అగ్రిగోల్డ్ తరహా స్కామ్ చేసిన ఓ భారీ సంస్థ యజమాని వైసీపీ తరపున విశాఖపట్నం వెస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనే మళ్ల విజయ్ ప్రసాద్. వేల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యజమాని. ఆయన ప్రజల వద్ద నుంచి దాదాపుగా రూ. 1500 కోట్లు వసూలు చేశారు. కానీ అలా డిపాజిట్లు వసూలు చేయడానికి ఎలాంటి పర్మిషన్లు లేవు. సీబీఐ కేసు పెట్టింది. ఆ కేసు విచారణలో ఉంది. కానీ ఆ డిపాజిట్ల సొమ్ము ఎవరిది..? ఎక్కడ్నుంచింది..? డిపాజిటర్ల వివరాలు ఎందుకు లేవు..? వైసీపీ సొమ్మును ఈ సంస్థ ద్వారా కన్వర్ట్ చేశారా..? అన్న అనుమానాలు బలంగా రావడానికి అనేక సాక్ష్యాలు వెలుగులోకి వస్తున్నాయి. తనపై సీబీఐ కేసు విషయాన్ని మళ్ల విజయ్ ప్రసాద్ అఫిడవిట్లోనూ చెప్పారు.
“వేల్ఫేర్ గ్రూప్” సేకరించిన డిపాజిట్లు ఏమయ్యాయి..?
“నమ్మకానికి అమ్మ వంటిది వేల్ఫేర్ గ్రూప్..!” అంటూ… వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ప్రకటనలు హోరెత్తేవి. ఆర్థిక సేవల రంగంలో ఉన్న ఆ కంపెనీ… అధికార పార్టీ సేవలో మునిగి తేలేది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ కంపెనీ యజమానికి ఆప్తుడు. ఆయన రెండు సినిమాలు కూడా నిర్మించారు. ఆ ఊపులో… విశాఖ వెస్ట్ నుంచి 2009లో ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. కానీ ఆ తర్వాత నమ్మకాన్ని అమ్ముకోవడం ప్రారంభించారు. ఏపీలో పరతిని చూపించి… చుట్టుపక్కల రాష్ట్రాల్లో అదీ కూడా చత్తీస్ ఘడ్, జార్ఘండ్, ఒడిషా లాంటి రాష్ట్రాల్లో మరుమూల ప్రాంతాల్లో డిపాజిట్లు సేకరించడం ప్రారంభించారు. ఇలా దాదాపుగా రూ. 1500 కోట్లు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ బిజినెస్ అంతా అచ్చంగా అగ్రిగోల్డ్ సాగినట్లే సాగింది. భూములు కొన్నామని… స్థలాలు ఇస్తామని.. చెప్పేవారు. అయితే.. ఇప్పటికి చాలా మంది చెల్లించలేదు. డిఫాల్ట్ అయ్యారు. సీబీఐ కేసు పేరుతో ఇప్పుడు దాదాపుగా.. వ్యాపారాలను ఆపేశారు. డిపాజిటర్లకు చెల్లింపులు నిలిపివేశారు. కొద్ది రోజుల క్రితం.. ఖాతాదారుల నుంచి వత్తిడి ఎక్కువ అవడంతో.. నెల్లూరులోని కార్యాలయాన్ని మూసేసుకున్నారు.
మెచ్యూరిటీ తీరిన వారికి చెల్లింపులు ఎందుకు లేవు..?
మళ్ల విజయ్ ప్రసాద్ వెల్ఫేర్ గ్రూప్ పేరుతో.. పేద ప్రజల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని చాలా రోజుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. కానీ.. వెల్ఫేర్ గ్రూప్.. ఎక్కువగా ఇతర రాష్ట్రాల్లోనే కార్యాలయాలు పెట్టింది. అక్కడి డిపాజిట్లను చూపి..ఇక్కడ రహస్యంగా… అధిక వడ్డీలు.. రియల్ ఎస్టేట్ లాబాలు చూపి.. డిపాజిట్లు సేకరించింది. చిట్ ఫండ్ బిజినెస్ పేరుతో చిట్స్ కట్టించుకుని… మెచ్యూరిటీ తీరిన వారికీ కూడా చెల్లింపులు చేయడం లేదు. కంపెనీలో డిపాజిట్లను దారి మళ్లించడం ప్రారంభించారన్న అనుమానాలు చాలా కాలంగా ఉన్నాయి. గత ఎన్నికల తర్వాత వైసీపీలో చేరిన ఆయన… కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే మేయర్ అవుదామనుకున్నారు. కానీ జరగలేదు. అయితే.. వైసీపీ ప్రతీ కార్యక్రమానికి ఆయన ఖర్చులు పెట్టుకుంటారన్న ప్రచారం ఉంది.
పులివెందుల వెంచర్‌ను రహస్యంగా ఉంచడం ఎందుకు..?
నోట్ల రద్దు తర్వాత ఆ కంపెనీలోకి.. భారీగా డిపాజిట్లు వచ్చాయని కొత్తగా సంచలనాత్మక విషయం బయటకు వచ్చింది. దాదాపుగా రూ. 450 కోట్లు.. వేల్ఫేర్ కంపెనీలోకి గుర్తు తెలియని వ్యక్తులు డిపాజిట్ చేశారని చెబుతున్నారు. ఆ డిపాజిటర్ల వివరాలను మళ్ల విజయ్ ప్రసాద్ గోప్యంగా ఉంచుతున్నారు. అంతే కాదు.. ఆ తర్వాత కడప జిల్లా పులివెందులలో… ఓ భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు. దీనికి పబ్లిసిటీ చేయలేదు. ఒక్క ప్లాట్ కూడా అమ్మలేదు. దీంతో.. సహజంగానే… దీని వెనుక జరిగిన గూడుపుఠాణి అక్కడ్నుంచే ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఎన్నికల కోసం… ఇప్పుడు… ఆ సొమ్మునే.. వేల్ఫేర్ కంపెనీ నుంచి.. వైసీపీ కోసం ఉపయోగిస్తున్నారని.. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కొన్ని సాక్ష్యాలు బయట పెడుతున్నారు. ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. అసలు డిపాజిటర్లకు చెల్లింపులు నిలిపివేయడం, కొన్ని వందల కోట్లు ఆజ్ఞాత వ్యక్తులు డిపాజిట్ చేయడం.. వంటివి చూస్తూంటే… ఇది మరో అగ్రిగోల్డ్ కావడం ఖాయమన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా.. ” నమ్మకానికి అమ్మవంటిదని” చెప్పుకున్న వేల్ఫేర్ గ్రూప్ కంపెనీ యజమాని మళ్ల విజయ్ ప్రసాద్ నోరు తెరవడం లేదు.