వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శల ఊకదంపు చేశారు! ఈసారి కూడా తాజాగా వచ్చిన ఫొని తుఫాను నేపథ్యంలోనే టీడీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. తుఫాను వచ్చినప్పుడల్లా నష్టాల పేరుతో భారీ ఎత్తున దొంగ బిల్లులు పెట్టడం చంద్రబాబు నాయుడుకి అలవాటన్నారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు పెద్ద సంఖ్యలో పోయాయంటూ గతంలో ట్రాన్స్ కోకి దొంగ బిల్లులు పెట్టి సొమ్ము చేసుకున్నారన్నారు. గతంలో కూడా ఒడిశాకి వేల సంఖ్యలో స్తంభాలు పంపించినట్టు తప్పుడు లెక్కలు చూపించి, టీడీపీ నేతలకు దోచిపెట్టారని ఆరోపించారు. సరే… గతంలో ఎప్పుడో అలా దోచుకుంటే అప్పుడే ఎందుకు విజయసాయి నిలదియ్యలేకపోయారు..? అప్పుడే ఎందుకు సాక్ష్యాధారాలు బయటపెట్టలేకపోయారు..? కనీసం ఇప్పుడైనా ట్రాన్స్ కోకి సంబంధించిన దొంగ బిల్లుల్లో ఒకటైనా చూపించరా..?
అధికారంలో లేకపోయినా సరే, ఒడిశాకి సాయంగా రూ. 15 కోట్లు ఎలా ఇస్తారంటూ చంద్రబాబు నాయుడుని విజయసాయి ప్రశ్నించారు. ప్రాణ నష్టం జరగకుండా అధికారులు సమర్థవంతంగా ఎదుర్కొంటే, కోడలిని వేధించే అత్తగారి మాదిరిగీ సీఎం వ్యవహరిస్తున్నారంటూ విమర్శ చేశారు. గతంలో తిత్లీ తుఫాను వల్ల రూ. మూడు వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని కేంద్రానికి చంద్రబాబు నివేదిక పంపారన్నారు. కానీ, దానికంటే భయంకరమైన ఫొని తుఫాను వల్ల రూ. 100 కోట్లకు మించి కూడా నష్టం జరగలేదనీ, అంటే… గతంలో చంద్రబాబు వేసిన లెక్కల్లో మాయావిన్యాసాలు ఉన్నట్టే అని విజయసాయి ట్వీటారు.
ఫొని తుఫాను తిత్లీ కన్నా భయంకరమైందే. దాని తీవ్రత ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువగా పడలేదు. ఒడిశాపై పడింది. కానీ, తిత్లీ అలా కాదు. భారీ ఎత్తున ఏపీ మీద ప్రభావం చూపింది. ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులపాటు కుంభవృష్టి వాన కురిసింది. తిత్లీ తీవ్రత కనీసం ఐదు రోజులపాటు వదల్లేదు. దాంతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఇదంతా విజయసాయిరెడ్డికి గుర్తుండకపోవచ్చు! తిత్లీ వల్ల జరిగిన నష్టం వేరు, ఫొని వల్ల జరిగిన నష్టం వేరు. తిత్లీ కంటే ఫొని భయంకరమైన తుఫాను అయినంత మాత్రాన… అదే స్థాయి నష్టం జరగలేదని లెక్కలేయడాన్ని ఏమనుకోవాలి? ఇంకోటి, తిత్లీ సమయంలోనే… నష్ట నివారణ చర్యల కోసం విరాళాలు ఇమ్మంటూ ముఖ్యమంత్రి సాయం కోరితే, ఇవ్వొద్దూ అవి టీడీపీ నేతలు జేబుల్లోకి వెళ్లిపోతాయంటూ ప్రజలకు పిలుపునిచ్చారు వైకాపా నేతలు! అంటే, ఏ సమయంలోనైనా రాజకీయాలు మాత్రమే చేస్తారని వైకాపా నేతలు ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉంటారు. ఆ పరంపరను ఈయన కొనసాగిస్తూ ఉన్నారు!!