ప్రజాకర్షక పథకాలతో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ప్రకటించింది. తెలుగు నూతన వికారి నామ ఉగాది పూజ, పంచాంగ శ్రవణం తర్వాత తెలుగుదేశం మానిఫెస్టోను విడుదల విడుదల చేశారు. ఇప్పటికే తాను మానిఫెస్టోలో పెట్టే అంశాలపై చంద్రబాబు పలు బహిరంగ సభలలో ప్రకటిస్తూ వచ్చారు. వాటినే ఇప్పుడు మేనిఫెస్టో రూపంలో ప్రకటించారు. పగటి పూట సాగుకు 12 గంటల కరెంట్, నిరుద్యోగ భృతి రూ.3వేలు, 18 ఏళ్లకే నిరుద్యోగ భృతి, సీపీఎస్ రద్దుకు చర్యలు, ప్రతి ఉద్యోగికీ ఇంటి స్థలం 3 నెలల్లో కేటాయింపు, పేదల ఇళ్ల రుణాల మాఫీ, పరిశ్రమల్లో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే అనే హామీ, 2 పండగలకు 2 సిలిండర్లు, వీలైతే పండగలన్నిటికీ ఉచిత సిలిండర్లు ఉచితంగా ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. ఇక రైతులకు అన్నదాత సుఖీభవ, మహిళలకు పసుపు-కుంకుమ పథకాలు కొనసాగింపు… నిరుద్యోగ భృతిని మూడు వేలు చేయడం, ఇంటర్ పాసయిన వారికి కూడా.. నిరుద్యోగభృతి వర్తింప చేయడం, ఇరవై వేల జనాభా ఉన్న ప్రతీ చోటా ఎన్టీఆర్ క్యాంటిన్లు ఏర్పాటు చేయడం వంటి హామీలు మేనిఫెస్టోలో ఉన్నాయి.
సామాజిక పెన్షన్లు మూడు వేలు చేయడం, పెన్షన్ల వయసు అరవై ఐదు నుంచి అరవైకి తగ్గించడం, చంద్రన్న బీమా పరిమితి పది లక్షలకు పెంచడం వంటి పథకాలను మరింతగా విస్తరించేందుకు హామీలిచ్చారు. ఇక పేదల ఇళ్లకు సంబంధించిన పాత, కొత్త రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న బీసీలకు ఆదరణ వంటి పధకాలతో పాటు పది వేల కోట్ల రూపాయలతో బీసీ బ్యాంకు, ముస్లీలంకు కూడా వెనుకబడిన వారికి ఆదుకునేందుకు మరో బ్యాంకును ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ‘మీ భవిష్యత్తు.. నా బాధ్యత’ అని మేనిఫెస్టోకు నామకరణం చేశారు. ప్రధానంగా రైతులు, సామాన్యులు, యువత, మహిళలకు ఈ మేనిఫెస్టోలో పెద్దపీట వేశారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టోపై చంద్రబాబు సెటైర్లు వేశారు. ఎలా చేస్తారో చెప్పకుండా…ఏ మాత్రం అవగాహన లేకుండా హామీలు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. మొత్తానికి హామీలు చూసి.. ఓట్లేసేవాళ్లు ఎవరైనా ఉంటే… వారిని ఆకట్టుకునే విషయంలో.. జగన్ మేనిఫెస్టోతో చంద్రబాబు పోటీ పడ్డారని అనుకోవచ్చు.