సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ని ఉద్దేశించి వై ఎస్ ఆర్ సి పి నేత, జగన్ అక్రమాస్తుల కేసులో ఏ-2 గా ఉన్న విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు లక్ష్మీనారాయణ సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు.
ముందుగా విజయ్ సాయి రెడ్డి ట్వీట్ చేస్తూ “సొంతంగా పోటీ చేసిందే 65 సీట్లలో. పవన్ కళ్యాణ్ అనుంగు అనుచరుడు జేడి లక్ష్మీనారాయణేమో 88 స్థానాల్లో గెల్చి జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని జోస్యం చెబుతున్నాడు. ఇతను దర్యాప్తు చేసిన కేసుల్లో కూడా ఇలాగే లేనివి ఉన్నట్టు రాసాడు. ఇది కూడా చంద్రబాబు బ్రీఫింగేనా?” అని ప్రశ్నించారు. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి.
దీనికి అదే సోషల్ మీడియా సాక్షిగా కౌంటర్ ఇచ్చిన లక్ష్మీనారాయణ “గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు, జనసేన పార్టీ పోటీ చేసింది 140 స్థానాలు సొంత బలం మీద. మిత్రపక్షాలైన బి.ఎస్.పి 21, సి.పి.ఐ., సి.పి.ఎం వామపక్షాలు 14. అలా మొత్తం చేరి 175 స్థానాలకు జనసేన కూటమి పోటీ చేసింది.
మా లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి, మా లెక్కలు సరిగ్గా ఉంటాయి. మీరు CA చదివారు అయినా కూడా మీ లెక్కలు తప్పులు ఎలా అవుతున్నాయో మాకు అర్ధం అవ్వట్లేదు. మీ లెక్కలు సరిచూసుకోండి ఎందుకంటే మేము సత్యం, న్యాయం మీద ఆధారపడి పనిచేసేవాళ్ళం కాబట్టి. మీ తప్పుడు లెక్కల వల్ల ఎంతోమంది ఇరుక్కున్నారు. ఇప్పటికైనా మంచి లెక్కలు నేర్చే విధానాన్ని మొదలుపెట్టండి ” అని ట్వీట్ చేశారు.
ఏది ఏమైనా ఈ మధ్య పలు రకాల వ్యాఖ్యలతో విజయ్ సాయి రెడ్డి అభాసుపాలు అవుతున్నాడు. ఆ మధ్య వివేకానంద రెడ్డి చనిపోతే తాను “సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాను” అని వ్యాఖ్యానించి నెటిజనులచేత చీవాట్లు పెట్టించుకున్న విజయసాయిరెడ్డి, దాని తర్వాత పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి “ఉల్లిపాయ” అంటూ వ్యాఖ్యలు చేసి సొంత పార్టీ నేతలే అసహనానికి గురయ్యేలా చేశారు. ఇప్పుడు ఈ తప్పుడు లెక్కల ట్వీట్లతో వైయస్సార్సీపీ పరువును మరొకసారి బజారుకీడ్చారు.