ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తవగానే వివిధ రాష్ట్రాల్లో పార్టీ తరఫున పర్యటనకు వెళ్లారు ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. దేశంలో ఎక్కడికి వెళ్లినా మోడికి అనుకూల పవనాలే ఉన్నాయనీ, చిన్నవ్యాపారుల దగ్గర్నుంచీ అన్ని వర్గాల ప్రజలూ మరోసారి మోడీని ఈ దేశ ప్రధానిగా కోరుకుంటున్నారని చెప్పారు. మోడీ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఏపీలో టీడీపీతోపాటు, ఆ పార్టీకి మద్దతుగా నిలిచే మీడియా మాత్రమే విషప్రచారం చేస్తోందన్నారు. ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా, ఏపీలో కూడా మోడీకి అనుకూలంగానే ప్రజలున్నారని కన్నా చెప్పడం విశేషం!!!
ఒడిశాలోని కోణార్క్ లో పూసలమ్ముకునే ఒక చిరు వ్యాపారి తనతో మాట్లాడుతూ… ఆప్ కా సీఎం బడా చోర్ హైనా, ఏ చోర్ మోడీకో చోర్ బోల్తా క్యా హై అని కన్నాతో అన్నాడట! మీ ముఖ్యమంత్రే దొంగ, ఆయన మోడీని దొంగ అంటారేంటి అని ఆ వ్యాపారి అడిగాడట! ఆ మాట అనగానే వెంటనే సదరు వ్యక్తితో మరోసారి మాట్లాడించి ఒక వీడియో తీసుకుంటే సరిపోయేది! ప్చ్… కానీ కన్నా అలా చెయ్యలేదెందుకో! మీ ముఖ్యమంత్రి దొంగ అని ఎవరైనా అంటే… ఎందుకు అని ప్రశ్నించాలి కదా. కారణం తెలుసుకోవాలి కదా. ఆ పూసలమ్మే వ్యాపారి అలా విమర్శిస్తే, ఏపీ రాజకీయాల గురించి ఎంత ఆసక్తి ఉందో తెలుసుకునే కుతూహలం సహజంగానే కలగాలి కదా! కానీ, కన్నా అవేవీ అడగలేదట. అయినా, మోడీని ఉద్దేశించి చౌకీదార్ చోర్ అంటున్నది ఎవరూ… రాహుల్ గాంధీ! చంద్రబాబు నాయుడు చేస్తున్న విమర్శ ఏంటి… ఆంధ్రాకి మోడీ అన్యాయం చేశారని! అలాంటప్పుడు, ఒడిశాలో ఒక చిన్నవ్యాపారి ఇలాంటి విమర్శ చంద్రబాబు మీద చేశాడని కన్నా చెప్తుంటే ఎలా ఉంటుంది..?
ఆంధ్రప్రదేశ్ లో భాజపా పనితీరుపై కన్నా మాట్లాడుతూ… ఐదు పార్లమెంటు స్థానాల్లో గట్టిపోటీ ఇచ్చామనీ, గెలుపు అవకాశాలున్నాయన్నారు. దాదాపు 25 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఫలితాలు తమకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని కన్నా చెప్పారు. మరి, దేశమంతా మళ్లీ మోడీ కావాలీ కావాలీ అంటున్నప్పుడు… ఆంధ్రాలో ఇన్ని తక్కువ స్థానాలు తమకు వస్తాయని కన్నా చెబితే ఎలా..? అంటే, ఆంధ్రాలో భాజపా మీద తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయనే చెబుతున్నట్టే కదా! ఏదేమైనా, ఎక్కడో ఒడిశాలో ఒక చిన్న వ్యాపారి ఆప్ కా సీఎం చోర్ హై అని అభిప్రాయపడ్డాడని కన్నా చెబుతుంటే.. అవునా నిజమా, ఆ వ్యక్తి ఎవరో చూడాలని అనిపిస్తోంది.! కనీసం ఆ వ్యక్తి ఫొటో అయినా కన్నా తీసి ఉంటే బాగుండేదే..!