తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీకి సిద్ధమేనని.. తలైవా రజనీకాంత్ ప్రకటించారు. రాజకీయ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికల్లో సూపర్ స్టార్ రాజకీయ నేతగా.. తమిళనాడు రాజకీయాల్లో హడావుడి చేయాల్సిన తలైవా రజనీకాంత్.. నిన్నటి ఎన్నికల్లో ఓటర్‌గానే మిగిలిపోయారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రాక ముందు నుంచి.. రజనీకాంత్ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా.. అన్నదానిపై విస్తృత ప్రచారం జరిగింది. చివరికి.. తాను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించేశారు. చివరికి ఓటర్‌గా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ జోష్ బాగా ఉందేమో కానీ.. తర్వాతి రోజే… మళ్లీ తన పార్టీ గురించి మాట్లాడటం ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా..పోటీకి రెడీ అంటూ ప్రకటించేశారు.
నిజానికి రజనీకాంత్ ఇంత వరకూ… పార్టీని అధికారికంగా ప్రకటించలేదు. అభిమానుల కోసం మాత్రం.. ఓ వేదికను ఏర్పాటు చేశారు. అక్కడితో రాజకీయ పార్టీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. వరుసగా సినిమాలు ఒప్పుకుని షూటింగులు చేసుకుంటున్నారు. ఈ సమయంలో.. మళ్లీ.. ఎన్నికల గురించి మాట్లాడటం తమిళనాట హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కూడా.. కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. తమిళనాడులో పార్లమెంట్‌తో పాటు 18 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉపఎన్నికలు జరిగాయి. మరో నాలుగు స్థానాలు కూడా ఖాళీగా ఉన్నాయి. వాటికీ త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 18 స్థానాలను డీఎంకే గెలుచుకుంటే ప్రభుత్వం మారిపోతుంది. కనీసం… పది స్థానాలను అయినా అన్నాడీఎంకే గెలుచుకోకపోతే.. ప్రభుత్వం కూలిపోతుంది. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. డీఎంకేను.. దినకరన్ పార్టీని ఎదుర్కొని.. పళనీస్వామి, పన్నీర్ సెల్వం నేతృత్వంలోని అన్నాడీఎంకే పది చోట్ల విజయం సాధించడం అంత తేలిక కాదన్న ప్రచారం జరుగుతోంది.
లోక్‌సభ ఎన్నికల తర్వాత.. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లోనూ అనూహ్యమైన మార్పులు వస్తాయన్న ప్రచారం జరుగుతోంది. మే 23 తర్వాత… ఉపఎన్నికలు జరిగిన మెజార్టీ సీట్లలో డీఎంకే గెలిచినా.. కేంద్రంలో మోడీయేతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా..ప్రస్తుతం… తమిళనాడులో ఉన్న పళనీస్వామి ప్రభుత్వం నిలబడం కష్టం అని.. అక్కడి రాజకీయవర్గాలు అంచనాకు వచ్చేశాయి. ప్రభుత్వాన్ని కూల్చడానికి… దినకరన్ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలోనే రజనీకాంత్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.