ఉత్తరప్రదేశ్లో భిన్నమైన రాజకీయ వాతావరణం ఉంటుంది. ఒకప్పుడు… అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలు సీట్లు పంచుకునేవి. దాంతో.. సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పాటయ్యేవి. కానీ… గత పదిహేనేళ్లుగా పరిస్థితి మారిపోయింది. ఓ సారి బీఎస్పీకి పూర్తి మెజార్టీ వచ్చింది. ఆ తర్వాత ఎస్పీకి చాన్సిచ్చారు. ఈ సారి బీజేపీకి ఇచ్చారు. అయితే.. ప్రతీ సారి.. ఆలా.. సింగిల్ పార్టీకే మెజార్టీ రావడానికి ప్రధాన కారణం…సామాజికవర్గాల మేళవింపే. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి సీఎం అయినప్పుడు.. దళిత ఓటర్లకు.. బ్రాహ్మణ వర్గాన్ని జత చేశారు. ఆ ప్రయోగం సక్సెస్ అయింది. ఆ తర్వాత అఖిలేష్ యాదవ్ ముస్లిం – ఓబీసీ వర్గాల్నీ సమీకరచించి విజయం సాధించారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోనూ అలాంటి మ్యాజిక్ కనబడతోంది. మాయావతి – ములాయం ఒకే వేదికపైకి రావడంతో.. వారి కాంబినేషన్.. సంచలనం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీ చేయాలని తీర్మానించినప్పటి నుంచి రెండు పార్టీల్లో కొత్త జోష్ కనిపించింది. రెండు పార్టీలు పొత్తుగా పోటీ చేస్తాయని ప్రకటించిన తర్వాత యూపీ రాజకీయ వాతావరణం వేడెక్కింది. తర్వాత సీట్ల గుర్తింపు, మూడు స్థానాలు అజిత్ సింగ్ నేతృత్వంలోని ఆర్ఎల్డీకి కేటాయించడం చకచకా జరిగిపోయాయి. ఉమ్మడి ప్రచారం ఉంటుందా.. కార్యకర్తలు ఉమ్మడి ప్రచారానికి కలిసి వస్తారా అన్న ప్రశ్నలు కొనసాగుతుండగా, ములాయం – మాయావతి ఆ అనుమానాలకు సైతం తెరదించారు. 15 సంవత్సరాలుగా ములాయం ప్రాతినిధ్యం వహిస్తున్న మెయిన్ పురిలో ఉమ్మడి ర్యాలీతో ములాయం, అఖిలేష్, మాయావతి ఒకే వేదికపై కనిపించారు. రెండు పార్టీల కార్యకర్తలను ఒక దగ్గరకు చేర్చే ప్రక్రియలో భాగంగానే ఉమ్మడి ర్యాలీ జరిగింది. ఏడు దశల్లో పోలింగ్ జరుగుతున్న యూపీలో రెండు దశలు పూర్తయిన తర్వాత మెయిన్ పురి ర్యాలీ నిర్వహించారు.
ఎస్పీ, కార్యకర్తలు బీఎస్పీకి సహకరిస్తారా.. ఇది నిజంగా పెద్ద ప్రశ్నే. పొత్తు ప్రకటించినప్పుడు ఇద్దరు నాయకుల మదిలో మెదిలిన తొలి ప్రశ్న కూడా అదే. అయితే రెండు దశల ఎన్నికల్లో కార్యకర్తల ఉత్సాహం, ఓటింగ్ సరళిని చూసిన తర్వాత నాయకుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. అటు యాదవ సామాజిక వర్గం, ఇటు దళిత సామాజిక వర్గం ఓటర్లు, కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నారని తెలిసిపోయింది. పైగా రెండు సామాజిక వర్గాలతో కలిసిపోతూ, వారి విజయానికి ముస్లిం గ్రూపులు కూడా బాగానే పనిచేస్తున్నాయి. ముస్లిం ఓట్లు రెండు పార్టీలకు బదిలీ అవుతున్నాయి. దళిత ఓట్లు ఎస్పీకి ఉపయోగపడుతున్నాయి. ఓబీసీ ఓట్లు దళిత అభ్యర్థులకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.