చివరి నిమిషంలో కండువా మార్చేసి వైకాపా తీర్థం పుచ్చుకున్న నేతల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒకరు..! జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకూడదని ప్రసంగించిన కొన్ని గంటల్లోనే… ఆయన సమక్షంలో కండువా మార్చేసి, వైకాపా ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు టిక్కెట్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆ టిక్కెట్ తనకే కచ్చితంగా వస్తుందనీ, జగన్ తనకు అవకాశం ఇస్తారనీ, తన రాజకీయ జీవితంలో ఇవే చివరి ఎన్నికలు అనే అభిప్రాయంతో ఉన్న మేకపాటి రాజమోహన్ రెడ్డికి ఈ పరిణామం జీర్ణించుకోలేని అంశంగా మారింది. పార్టీ కోసం అన్ని విధాలుగా నష్టపోయిన తనను జగన్ పక్కనపెట్టేశారనే అసంతృప్తితో మేకపాటి ఉన్నారు. అయితే, బహిరంగంగానే ఆయన అసంతృప్తి వ్యక్తం చేయలేదు. దీంతో, ఆదాల ప్రభాకర్ రెడ్డికి మేకపాటి మద్దతు ఇస్తారనీ, జగన్ నిర్ణయంపై ఆయనకి ఎలాంటి అసంతృప్తి లేదనీ వైకాపా నేతలు అభిప్రాయపడ్డారు.
ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందంటే… ఆదాలకు మద్దతుగా మేకపాటి వర్గం ప్రచారం చేయడం లేదని తెలుస్తోంది! ప్రస్తుతం మేకపాటి ఇంటికే పరిమితం అవుతున్నట్టు సమాచారం. వైకాపా అభ్యర్థి తరఫున ప్రచారం చేయాలంటూ పార్టీ నుంచి కబురు వచ్చినా కూడా… ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తానని మేకపాటి అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మేకపాటి రాజమోహన్ రెడ్డికి ఉదయగిరి, ఆత్మకూరు నియోజక వర్గాల్లో గణనీయమైన ఓటు బ్యాంక్ ఉంది. ఆయన అనుచరులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరంతా ఆదాల మీద ఆగ్రహంగా ఉన్నారనీ, పార్టీ ఆదేశించినా కూడా ఆదాలకు అనుకూలంగా వీరు పనిచేసే పరిస్థితి స్థానికంగా లేదని తెలుస్తోంది.
ఆదాల ఎంపీ అభ్యర్థి కాబట్టి.. ఆ నియోజకవర్గ పరిధిలోని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులైనా పార్టీపరంగా ఐకమత్యం ప్రదర్శిస్తున్నారా అంటే అదీ లేదనే సమాచారం! ఎంపీ అభ్యర్థి ఆదాలతో కలిసి ప్రచారం చేసేందుకు కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఆసక్తి చూపించడం లేదట! ఆదాల ప్రచారానికి వస్తానని అంటుంటే… రేపూమాపూ అంటూ కొంతమంది వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులే ఆయన్ని పక్కన పెడుతున్న పరిస్థితి ఉందని తెలుస్తోంది! చివరి నిమిషంలో ఆయన వైకాపాలోకి వచ్చిన తీరు చివరికి ఆ పార్టీలోని వారికే నచ్చని పరిస్థితి! సొంత పార్టీలోనే పరిస్థితి ఇలా ఉంటే, ఆయన గురించి ప్రజల్లో ఇంకెలా ఉందో, దాన్ని ఎదుర్కొంటూ ఆయన ఎన్నికల బరిలో ఎలా ముందుకు సాగుతారో చూడాలి.