తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. దేశవ్యాప్తంగా ఐదు విడతల పోలింగ్ కూడా ముగిసింది. ఐదు విడతల ఎన్నికలను విశ్లేషించుకున్న తర్వాత ..రాజకీయ పార్టీలన్నీ… ఏ పార్టీకి మెజార్టీ రాదన్న అంచనాకు వచ్చాయి. ఓ వైపు బీజేపీ.. మరో వైపు కాంగ్రెస్…. ఇంకో వైపు ప్రాంతీయ పార్టీల కూటమి.. ప్రభుత్వ ఏర్పాటు కోసం పోటీ పడే సూచనలు కనిపిస్తున్నాయన్నది.. విశ్లేషకుల అభిప్రాయం. అందుకే ప్రాంతీయ పార్టీల నేతల్లో హడావుడి పెరిగింది. కూటమి కట్టి.. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ … చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రెండు విడతలుగా ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చేసి… పరిచయాలు పెంచుకున్న కేసీఆర్.. ఎన్నికలకు ముందు… కూటమిని కార్యాచరణలోకి తెచ్చేందుకు రంగంలోకి దిగారు.
ఆప్తమిత్రుల్ని కేసీఆర్ ఎందుకు కలవడం లేదు..?
మొదటి సారి, రెండో సారి కేసీఆర్.. వివిధ పార్టీల నేతల్ని కలిసినప్పుడు… చాలా మంది వచ్చిన అనుమానాలు బీజేపీ… కోసమే మిత్రుల్ని వెదుకుతున్నారా అని. కాంగ్రెస్ కూటమిలో ఉన్న పార్టీలను లేదా.. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కూటమిలో చేరుతామని ఇప్పటికే ప్రకటించిన పార్టీలను మాత్రమే కేసీఆర్ కలుస్తున్నారు. ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ను ఒక్క సారి కూడా కలవలేదు. అలాగే.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో మద్దతిచ్చి… తనకు మంచి మిత్రుడని చెప్పుకున్న జేడీయూ నేత, బీహార్ సీఎం నితీష్ కుమార్, అకాలీదళ్, శివసేన, అన్నాడీఎంకే లాంటి పార్టీలను కూడా కేసీఆర్ తమ కూటమిలోకి ఆహ్వానించాల్సిన జాబితాలో చేర్చలేదు. ఈ సారి కూడా.. వీరితో భేటీలు ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెప్పడం లేదు. అందుకే… కౌంటింగ్ తర్వాత ఎలాంటి పరిస్థితి వచ్చినా.. బీజేపీకి మద్దతివ్వడమో.. లేదా బీజేపీ మద్దతు తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమో టార్గెట్ పెట్టుకుని కేసీఆర్..ఫ్రంట్ చర్చలు నడపుతున్నారన్న ప్రచారం మాత్రం రాజకీయవర్గాల్లో బలంగా ఉంది.
కాంగ్రెస్‌కు దగ్గరగా ఉన్న వారినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?
కేరళ వెళ్లారు. అక్కడ లెఫ్ట్ డెమెక్రటిక్ ఫ్రంట్ కూటమి తరపున సీఎంగా ఉన్న పినరయి విజయన్‌తో కూటమిపై చర్చించారు. తమిళనాడు వెళ్తారు. డీఎంకే నేత స్టాలిన్‌ను కలుస్తారు. కేసీఆర్ కలిసే జాబితాలో…కుమారస్వామి, నవీన్ పట్నాయక్ కూడా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి అటు కాంగ్రెస్ కూటమిలో.. ఇటు బీజేపీ కూటమిలో లేని పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలి. కానీ కేసీఆర్ … తన ఫ్రంట్‌కు మరింత బలం చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ కూటమిలో ఉన్న పార్టీలను కూడా.. బయటకు లాగి.. ఫెడరల్ ఫ్రంట్‌కి బలం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కర్ణాటకలో జేడీఎస్, తమిళనాడులో డీఎంకే పార్టీలు.. కాంగ్రెస్ తో కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. వాటిని కూటమిలోకి తెచ్చే ప్రయత్నాలు కేసీఆర్ చేయబోతున్నారు. అలాగే.. ఇప్పటి వరకూ.. అటు బీజేపీ,ఇటు కాంగ్రెస్‌కు దూరం పాటిస్తున్న నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, మాయవతిలోనూ..కేసీఆర్ చర్చలు జరిపి అందర్నీ కూటమిలో భాగస్వాముల్ని చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. ఏపీ నుంచి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కేసీఆర్‌తో కలిసి పని చేస్తామని ప్రకటించారు.
ఆయా పార్టీలు కేసీఆర్ నాయకత్వంపై నమ్మకం ఉంచుతాయా..?
అయితే ప్రాంతీయ పార్టీల అధినేతలందరూ.. ఇప్పుడు… కేసీఆర్‌లా.. ఫ్రంట్ స్టీరింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్.. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. కూటమిగా అందర్నీ ఒకే తాటిపైకి తీసుకురావడం కష్టమమే అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. ప్రాంతీయపార్టీలన్నీ.. కౌంటింగ్ తర్వాత తమ చేతిలో ఎన్ని సీట్లు ఉంటాయో చూసుకుని… ఆ తర్వాత తమ రాజకీయ విధానాన్ని ఖరారు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే.. అయితే బీజేపీ.. లేకపోతే కాంగ్రెస్.. ఎవరితోనూ జాతీయ రాజకీయాల్లో అంత క్లోజ్‌గా వెళ్లడం కానీ… దూరంగా ఉంటం కానీ చేయకుండా.. దగ్గరగా దూరంగా ఉండే వ్యూహం అమలు చేస్తున్నారనేది.. కేసీఆర్ రాజకీయాలను పరిశీలించేవారి మాట.