విడతల వారీగా పోలింగ్ జరుగుతున్న కొద్దీ భాజపా నేతల గళంలో కొంత మార్పు వస్తున్నట్టుగా కనిపిస్తోంది. మరోసారి మోడీ రావడం ఖాయమని, గత ఎన్నికల్లో మోడీ హావా ఉంటే… ఈ ఎన్నికల్లో మోడీ సునామీ అంటూ భాజపా నేతలు చెప్తూ వస్తున్నారు. అయితే, భాజపా నేత రాం మాధవ్ ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నారు. గతవారంలో ఒక జాతీయ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… కర్ణాటకలో పెద్ద ఎత్తున ఎంపీ సీట్లు వస్తాయనీ, తెలంగాణలో కూడా వస్తాయనీ, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో ఈసారి భాజపా మంచి ఫలితాలు దక్కించుకుంటుంది అని చెప్పారు. ఇప్పుడు, మరో జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో… దక్షిణాదిపై పెద్దగా ఆశలు లేవన్నట్టు మాట్లాడారు!
ఒకవేళ భాజపా సొంతంగా 271 స్థానాలు గెలుచుకోగలిగితే చాలా సంతోషమని రాం మాధవ్ అన్నారు. ఎన్డీయేలోని ఇతర పార్టీలను కలుపుకుని ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ సాధిస్తామన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో భాజపా గతం కంటే బాగా విస్తరించిందనీ, అదే స్థాయి ప్రయత్నం దక్షిణాది రాష్ట్రాల్లో చెయ్యలేకపోయామని ఆయన చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఇంకాస్త ప్రయత్నించి ఉంటే… తమకు మరింత అనుకూలంగా ఉండేదన్నారు. ఒక రాజకీయ నాయకులుగా తామంతా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుందనీ, గత ఎన్నికల ఫలితాలను ఈ ఎన్నికల్లో రిపీట్ చేయలేకపోవచ్చనీ, ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఉంటుందన్నారు. మరోసారి అధికారంలోకి వస్తే ఆర్థికాభివృద్ధిపై దృష్టి పెడతామని రాం మాధవ్ చెప్పారు.
దక్షిణాది రాష్ట్రాల్లో భాజపా మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఆయనే స్వయంగా ఒప్పుకున్నట్టే. అంతేకాదు, ప్రభుత్వ వ్యతిరేకత ఉందనీ, 2014 ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయలేమన్న అనుమానం కూడా ఆయన వ్యాఖ్యల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకీ… దక్షిణాది రాష్ట్రాల్లో వ్యతిరేకత పెరగడానికి కారణం ఎవరు… స్వయంకృతమే కదా. ఆంధ్రాకి విభజన హామీలు అమలు చెయ్యలేదు. హోదా ఇస్తామంటూ మాటిచ్చిన ప్రధానమంత్రే ఆ మాట నిలబెట్టుకోలేదు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికారం కోసం అక్కడ భాజపా చేసిన డ్రామాలతో ప్రజలు విసిగిపోయారు. తమిళనాడులో, అమ్మ జయలలిత మరణం తరువాత… అక్కడి రాజకీయాల్లో పట్టుకోసం వేసిన ఎత్తులూ జిత్తులూ తమిళ తంబిలకు చిరాకు తెప్పించాయి. ఇక, కేరళ.. శబరిమల వివాదాన్ని రాజేసి రాజకీయ ప్రయోజనాలను పొందే ప్రయత్నంతో అక్కడా భాజపా మీద ఆగ్రహం ఉంది. దక్షిణాదిలో భాజపా మీద వ్యతిరేకత ఉందంటే కారణం వారే కదా! తాము దృష్టి పెట్టలేకపోయామని రాం మాధవ్ అంటుంటే ఆశ్చర్యంగా ఉంది! దృష్టి పెట్టాల్సింది కేవలం పోల్ మేనేజ్మెంట్ మీద మాత్రమే కాదు కదా. ఆయా రాష్ట్రాలకు కేంద్రం చెయ్యాల్సినవి చేసిందా లేదా అనేదానిపై ముందుగా దృష్టి పెట్టాలి. పాలన అంటే కేవలం ఎన్నికల సమయంలో వ్యూహాలు మాత్రమేనా?