ఫెడరల్ ఫ్రంట్ ని ఓ రూపు తీసుకొచ్చేందుకు యాత్ర ప్రారంభించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు.. ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఈ నెల పదమూడో తేదీన.. ఆయన తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే చీఫ్ ఎంకె స్టాలిన్ ను కలుస్తారని.. టీఆర్ఎస్ వర్గాలు ప్రకటించాయి. ఇప్పటికే కేరళ వెళ్లి… అక్కడి లెఫ్ట్ పార్టీలకు చెందిన సీఎం పినరయి విజయన్‌తో సమావేశమయ్యారు. ఈ లోపు… కేరళ, తమిళనాడులోని…ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు దర్శించుకుని పన్నెండో తేదీ కల్లా చెన్నై చేరుకుని.. పదమూడో తేదీన స్టాలిన్‌తో సమావేశవుతారని.. టీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. అయితే.. ఈ ప్రకటనను.. డీఎంకే వర్గాలతో చర్చించి.. చేశారో లేదో కానీ.. ఆలాంటి భేటీ ఏమీ ఉండదని… డీఎంకే అధికారికంగా ప్రకటన చేసింది. స్టాలిన్… తమిళనాడులో.. ఈ నెల పందొమ్మిదో తేదీన జరగనున్న మూడు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటారని.. అందుకే ఆయన ఎలాంటి భేటీలనూ.. పెట్టుకోలేదని డీఎంకే వర్గాలు ప్రకటించాయి. దీంతో.. కేసీఆర్ ఫెడరల్ టూర్‌కి మొదట్లోనే ఇబ్బందికర పరిస్థితులు ఎదురయినట్లుగా కనిపిస్తోంది.
నిజానికి.. కేసీఆర్ గతంలోనూ ఓ సారి తమిళనాడు వెళ్లి.. స్టాలిన్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీతో.. డీఎంకే సీట్ల సర్దుబాటు కుదుర్చుకుంది. కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఇప్పుడు డీఎంకే భాగస్వామి. పైగా.. స్టాలిన్… కాంగ్రెస్ కూటమిలో ఉన్న పార్టీల నేతల కంటే ఎక్కువగా… రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అనే వాదనను గట్టిగా వినిపిస్తున్నారు. కూటమిలోని ఇతర పార్టీల నేతలు అభ్యంతరాలు చెప్పినా.. డీఎంకే అభిప్రాయం మాత్రం.. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడమేనని చెబుతున్నారు. ప్రస్తుతం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే తమిళనాడులో స్వీప్ చేస్తుందన్న విశ్లేషణలు వస్తున్న సమయంలో.. కేసీఆర్ తో.. భేటీ అయ్యేందుకు స్టాలిన్ అంగీకరించారన్న ప్రచారం కాస్త కలకలం రేపింది. అయితే.. ఒక్క రోజులోనే.. అలాంటి భేటీలేమీ లేవని ప్రకటించారు.
ఇప్పటికి పినరయి విజయన్ తో మాత్రమే సమావేశమైన.. కేసీఆర్… ప్రస్తుతం.. పుణ్యక్షేత్రాల పర్యటనలో ఉన్నారు. మరోప్రాంతీయ పార్టీ నేతతో… భేటీ ఎప్పుడనేది అధికారికంగా ఖరారు కాలేదు. వాస్తవానికి స్టాలిన్ తో భేటీ తర్వాత ఆయన బెంగళూరు వెళ్లి కుమారస్వామితో చర్చిస్తారని చెబుతున్నారు. కుమారస్వామి ప్రస్తుతం కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఈ సమయంలో.. కాంగ్రెసేతర కూటమిలోకి ఆహ్వానించేందుకు వస్తున్న కేసీఆర్ తో.. సమావేశం అవుతారా లేదా అన్నది ఆసక్తికరం. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఏ రాజకీయ వ్యూహాం అయినా అమలు చేయవచ్చన ఆలోచనకు ప్రాంతీయ పార్టీలు వస్తున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ భేటీలు … ముందుకు సాగే సూచనలు తక్కువేనని చెప్పువచ్చు.