ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఈరోజు యలమంచిలి లో పర్యటించారు. యలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ ను గెలిపించాల్సిందిగా ప్రజలను కోరిన పవన్ కళ్యాణ్, ఈ సభలో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
తనని అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేయాలని ప్రత్యర్థి పార్టీలు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నాయి అని అన్న పవన్ కళ్యాణ్, ” మీరు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా నన్ను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఆపలేరు” అంటూ ప్రత్యర్థి పార్టీలకు సవాలు విసిరారు. జనసేన నాయకులు అసెంబ్లీలో ఉండడం చాలా అవసరం అని చెప్పిన పవన్ కళ్యాణ్, జనసేన గనక లేకపోతే ఈ రెండు పార్టీలు కూడా ప్రజా ధనాన్ని దోచుకుంటూనే ఉంటాయి అని వ్యాఖ్యానించారు. తాము అసెంబ్లీలో లేకపోయినప్పటికీ, ఇప్పటికే తెలుగుదేశం వైయస్సార్ సిపి అనే ఈ రెండు పార్టీలను రోడ్ల మీద నుండే కట్టడి చేస్తున్నామని, వారి అవినీతికి వ్యతిరేకంగా బలంగా గళం వినిపిస్తున్నామని వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్, ఒక్కసారి తాము అసెంబ్లీలో అడుగు పెడితే ఆ రెండు పార్టీల అవినీతిని ఇంకే రేంజ్లో అడ్డుకుంటామో మీరే చూస్తారని చిటికె వేస్తూ సవాలు విసరడంతో ప్రజల నుండి విపరీతమైన స్పందన వచ్చింది.
అదేవిధంగా ఎలమంచిలి లో ఉన్న స్థానిక సమస్యల గురించి అక్కడ ఉన్న చోటా మోటా నాయకులు పవన్ కళ్యాణ్ కి గుర్తు చేయబోతే, ప్రజాపోరాట యాత్రలో భాగంగా వచ్చినప్పుడే ఈ సమస్యలను తాను తెలుసుకున్నానని అంటూ, ఆ సమస్యలను అప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ వారికి తిరిగి చెప్పారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా ఎలమంచిలి సమస్యలు తెలుసుకున్నానని, ఇప్పుడు జనసేన నాయకులని అసెంబ్లీ కి పంపిస్తే వాటన్నింటినీ కచ్చితంగా తీరుస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. భారీగా హాజరైన జనాల మధ్య పవన్ కళ్యాణ్ సభ ఎలమంచిలిలో విజయవంతం అయింది.