ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలపై వరాల జల్లులు కురిపిస్తున్నారు. పసుపు కుంకుమతో పాటు, అన్నదాత సుఖీభవ పథకాల నిధులను జమ చెయ్యకూడదంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయడం, దాన్ని కోర్టు కొట్టేయడంతో ఈ పథకాల కింద నిధుల విడుదలకు అవరోధాలు ఉండవని స్పష్టమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. తాను రెండు విడతల పసుపు కుంకుమ పెట్టానన్నారు. మూడో విడత చెక్కు వేశాననీ, రేపో ఎల్లుండో వెళ్లి ఆడబిడ్డలంతా తీసుకోవాలన్నారు. ఈ చెక్కులు చెల్లవంటూ వైకాపా నాయకులు ఎద్దేవా చేశారని గుర్తుచేశారు. ఈ చెక్కులు అడ్డుకోవడం కోసం ఎన్నికల కమిషన్ దగ్గరకి వెళ్లారనీ, మన హైకోర్టుతో పాటు ఢిల్లీ హైకోర్టుకు కూడా వెళ్లారన్నారు. అయినా వాళ్లేం చెయ్యలేకపోయారనీ, ఈ పథకానికి సంబంధించిన సొమ్ముని ముందే సిద్ధం చేసి ఆదేశాలు ఇచ్చానని చంద్రబాబు చెప్పారు.
నిన్నా మొన్నా తాను మూడే అనుకున్నాననీ, చెల్లమ్మల ఆనందం చూస్తుంటే… మూడుసార్లు కాదు, ఇకపై ప్రతీయేటా పసుపు కుంకుమ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. తనకు కోటిమంది సోదరీమణులు ఉండటం అదృష్టమన్నారు. ఈ అన్న కోసం నాలుగు రోజులు పనిచెయ్యాలనీ, ఇంటింటికీ వెళ్లి టీడీపీకి ఓటెయ్యాలని కోరాలన్నారు. ముసలివాళ్లకు ఫించెన్ పెంచితే వైకాపా దొంగలు దానిక్కూడా అడ్డుపడ్డారనీ, రైతులకు అన్నదాత సుఖీభవ కింద డబ్బులిస్తే దాని మీదా వీళ్లు కోర్టుకు వెళ్లారనీ, ఇలాంటివారిని నిలదీయాల్సిన అవసరముందన్నారు. ఈ నెలలోనే రైతు రుణమాఫీ బకాయిల చెక్కుల్ని కూడా వేసేస్తున్నా అన్నారు. పెద్ద ఎత్తున ఆదాయాన్ని తీసుకొచ్చి, మళ్లీ దాన్ని ప్రజలకే పంచిపెడతా అన్నారు సీఎం. కోడి కత్తి పార్టీకి ఈ పని చెయ్యగలుగుతుందా, వారికి అవగాహనా ఉందా అంటూ ప్రశ్నించారు?
పసుపు కుంకుమ పథకం టీడీపీకి ఈ ఎన్నికల సమయంలో మంచి ఊపే తీసుకొచ్చినట్టుగా కనిపిస్తోంది. సరిగ్గా, ఎన్నికలకు వారం ముందే సొమ్ము అందేట్టుగా చంద్రబాబు ప్లాన్ బాగానే చేసుకున్నారు. ఈ చెక్కులు చెల్లవంటూ వైకాపా విమర్శలు చేసింది. చివరికి కోర్టు కూడా ఈ నిధుల చెల్లింపుపై సానుకూలంగా స్పందించింది. దీంతో… సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు వైకాపా అడుగడుగునా ప్రయత్నిస్తోందనే విమర్శను ముఖ్యమంత్రి ప్రజల్లోకి పెద్ద ఎత్తున ప్రచారంగా తీసుకెళ్తున్నారు. దీనికి సరైన కౌంటర్ కూడా వైకాపా నుంచి రావడం లేదు. ప్రతీయేటా పసుపు కుంకుమ హామీ మహిళలపై కచ్చితంగా ప్రభావం ఉంటుందనే అనిపిస్తోంది. ఎందుకంటే, ఈ పథకాన్ని అమలు చేసి చూపించి మరీ హామీ ఇస్తున్నారు కదా!