించేలా కార్పొరేటర్లు కృషి చేయాలని ఆదేశించారు.
మొదటి నుంచి గ్రేటర్ బాధ్యతలను.. కేటీఆర్ చూస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మంచి మెజార్టీ సాధించి పెట్టారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి. దీంతో.. కేటీఆర్కు.. హైదరాబాద్ .. పెట్టని కోటలా మారిపోయిందన్న అభిప్రాయం వ్యక్తమయింది. అయితే అనూహ్యంగా జనం లేక సభను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో.. ఇప్పటి వరకూ వచ్చిన సానుకూలత ఒక్క సారిగా.. తిరగబడిందనే ప్రచారం జరుగుతోంది. దాంతో.. కేటీఆర్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు.