జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రచారంలో జోరు పెంచారు. మిత్రపక్షం బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతిని ఆంధ్రప్రదేశ్‌కు రప్పించారు. ఆమెతో రెండు బహిరంగసభలు నిర్వహిస్తున్నారు. జనసేన, బీఎస్పీ, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల అభ్యర్ధుల గెలుపుకోసం బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ప్రచారం చేయనున్నారు. విశాఖ చేరుకున్న ఆమెకు.. పవన్ కళ్యాణ్ సాదర స్వాగతం పలికారు. హోటల్ వద్దకు వచ్చిన ఆమె కారు డోర్ ను స్వయంగా తీసేందుకు ప్రయత్నించారు. ఆ పని భద్రతా సిబ్బంది చేయడంతో.. ఆమె దిగగానే మాయావతి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు.
మాయావతి రెండ్రోజుల పాటు ఏపీ, తెలంగాణాలో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం విశాఖపట్టణంలో పవన్‌తో కలిసి ఆమె పాత్రికేయుల సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం మూడు గంటలకు విజయవాడ అజిత్‌సింగ్ నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించనున్న బహిరంగసభలో పాల్గొంటారు. గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు తిరుపతి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్తారు. గతంలో ఓ సారి మాయావతితో భేటీ కోసం.. లక్నో వెళ్లినా సాధ్యం కాలేదు. కానీ.. ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత… ఆవిర్భావ దినోత్సవ సభను నిర్వహించిన తర్వాతి రోజే… లక్నోకు వెళ్లిపోయారు. మాయావతిని కలిసి పొత్తును ఖరారు చేసుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు కేటాయించారు.
ఇప్పుడు ఆమెను ప్రచారానికి కూడా ఏపీకి వచ్చేలా చేయగలిగారు. జనసేనకు సంప్రదాయంగా ఉంటానుకున్న వర్గాల మద్దతుతో పాటు.. మాయావతి ద్వారా దళిత వర్గాల మద్దతు కూడగట్టుకోవచ్చని.. పవన్ ఆశిస్తున్నారు. అయితే ఏపీలో బీఎస్పీకి ఉనికి లేదు. కేవలం మాయావతిని చూసి జనసేన కూటమికి దళితులు ఓట్లు వేస్తారా అన్న అనుమానాలు కూడా రాజకీయ వర్గాల్లో ఉన్నాయి.