రాష్ట్రమంతా ఒకెత్తు… ఇప్పుడు నిజామాబాద్ ఎంపీ సీటు గెలుపు మరో ఎత్తు అన్నట్టుగా తెరాసకు సవాలుగా మారింది అక్కడి పరిస్థితి! 16 ఎంపీ సీట్లు గెలిచి, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుదామని సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. కానీ, తన కుమార్తె కవిత పోటీ చేస్తున్న నిజామాబాద్ ఎంపీ స్థానం ఇప్పుడు తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. అక్కడ 185 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. నామినేషన్లు వేసిన రైతులను ఉపసంహరింపజేసేందుకు తెరాస మంతనాలేవీ పనిచెయ్యలేదు. దీంతో ఇప్పుడు టీడీపీ నేత మండవ వెంకటేశ్వర్రావును కేసీఆర్ రంగంలోకి దించుతున్న తీరు చూస్తున్నదే. అయితే, ఇంతకీ నిజామాబాద్ లో రైతులు వెనక ఎవరైనా ఉన్నారా..? కేసీఆర్ కు సవాల్ విసరడం కోసం ఈ పరిస్థితిని బలమైన అస్త్రంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నది ఎవరు..? రైతుల సమస్య ఈ స్థాయికి వచ్చేందుకు ఎవరి ప్రోత్సాహం ఉంది..? ఇప్పుడీ చర్చ తెర మీదకి వచ్చింది.
నిజానికి, సమస్యలపై రైతులు కొన్నాళ్లుగా ఉద్యమిస్తున్నా… ఆ సమయంలో భాజపా, కాంగ్రెస్ ల నుంచి పెద్దగా మద్దతు రాలేదు. కొందరు రైతులు నామినేషన్లు వేయడం మొదలుపెట్టాక… కేసీఆర్ మీద తిరుగుబాటుకు ఇది సరైన అస్త్రంగా పనికొస్తుందనే ఆలోచన ఆయా పార్టీలకు వచ్చింది. దాంతో రైతులకు సలహాలిచ్చి మరీ నామినేషన్లు వేయించేందుకు ప్రోత్సహించారు. ఫలితంగా పరిస్థితి అనూహ్యంగా కేసీఆర్ కి సవాల్ గానే మారింది. నామినేషన్ల ఉప సంహరణకు మూడు రోజులు గడువు ఉందనగా తెరాస నేతలు పెద్ద ప్రయత్నమే చేశారు. నామినేషన్లు వేసినవారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ, భాజపా, కాంగ్రెస్ లు నామినేషన్లు వేసిన రైతుల వెనక బలంగా ఉండటంతో తెరాస నేతల వ్యూహాలు ఫలించలేదు. పోటీలో ఉంటేనే సమస్యలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని నాయకులు సలహాలు ఇవ్వడంతో రైతులు బలంగా నిలబడి ఉన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో ఏదో ఒక జాతీయ పార్టీకి పూర్తి మద్దతు ఇవ్వాలనే ఆలోచనలో నామినేషన్లు వేసిన రైతులు ఉన్నట్టు సమాచారం. ఈ నెల 7 లేదా 8వ తేదీలో సమావేశమై.. ఏదో ఒక పార్టీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలనే నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పోటీలో ఉన్న రైతుల్లో కొంతమందికి భాజపా నుంచి, మరికొందరికి కాంగ్రెస్ నుంచి మద్దతు ఉందట! ఈ రెండు పార్టీల ఉమ్మడి లక్ష్యం… నిజామాబాద్ ఎంపీ స్థానానికి జరిగే ఎన్నికల్లో తెరాసకు చుక్కలు చూపించడం! రైతుల తీర్మానం ప్రకారం ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా, రెండో పార్టీ వారికి సాయం చేయాలనే ఉమ్మడి లక్ష్యంతో ఉన్నట్టూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి, నిజామాబాద్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది.