తెలుగు360 రేటింగ్ 3.25/5
ఆర్ద్రత అంటే ఏమిటి గురువుగారూ అని అడుగుతాడు శిష్యుడు శంకరాభరణంలో శంకరశాస్త్రిని.
సంగీతంలో అయినా సినిమాలో అయినా ఆర్ద్రతను అనుభవించి పలవరించాల్సిందే తప్ప, వివరించడానికి వుండదు. కొన్ని సినిమాలు అయితే అనుభవించి, ఎవరికి వారు మనసు లోతుల్లో పలవరించుకోవాల్సిందే తప్ప, బయటకు ఇదీ అనే భావాన్ని వ్యక్తం చేయడానికీ వుండదు.
తెలుగు సినిమాల్లో భావోద్వేగాలను తెరపైకి తేవడం అన్నది కష్టం. చిటికెడు ఎక్కువైనా, తక్కువైనా గాడి తప్పేస్తుంది వ్యవహారం. అందుకే ఎవరో కొద్ది మంది దర్శకులు తప్ప, ఇలాంటి వ్యవహారాల జోలికిపోరు. తొలిసినిమా మళ్లీరావే సినిమాలో ఇద్దరు ప్రేమికుల మధ్య వుండే సున్నితమైన భావావేశాలను అంతకన్నా సున్నితంగా తెరపైకి తెచ్చిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈసారి భార్య భర్తలు, తండ్రీ కొడుకుల నడుమ వుంటే అనుబంధాలు, ఆవేశాలను తెరపైకి తెచ్చాడు.
జెర్సీ కథ వుందీ అంటే వుంది. లేదూ అంటే లేదు. సినిమా ప్రథమార్థం అంతా కలిపి కొడుకుకు పుట్టిన రోజు కానుకగా స్పోర్స్ జెర్సీ కొనడానికి ఓ అయిదు వందల కోసం తండ్రి చేసే ప్రయత్నం. ద్వితీయార్థం అంతా ఆ కొడుకు దృష్టిలో హీరోగా నిలిచి వుండాలని అదే తండ్రి చేసే ప్రయత్నం. అంతకన్నా ఏమీ లేదు. ఈ నడుమ వున్నదంతా భావోద్వేగాలు నిండిన సన్నివేశాలే. ‘అందరి దృష్టిలో నేను లూజర్ నే. కానీ ఇప్పటి వరకు నన్ను జడ్జ్ చేయని నా కొడుకు దృష్టిలో కూడా అలాగే మిగిలిపోకూడదు’ అనే తపన నే సినిమాకు మెయిన్ పాయింట్.
అర్జున్ (నాని) మంచి క్రికెటర్. ప్రేమించిన సారా(శ్రద్ద శ్రీనాధ్)ను పెళ్లి చేసుకుంటాడు. ఫుడ్ కార్పొరేషన్ లో ఉద్యోగం అకారణంగా పోతుంది. మాంచి ఫామ్ లో వుండగా క్రికెట్ ను వదిలేస్తాడు. చిన్న ఉద్యోగం చేస్తూ ఖర్చులకు సరిపోక, అర్జున్ వైఖరి అంతుపట్టక సారా బాధ ఒకవైపు, పైకి చెప్పలేని అర్జున్ బాధ ఇంకో వైపు, ఇలాంటి నేపథ్యంలో ఒక్కసారిగా మళ్లీ కొడుకు కోసం బ్యాట్ పట్టుకుంటాడు. అలా విజయ తీరానికి చేరి కొడుకు దృష్టిలో హీరోగా నిలిచిపోతాడు. అదీ కథ.
ఇది పక్కాగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి అమితంగా ప్రేమించి తయారుచేసుకున్న స్క్రిప్ట్. ప్రతి సీన్ ను ఇలా వుండాలి. పాత్రలు ఇలా వుండాలి. ఇలా బిహేవ్ చేయాలి. అని పూర్తి డిటైల్డ్ గా తయారుచేసుకున్న స్క్రిప్ట్. సాధారణంగా కథ ఎక్కువగా వుంటే సన్నివేశాల్లో డిటైల్డ్ వర్క్ అన్నది తక్కువ వుంటుందేమో? ఇక్కడ సినిమాకు సన్నివేశాలే బలం కావడంతో మరింత కేర్ తీసుకున్నాడు దర్శకుడు.
కొడుకును తండ్రి చెంప దెబ్బ కొట్టిన సీన్ లో, ‘అమ్మకు ఎందుకు అబద్దం చెప్పావ్ అని తండ్రి అడిగితే, నువ్వు కొట్టావని చెబితే అబద్దం అనుకుంటారు’ అని బదులు చెప్పించడం లాంటివి కొన్ని సన్నివేశాల మీద దర్శకుడు చేసిన వర్క్ ను చెబుతాయి.
