తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు కేరళకి బయలుదేరుతున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో సాయంత్రం తిరువనంతపురంలో భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సీఎంలు ఇద్దరు మాట్లాడుకునే అవకాశం ఉందని సమాచారం. ఆ తరువాత, రామేశ్వరం, శ్రీరంగం క్షేత్రాలకు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. ఈ పర్యటన ముగిశాక… ఈ నెల 13న చెన్నై వెళ్లేందుకు ముఖ్యమంత్రి ప్లాన్ చేసుకుంటున్నారు. డీఎంకే అధినేత స్టాలిన్ తో భేటీ కానున్నట్టు సమాచారం. ఈ భేటీ ఎందుకూ అంటే… తాజా రాజకీయ పరిస్థితులపై మాట్లాడేందుకే అని తెరాస వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడు పర్యటన తరువాత కర్ణాటకకు కూడా కేసీఆర్ వెళ్తారని తెలుస్తోంది. ఆ పర్యటనకు సంబంధించిన తేదీలను కూడా త్వరలో ఖరారు చేస్తారట. కర్ణాటక ఈఎం కుమారస్వామితో కేసీఆర్ భేటీ ఉంటుందనీ అంటున్నారు. మొన్ననే… తెలంగాణకు కొంత నీరు విడుదల చేయాలంటూ కుమారస్వామిని కేసీఆర్ కోరగానే ఆయన సానుకూలంగా స్పందించారు.
లోక్ సభ ఎన్నికల ఫలితాలకు కొద్దిరోజులు ముందు దక్షిణాది రాష్ట్రాలకు కేసీఆర్ వరుస ప్రయాణాలు పెట్టుకున్నారంటే… ఇది ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటులో భాగంగానే కనిపిస్తోంది. కేంద్రంలో కాంగ్రెస్, భాజపాలకు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే మెజారిటీలు రావని ఆయన మొదట్నుంచీ చెబుతున్నారు. కాంగ్రెసేతర, భాజపాయేతర ఫ్రెంటే దేశానికి అవసరమని అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత వరుసగా కొన్ని రాష్ట్రాల్లో పర్యటించి, నేతలతో భేటీ అయ్యారు. అయితే, ఎన్నికల ముందు ఫెడరల్ ఫ్రెంట్ కి ఒక స్పష్టమైన రూపం అంటూ ఇవ్వలేకపోయారు. కాంగ్రెసేతర, భాజపాయేతర కూటమి అనగానే ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీలు కాస్త వెనకంజవేశాయి.
ఇంకోపక్క, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే స్టాలిన్, కుమారస్వామిలతో మంచి దోస్తీ ఏర్పాటు చేసుకున్నట్టే. తమిళనాడు వెళ్లి, స్టాలిన్ తరఫున ప్రచారం చేశారు. కర్ణాటక వెళ్లి, కుమార స్వామి తరఫునా ప్రచారం చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో కూడా మంచి సంబంధాలే నెరుపుతున్నారు. దాదాపుగా భాజపా వ్యతిరేక పార్టీలన్నింటితోనూ టచ్ లో ఉంటున్నారు. ఎన్నికల ఫలితాల తరువాత పరిస్థితులను అనుకూలంగా మార్చి, కూటమి ఏర్పాటుకు కావాల్సిన వేదికను ఆయనా సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ మళ్లీ టూర్లు మొదలుపెట్టడం విశేషం.