మా సినిమా షూటింగ్ పిక్నిక్లా జరిగింది, దర్శకుడు – హీరో ఫ్రెండ్స్‌లా కలిసిపోయారు – అంటూ ప్రెస్ మీట్లలో, ఇంటర్వ్యూలలో ఊదరగొట్టేస్తారు కానీ – నిజానికి ప్రతీ సినిమాకీ ఇలాంటి `అద్భుతాలు` జరగవు. సినిమా అనేది క్రియేటీవిటీపై ఆధారపడి ఉంటుంది. ఒకరి ఆలోచన వంద మందిని మెప్పించాలి. దర్శకుడు – హీరో సఖ్యతగా ఉంటూ సినిమా పూర్తి చేయడం, ఎంత ఫ్రెండ్లీగా ఓ ప్రాజెక్టు మొదలెట్టారో, అంతే స్నేహపూర్వకంగా దాన్ని పూర్తి చేయడం చాలా కష్టం. మధ్య మధ్యలో వచ్చే క్రియేటీవ్ డిఫరెన్సెస్‌ని దాటుకుంటూ రావాలంటే చాలా నేర్పు ఉండాలి.
ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే సూర్య తాజా చిత్రం ‘ఎన్ జి కే’ ఇలాంటి క్రియేటీవ్ డిఫరెన్స్ బారీన పడినట్టు చెన్నై వర్గాల టాక్. సూర్య కథానాయకుడిగా నటించిన చిత్రమిది. సెల్వ రాఘవన్ దర్శకుడు. ఈనెలాఖరున విడుదల అవుతోంది. అయితే.. ఈ సినిమాని సెల్వ రాఘవన్ ఇప్పుడు పట్టించుకోవడం మానేశాడని టాక్. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌లో సెల్వ ఏమాత్రం జోక్యం చేసుకోవడం లేదని, ప్యాచ్ వర్క్ సైతం.. సహాయ దర్శకులు పూర్తి చేశారని చెప్పుకుంటున్నారు. సెట్లో సూర్య – సెల్వ మధ్య విబేధాలు వచ్చాయని, దాంతో సెల్వ అలిగి… షూటింగులకు డుమ్మా కొట్టడం మొదలెట్టాడని, ఇప్పుడు సెల్వ రాఘవన్ లేకుండానే సినిమా బయటకు వస్తోందని తెలుస్తోంది. సెల్వ ప్రమోషన్లకైనా వస్తాడా, లేదంటే ఆ విషయంలోనూ హ్యాండిస్తాడా? అనేది అనుమానంగా మారింది. సెల్వ ప్రతిభావంతమైన దర్శకుడే. కానీ.. సినిమాని పూర్తి చేయడానికి హీరోల్నీ, నిర్మాతల్నీ నానా తిప్పలూ పెడతాడట. ఈ విషయం మరోసారి రుజువైంది. అసలే డౌన్ ఫాల్లో ఉన్న సెల్వకు ఇవన్నీ ఎందుకొచ్చిన గొడవలంటూ.. చెన్నై వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.