పోలవరం ప్రాజెక్ట్‌పై తనకు ఎన్నో ఉన్నా.. వాటినెవరూ తీర్చడానికి ముందుకు రావడం లేదని.. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అంటున్నారు. కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజల్ని తీసుకొచ్చి ప్రాజెక్టును చూపిస్తున్నారు కానీ.. తాను వస్తానంటే.. మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదంటున్నారు. తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. .. పోలవరం విషయంలో నా అనుమానాలు నివృత్తి చేస్తే అక్కడే క్షమాపణ చెప్పి వస్తానని చాలెంజ్ చేశారు. మంత్రి దేవినేని ఉమ జూన్‌లో నీళ్లిస్తామని గతంలోనే ప్రకటించారని..కానీ చంద్రబాబు మాత్రం వచ్చే ఏడాదికి నీళ్లు ఇస్తామని చెప్పారని.. ఏది నిజమని ప్రశ్నించారు. వచ్చే ఏడాది తర్వాత అయిన నీళ్లు ఎలా ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం నిర్మాణ ప్రాంతంలో భూమి పగుళ్లు ఏర్పడుతున్నాయని.. ప్రమాదకర పరిస్థితిలో ప్రాజెక్టు నిర్మాణం అవుతోందని ఉండవల్లి ఆరోపించారు.
భవిష్యత్తులో తేడా వచ్చి డ్యాం డ్యామేజ్ అయితే రాజమండ్రితో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు తుడిచి పెట్టుకుపోతాయని ఉండవల్లి ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలు అయిపోయినందున.. ఇప్పటికైనా నిజం చెప్పాలని ఆయన కోరుతున్నారు. పోలవరం విషయంలో చాలా దారుణాలు జరిగిపొతున్నాయని అక్కడి అధికారులే తనకు చెబుతున్నారని ఉండవల్లి అంటున్నారు. కాపర్ డ్యాం ముంపు బాధితులకు ప్రజలకు 30 వేల కోట్లు కావాలి ఎక్కడి నుంచి తెస్తారో సమాధానం చెప్పాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిధుల బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనన్న సంగతిని ఉండవల్లి ఉద్దేశపూర్వకంగా మర్చిపోయినట్లుగా ఉన్నారు. కేవలం నిర్మాణ పర్యవేక్షణ మాత్రమే.. ఏపీ ప్రభుత్వం చేపడుతోంది. క్వాలిటీ కంట్రోల్ సహా.. పూర్తిగా… పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చేతిలో ఉంది.
అయినప్పటికీ.. పోలవరం విషయంలో మాత్రం ఉండవల్లి… తరచూ ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నారు. ఈ సారి మరింత బలంగా ప్రజల్లో అనుమానాలు కలిగే… ప్రాజెక్టు డ్యామేజ్ అవుతుందన్నట్లుగా మాట్లాడుతున్నారు. తరచూ అక్కడ భూమిలో పగుళ్లు వస్తున్నాయన్న అంశాన్ని పెద్దది చేసిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ పై.. ఓ వైపు కేవీపీ.. మరో వైపు ఉండవల్లి.. వైసీపీయేతర విభాగాల నుంచి చార్జ్ తీసుకున్నట్లుగా ఉన్నారన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.