సినిమా తొలిసగం చాలా స్మూత్ గా సింపుల్ గా టేకాఫ్ తీసుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్, ప్రెజెంట్ ఎపిసోడ్ లను పడుగుపేకల మాదిరిగా ఏమాత్రం కన్ఫ్యూజ్ చేయకుండా పేర్చుకుంటూ వెళ్తాడు దర్శకుడు. అయితే తొలిసగం మొత్తం దాదాపు ఒకటే పాయింట్ చుట్టూ రన్ చేస్తూ, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లను జతచేస్తూ వెళ్లడం వల్ల కాస్త స్లో టేకింగ్ అన్న ఫీల్ కలుతుంది. సిన్మా రెండో సగంలోకి ప్రవేశించిన తరువాత భావోద్వేగాల డోస్ పెరుగుతుంది. చివరి అరగంట ప్రేక్షకులు సినిమాలో లీనమైపోయేలా చేస్తుంది. ద్వితీయార్థంలో పండిన భావోద్వేగాలు జనాలను తొలిసగం తప్పలు క్షమించేలా చేస్తాయి. దాంతో ప్రేక్షకుడు ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ తో బయటకు వస్తాడు.
మహానటి తరువాత ఓ పీరియాడిక్ సినిమా ను ఇంత సింపుల్ గా, ఇంత డిటైల్డ్ గా ప్రెజెంట్ చేయడం ఇదేనేమో? అలా అని పాతకాలాన్ని కళ్ల ముందు పెడతా అంటూ భారీగా సెట్ లు వేయించలేదు. సింపుల్ గా అవసరమైన మేరకే చూపించడం, మాటల్లో కూడా పీరియాడిక్ సినిమా అన్నది మరిచిపోకుండా వుండడం విశేషం.
దర్శకుడి అదృష్టం ఏమిటంటే, అతను కష్టపడి తయారుచేసుకున్న స్క్రిప్ట్ కు న్యాయం చేయడం కాదు, మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లగల హీరో దొరకడం, సాంకేతిక నిపుణులు లభించడం, ఇలాంటి సబ్జెక్ట్ ను, కేవలం దర్శకుడి నేరేషన్ మీద ఆధారపడి ఓకె చెప్పి ముందుకు వెళ్లగల నిర్మాత దొరకడం.
సినిమాను దర్శకుడు ఊహిస్తే, కథనాయకుడు నాని దాన్ని నిజం చేసి కళ్ల ముందు వుంచాడు. దర్శకుడు చెప్పిన పెయిన్ ను తన కళ్లలో పలికించి, ప్రేక్షకులకు ట్రాన్స్ మిట్ చేయడం అన్నది చిన్న విషయం కాదు. నాని ఆ ఫీట్ ను అద్భుతంగా చేసాడు. క్రికెట్ లాంటి స్పోర్స్ ను అంత ఫెర్ ఫెక్ట్ గా వర్కవుట్ చేసి, ఆడి చూపించడం, మెప్పించడం నటుడిగా చిన్న విషయం కాదు. నానిని నేచురల్ స్టార్ అని ఎందుకుంటారో, ఈ సినిమా చూస్తే మరింత స్ఫష్టం అవుతుంది. ఎక్కడా ప్రొఫెషనల్స్ కూడా వంకపెట్టలేని విధంగా క్రికెట్ మ్యాచ్ లను చిత్రీకరించారు. నిజానికి క్రికెట్ మ్యాచ్ లను అంత లెంగ్తీగా చిత్రీకరించి, ప్రేక్షకులను కూర్చోపెట్టగలం అనుకోవడం కాస్త సాహసమే. కానీ ఆ మ్యాచ్ లను అంత్యంత రియలిస్టిక్ గా చిత్రీకరించడం అన్నది మెచ్చుకొదగ్గ విషయం. ఎడిటర్ నవీన్ నూలి, సినిమాటోగ్రాఫర్ షాను ఈ విషయంలో చాలా కష్టపడినట్లు క్లియర్ గా తెరపై తెలుస్తుంది. అనిరుధ్ అందించిన నేపథ్యసంగీతం కొత్తగా వుండడమే కాదు, సన్నివేశాలను మరింత బలంగా ప్రేక్షకులకు హత్తుకునేలా చేసింది.
దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్, మ్యూజిక్ డైరక్టర్, ఈ నలుగురూ కలిసి, హీరో నాని సపోర్ట్ తో అందించిన సినిమా ఇది. వీరిలో ఏ ఒక్కరిని తక్కువా చేయలేం, ఎక్కువా చేయలేం. హీరోయిన్ శ్రద్ధ శ్రీనాధ్, సత్యరాజ్, ఫ్రవీణ్ తదితరులంటే మంచి సపోర్ట్ అందించారు.
సినిమా అంటే వినోదానికి మించి అనే మాటకు అప్పుడప్పుడు వచ్చే ఇలాంటి సినిమా అర్థంగా మిగుల్తాయి.
ఫినిషింగ్ టచ్…..ఓ మంచి సినిమా
తెలుగు360 రేటింగ్ 3.25/5