తెలంగాణలో ఇప్పుడు… టార్గెట్ ఉద్యోగులు అన్నట్లుగా ఉద్యమం నడుస్తోంది. తెలంగాణ ఉద్యమాన్ని భుజాల మీద మోసిన ఉద్యోగులు.. ఇప్పుడు అవినీతి పరులుగా ప్రజల ముందు నిలబడిపోయారు. ఆ శాఖ.. ఈ శాఖ అనే తేడా లేదు.. ప్రభుత్వ ఉద్యోగులంతా… అవినీతి పరులేనని..నేరుగా… ప్రభుత్వమే ముద్రవేస్తోంది. టీఆర్ఎస్ అధికారిక పత్రికల్లో ధర్మగంట పేరుతో ప్రత్యేకంగా ఉద్యోగుల అవినీతిపై కథలు.. కథలుగా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన ప్రారంభమయింది. రెవెన్యూ ఉద్యోగులు భారీ అవినీతికి పాల్పడుతున్నారని సీఎం కేసీఆర్ బహిరంగంగానే ప్రకటించారు. ఇతర ఉద్యోగులపైనా అదే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ఉద్యోగుల్లో అలజడి ప్రారంభమయింది.
ఇప్పటికే రెవెన్యూ శాఖలోని పలు సంఘాలు సమావేశమై తమ నిరసనను తెలపాయి. కొన్ని సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి అభ్యంతరం ప్రకటించాయి… శాఖలో అందరూ ఎక్కువగా వీఆర్వో లనే టార్గెట్ చేస్తున్నారుని వీఆర్వో సంఘాలు మండిపడుతున్నాయి. ఆ సంఘాలు విడిగా సమావేశమై తమ నిరసనను తెలియచేస్తున్నాయి. ఆందరూ తమనే నిందిస్తున్నారని సమావేశంలో వీఆర్వో ల సంక్షేమ సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం వైఖరికి నిరసనగా సహాయ నిరాకరణ,వర్క్ టూ రూల్ చేపట్టాలని నిర్ణయించారు. తెలంగాణాలో పన్నెండు వేలకు పైగా గ్రామాలుంటే నాలుగు వేల మంది మాత్రమే విఆర్వోలు ఉన్నారు. దీంతో ఒక్కో విఆర్వో అదనంగా మూడు నుండి నాలుగు గ్రామాల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదనపు బాధ్యతలు స్వచ్చందంగా వదులుకోవాలని నిర్ణయించారు. ఇతర శాఖల బాధ్యతలు అప్పగిస్తే నిర్వర్తించేది లేదని తేల్చి చెప్పారు.
తమపై ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు పది లక్షల కరపత్రాలు ముద్రించి ప్రజలకు వివరించాలని నిర్ణయించుకున్నారు. రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావాలంటే సమగ్ర భూ సర్వేనే పరిష్కారమని అభిప్రాయపడ్డారు..ఖాళీలు భర్తీ చేసి,సాంకేతిక శిక్షణ,సాంకేతికి పరికరాలు సమకూరిస్తే ఇబ్బందులు రావని సంఘం అభిప్రాయపడుతోంది. మొత్తానికి కేసీఆర్ గతంలోనే చెప్పినట్లు.. రెవిన్యూ ఉద్యోగులు సమ్మె చేస్తారని… ప్రజలు సహకరించాలని కోరినట్లుగా.. పరిస్థితి మారబోతోంది. ఉద్యోగులపై అవినీతి ముద్ర పడిపోవడంతో.. వారికి ప్రజల మద్దతు లభించడం కూడా కష్టమే. కానీ ప్రభుత్వ పనితీరుపై చూపే ప్రభావం కూడా ప్రజలను ఇబ్బంది పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.