అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కూడా కోడ్ సంగతేమిటో తేల్చారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పేరుతో అడుగడుగునా ప్రతిబంధకాలు ఎదురవుతున్న తరుణంలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీలోని తన కార్యాలయంలో మంగళవారం అధికారులతో భేటీ నిర్వహించారు. వివిధ ఫైళ్లపై సంతకాలు చేశారు. తన కార్యాలయంలోనే మీడియాతో కూడా మాట్లాడారు. అసెంబ్లీకి సంబంధించిన పలు పాలనాపరమైన వ్యవహారాల గురించి అధికారులతో చర్చించారు. ఉద్యోగుల సంక్షేమం, కొత్త భవన సముదాయంలో వసతి ఏర్పాట్లు, ఉద్యోగులకు ఇబ్బందిల్లేకుండా తీసుకోవాల్సిన చర్యలతోపాటు పలు ఫైళ్లపై కూడా సంతకాలు చేశారు.
మూడు గంటలసేపు తన కార్యాలయంలోనే ఉండి.. అందరితో మాట్లాడి వెళ్లారు. కేంద్ర ఎన్నికల కమిషన్ పక్షపాతంగా వ్యవహరించిందని, ఏపీకి తగినన్ని బలగాలు కూడా ఇవ్వలేకపోయిందనిర కోడెల అన్నారు. చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పేరుతో సాధారణ వ్యవహారాలను అడ్డుకోవడం మంచిదికాదని అన్నారు. మిగిలినవారికి ఓ కోడ్, ఏపీకి ఓ కోడా అంటూ ప్రశ్నించారు. విభజన సమస్యల పరిష్కారం నుంచి మోదీ, బీజేపీ నేతలు తప్పించుకోలేరని, తెలుగువాళ్ల గురించి హేళనగా, చులకనగా, అవమానించే విధంగా మాట్లాడటం సరికాదని స్పష్టం చేశారు.
ఒడిశాకు తుపాను సాయం కింద వెయ్యి కోట్లు మంజూరు చేసిన మోదీ, తితలీ తుపానుపై ఇప్పటికీ సాయం చేయకపోవడాన్ని ప్రస్తావించారు. కోడ్ పేరుతో.. ఏపీ ప్రభుత్వాన్ని పని చేయుకుండా చేస్తున్నారన్న విమర్శలు వస్తున్న తరుణంలోనే.. స్పీకర్ మరో ముందడుగు వేశారు. ఇప్పటికే టీడీపీ అధినేత కేబినెట్ భేటీకి కూడా సన్నాహాలు చేశారు. త్వరలో మంత్రులు కూడా సమీక్షలు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.