ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. దానికి కారణం.. అసెంబ్లీ ఎన్నికలే. ఒక్క లోక్‌సభ ఎన్నికలు మాత్రమే జరుగుతూంటే.. పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ రాష్ట్ర అంశాలే ఎజెండాగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ కారణంగా… రాజకీయ పార్టీలన్నీ… స్థానిక అంశాల ఆధారంగానే ప్రచారం చేస్తున్నాయి. ఈ అంశాలు ఎంత బాగా ప్రజల్లోకి వెళ్లాయన్నదాన్ని..ఆయా నేతలు ఆయా అంశాలపై ప్రసంగించినప్పుడు… ప్రజాస్పందనను బట్టి అర్థం చేసుకోవచ్చు.
జగన్‌పై చంద్రబాబు పంచ్ డైలాగ్స్‌కు మంచి రెస్పాన్స్..!
తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు… ప్రధానంగా.. జగన్ మైనస్ పాయింట్లను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఏపీ ప్రయోజనాలపై జగన్ మాట్లాడలేని నిస్సహాయత, కేసీఆర్‌తో అంట కాగడం, కేసులభయంతో బీజేపీకి దగ్గరగా వ్యవహరించడం, ఆయన కేసులు ఇలా… జగన్‌పై లెక్కకు మిక్కిలిగా ఉన్న నెగెటివ్ అంశాలను చాలా పకడ్బందీగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఆ తర్వాత.. తన సంక్షేమం, అభివృద్ధి గురించి చెప్పుకుంటున్నారు. జగన్‌తో లింక్ పెట్టి .. కేసీఆర్‌ను విమర్శించినప్పడల్లా.. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. దీంతో.. ప్రజల్లో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందనుకుని డిసైడయ్యారు. అందుకే.. ప్రాంతాలతో సంబంధం లేకుండా.. ప్రతీ చోటా.. కేసీఆర్‌తో జగన్ కుమ్మక్కు అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కేసీఆర్ గతంలో అన్న మాటలతో పాటు ఏపీ అభివృద్ధి ఎలా అడ్డుపడ్డారో వివరిస్తున్నారు. జగన్‌కు సంబంధించిన ప్రతీ అంశాన్ని స్థూలంగా వివరించి.. అలాంటి వ్యక్తికి మనం రాష్ట్రాన్ని అప్పగిద్దామా.. అని ప్రశ్నిస్తూండటంతో… వద్దు.. వద్ద అనే రెస్పాన్స్ సభికుల నుంచి వస్తోంది. ఒక్క చిన్న కేసు ఉన్న వారికే పిల్లను ఇవ్వం.. అలాంటిది.. 32 కేసులు ఉన్న వారికి రాష్ట్రాన్ని అప్పగిద్దామా .. అంటూ వేస్తున్న ప్రశ్న… ప్రధానంగా.. చంద్రబాబు సభల్లో హైలెట్ అవుతోంది. సంక్షేమ పథకాలు, ఇతర విషయాలు కూడా చంద్రబాబు ప్రభావవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు కానీ.. జగన్ అవినీతి, కేసులు, కుమ్మక్కు వంటి విషయాలు చెప్పినప్పుడే ప్రజల్లో మంచి స్పందన వస్తోంది.
చంద్రబాబుపై జగన్ వ్యక్తిగత విమర్శలకు వైసీపీ ఫ్యాన్స్ ఖుషీ..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత.. డిఫెన్సివ్ మోడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఆయనకు చాలా పరిమితులు ఉన్నాయి. కేసీఆర్‌ను సమర్థించాలి. మోడీ మాట ఎత్తకూడదు. కేవలం చంద్రబాబు మోసం చేస్తున్నారని మాత్రమే చెప్పాలి. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రసంగం.. సేమ్ టు సేమ్ అన్నట్లుగా సాగుతోంది. అయితే్.. చంద్రబాబును వ్యక్తిగతంగా విమర్శించినప్పుడు మాత్రం ప్రజల నుంచి మంచి స్పందన రాబడుతున్నారు. జగన్ అన్నింటినీ జనరలైజ్ చేసి చెబుతూండటంతో… అన్నింటికీ … ఒకే రెస్పాన్స్ ఇస్తున్నారు.. ఆయన సభలకు వస్తున్న వారు. ఎక్కడైనా స్థానిక అంశాలపై.. స్పందిస్తే.. అది హాట్ టాపిక్ అవుతుంది. పెనుకొండకు వెళ్లి కియా గురించి..మోడీ గొప్పతనంగా చెప్పడం.. అక్కడే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. చంద్రబాబునే హైలెట్ చేసుకుని… జగన్ ప్రచారం చేస్తున్నారు. అయితే.. విధానపరంగా…ఎలాంటి విమర్శలు చేయడం లేదు. వ్యక్తిగతంగా.. విమర్శించి.. అంతా మోసమే… అని జనరలైజ్ చేసి.. ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రసంగం పూర్తయిన తర్వాత… ఫ్యాన్ గుర్తును చూపిస్తూ.. జగన్ చేసే విజ్ఞప్తి కూడా.. అందర్నీ ఆకట్టుకుంటోంది.
జగన్‌కు పవన్ కౌంటర్లిస్తే.. జనసైనికుల తీన్మార్ ..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం భిన్నంగా సాగుతోంది. సహజంగా.. ఆయన ఫ్యాన్స్ ఎక్కువగా సభలకు వస్తూంటారు కాబట్టి.. ఆవేశంగా.. ఏ డైలాగ్ చెప్పినా.. అభిమానులు మంచి రెస్పాన్స్ ఇస్తూ ఉంటారు. అయితే కారణం ఏదైనా కానీ..చంద్రబాబుపై విమర్శలు చేసినప్పటి కన్నా… జగన్‌పై .. విమర్శలు చేసినప్పుడు.. సవాళ్లు చేసినప్పుడు… ఈలలు, గోలలతో.. జనసైనికులు సందడి చేస్తున్నారు. ప్రధానంగా.. కేసీఆర్‌తో…జగన్ వ్యవహారాలు, సంబంధాలపై విమర్శలు చేసినప్పుడు.. ఎక్కువ స్పందిస్తూంటారు. అలాగే..జగన్ తనపై చేసే యాక్టర్, పార్టనర్ అంటూ చేసే విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చినప్పుడు కూడా… ఆయన అభిమానుల్లో మంచి రెస్పాన్స్ కనిపిస్తూ ఉంటుంది.