ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అందరి దృష్టి జనసేనపై ఉంది. జనసేన తరపున పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు… ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నర్సాపురం నుంచి బరిలో ఉండి.. గోదావరి జిల్లాల్లో ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఇతర మెగా కుటుంబసభ్యులెవరూ.. ప్రచారంలో పాల్గొనడం లేదు. ముఖ్యంగా.. మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రచారంలో పాల్గొనడం లేదు. ఆయన ప్రచారానికి వస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అందులో నిజం ఉందా ..?
జనసేనకు చిరంజీవి ప్రచారం చేస్తే విమర్శలొస్తాయా..?
చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి దూరం అయిన తర్వాత.. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనడం లేదు. రాజ్యసభ సభ్యత్వం ముగిసిన తర్వాత ఇక రాజకీయాల్లోకి రారని.. అనధికారికంగా… మెగా కుటుంబం నుంచి ప్రకటన వచ్చింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో… ఆయన పేరు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పెట్టారు. అయినా ప్రచారానికి వెళ్లలేదు. అయితే.. కొన్నాళ్ల క్రితం.. ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మాత్రం.. చిరంజీవి కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తారని.. ఎన్నికల్లో ఆయనే తమ స్టార్ క్యాంపెయినర్ అని ప్రకటించారు. కానీ.. చిరంజీవి వైపు నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇతరుల గురించి రఘువీరా ప్రకటిస్తే.. ఎలా..? చిరంజీవి ప్రచారం గురించి చిరంజీవి ఒక్క సారి కూడా ప్రకటించలేదు. ఆ మాటకొస్తే చిరంజీవి ఇప్పుడు.. ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ తెలియదు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు..,. మహిళా రిజర్వేషన్లు, సచార్ కమిటీ నివేదిక అమలు.. ఇలా చాలా వాటి గురించి చెప్పి… వాటిని అమలు చేయడానికి కాంగ్రెస్‌లో చేరుతున్నానని చెప్పారు. కానీ ఇంత వరకూ ఆ హామీలేమీ అమలు కాలేదు.
కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనంపై సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందా..?
నాగేంద్రబాబు… పీఆర్పీలో తెర వెనుక పని చేశారు. ఆయన తెర ముందు ఎప్పుడూ.. యాక్టివ్‌గా లేరు. అదే సమయంలో.. పీఆర్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంలో.. ఆయన పాత్రేమీ లేదు. అందుకే.. ఆయన పవన్ కల్యాణ్‌కు మద్దతుగా ముందుకు వచ్చారు. కానీ.. చిరంజీవి.. ఇప్పుడు.. పవన్ కల్యాణ్ కోసం ప్రచారానికి వస్తే.. ఆయనతో పాటు అనేక ప్రశ్నలు… కూడా వస్తాయి. పవన్ కల్యాణ్ కూడా చిరంజీవి లాగే చేస్తారా.. అంటారు. 78 లక్షలు ఓట్లు వస్తే ఏం చేశారు..? పీఆర్పీని కాంగ్రెస్‌లో ఎందుకు కలిపారు..? ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారా.. లేదా..? రాజకీయాల్లో ఎందుకు యాక్టివ్‌గా లేరు…?.. ఇలా అనేక ప్రశ్నలు వస్తాయి. ఇవి రావడం వల్ల పవన్ కల్యాణ్‌కు ఇబ్బందికరం అవుతుంది. పీఆర్పీ అనుభవం లేకపోతే.. తనకు రాజకీయ అనుభవం ఉండేది కాదని పవన్ కల్యాణ్ పదే పదే చెబుతూ ఉంటారు. పీఆర్పీ స్థాపన… ఆ తర్వాత ఆ పార్టీ కార్యకలాపాల విషయంలో.. పవన్ కల్యాణ్ కీలకంగా వ్యవహరించారు. కానీ.. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే విషయంలో మాత్రం భాగం కాలేదు. సపోర్ట్ చేయలేదు.. అప్రూవ్ చేయలేదు.
చిరంజీవి వల్ల జనసేనకు అదనంగా వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదా..?
2014 ఎన్నికల సమయంలో .. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గానే ఉన్నారు. అయినప్పటికీ.. సొంత పార్టీ పెట్టుకున్న పవన్ కల్యాణ్.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వలేదు. టీడీపీ – బీజేపీకి మద్దతుగా నిలిచారు. ఏ విధంగా చూసినా.. జనసేన పార్టీని పెట్టడానికి..ఆ పార్టీని కొనసాగించడానికి ఓ భూమిక ఏర్పాటు చేసుకున్నారు. ఒక వేళ చిరంజీవి వస్తే.. ఆ భూమికపై అనేక ప్రశ్నలు వస్తాయి. చిరంజీవి వస్తే.. అనేక విమర్శలు వస్తాయి తప్ప.. ప్రయోజనం ఏమీ ఉండదు. సహజంగా.. మెగా కుటుంబం హీరోల అభిమానులందరూ.. ఒక్కరే ఉంటారు. చిరంజీవికి, పవన్ కల్యాణ్‌కు.. ఇతర మెగా కుటుంబ హీరోలకు వేర్వేరుగా అభిమానులు ఉండరు. వాళ్లంతా.. ఇప్పటికే పవన్ కల్యాణ్‌కు మద్దతుగా నిలిచారు. అందువల్ల చిరంజీవి ఇప్పుడు ప్రత్యేకంగా వచ్చినా… ప్రయోజనం ఉండదు. అందుకే పవన్ కల్యాణ్ చిరంజీవి దూరం పెట్టారని అనుకోవచ్చు.