మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాలని పట్టుదలకు పోతున్న చంద్రబాబు.. దానికి పదో తేదీని ముహుర్తంగా నిర్ణయించారు. సాధారణంగా మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేయాలంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక నోట్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపుతారు. ఈ నోట్ ను ప్రధాన కార్యదర్శి ఆయాశాఖల కార్యదర్శులు, ప్రిన్సిపుల్ సెక్రటరీలకు పంపి, 48గంటల్లోపు ఎజెండాలో చేర్చాల్సిన అంశాలపై సమాచారం పంపాల్సిందిగా కోరుతారు. అప్పుడు అజెండాను రూపొందిస్తారు. ఏదైనా అత్యవసరమైన తీర్మానం చేయాల్సి ఉన్నా, అప్పటికప్పుడు ఏదైనా సమస్య ఉంటే, టేబుల్ ఐటెమ్ గా కూడా ఎజెండాలో చేర్చే హక్కు ఉంటుంది. ముఖ్యమంత్రి అనుమతితో ఈ నిర్ణయం తీసుకుంటారు.
ప్రస్తుతం పదో తేదీ క్యాబినేట్ సమావేశానికి సీఎం కార్యాలయం నుంచి నోట్ ను సర్క్యూలేట్ చేస్తున్నారు. ప్రధాన కార్యదర్శి నుంచి ఈ నోట్ క్యాబినేట్ సెక్షన్ కు వెళ్లి అక్కడి నుంచి సెక్రటరీలు, ప్రిన్సిపుల్ సెక్రటరీలకు వెళుతుంది. ఈసారి క్యాబినేట్ సమావేశంలో కరువు, మంచినీటి ఎద్దడి, తుపాన్ ప్రభావిత ప్రాంతాలలో చేపట్టాల్సిన సహాయ కార్యక్రమాలు, రైతులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనే ప్రధానంగా చర్చించనున్నారు. కోడ్ ఉండగా.. కేబినెట్ సమావేశాన్ని ఎలా ఏర్పాటు చేస్తారన్న చర్చ… జరుగుతోంది. ఈ తరుణలో.. ఎన్నికల కమిషన్ నుంచి ఒక వివరణ కూడా ఇప్పుడు క్యాబినేట్ సమావేశం ఏర్పాటుకు చంద్రబాబుకు ఆయుధంగా మారింది. సీఎం కూడా ఎటువంటి సమీక్షలు చేయకూడదని కొందరు చెప్పిన భాష్యం పై ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఇటీవల లేఖ రాశారు. అయితే ఎన్నికల కమిషన్ దీనిపై స్పందించి ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు మినహా మిగతా అధికారులు సమీక్షలకు హాజరు కావచ్చని, ఇదే సమయంలో విధానపరమైన నిర్ణయాలు ఏవీ తీసుకోకూడదని మాత్రమే ప్రవర్తనా నియమావళిలో ఉందని స్పష్టం చేసింది.
ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన వివరణను చూసిన ముఖ్యమంత్రి క్యాబినేట్ సమావేశానికి ఎటువంటి అనుమతి అవసరం లేదని భావిస్తున్నారు. పైగా ఈ సమావేశంలో ప్రజలు తక్షణం ఎదుర్కొంటున్న కరవు, మంచినీటి ఎద్దడి, ఫోనీ తుపాన్ ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టడం వంటి అంశాలతో పాటు ఎండ వేడిమి ఎక్కువుగా ఉన్న ప్రాంతాలలో ప్రజలను రక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై క్యాబినేట్ సమావేశంలో చర్చించనున్నారు. త్వరలోనే క్యాబినేట్ సమావేశం ఏర్పాటు చేయబోతున్నానని ముఖ్యమంత్రి ప్రకటించిన రెండు రోజుల్లోనే, ఈనెల పదో తేదీన క్యాబినేట్ సమావేశం ఉంటుందని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు సీఎస్.. కేబినెట్ భేటీకి తప్పనిసరిగా సహకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. టేబుల్ ఐటమ్ గా అందులో… సీఎస్ పై చర్య తీసుకునే అంశంపై నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదన్న చర్చ ప్రారంభమయింది.