ఓట్ల లెక్కింపునకు మరో మూడురోజులే ఉంది. దీంతో, ప్రధాన పార్టీలు వారి ఏజెంట్లను అప్రమత్తం చేసే పనిలో ఉన్నాయి. అయితే, టీడీపీ ఏజెంట్ల గురించీ, వారికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన శిక్షణ గురించి సాక్షి పత్రిక ఇవాళ్లో కథనం రాసింది. ఓట్ల లెక్కింపు సమయంలో ఉద్రిక్తతలు సృష్టించేందుకు ఓ వ్యూహంతో సిద్ధమౌతున్నారని రాశారు. కౌంటింగ్ హాల్లో ఘర్షణలకు దిగాలంటూ ఆయన ఏజెంట్లకు సంకేతాలు ఇచ్చారని చెప్పారు. కౌంటింగ్ ఏజెంట్లకు చంద్రబాబు నాయుడే స్వయంగా శిక్షణ ఇవ్వడం విడ్డూరమనీ, కౌంటింగ్ హాల్లో విద్వేషాలు ఎలా రెచ్చగొట్టాలో నేర్పించే విధంగా ఓ పుస్తకాన్ని కూడా ముద్రించారని రాశారు.
మెజారిటీ తక్కువ ఉన్న ప్రతీచోటా రీ కౌంటింగ్ కోసం పదేపదే పట్టుబట్టాలని నూరిపోశారట! అనుమానం ఉన్న ప్రతీచోటా రీ కౌంటింగ్ కోసం ఫైట్ చేయాలని ఏజెంట్లకు చంద్రబాబు చెప్పారనీ, ఫైట్ అనే పదం ఆయన ఉపయోగించడం ద్వారా ఏజెంట్లకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు అంటూ సాక్షి విశ్లేషించింది. వీవీప్యాట్లు, ఈవీఎంల లెక్కలు సరిపోలకుంటే, పదేపదే రీ కౌంటింగ్ కి డిమాండ్ చేయాలని చంద్రబాబు చెప్పారని రాసింది! రిటర్నింగ్ అధికారి ఒకసారి ఫలితాలన్ని వెల్లడించాక ఏం చెయ్యలేమనీ, కాబట్టి రీ కౌంటింగ్ కి పట్టుబట్టే మానసిక స్థితిని ఇప్పట్నుంచే సిద్ధం చేసుకోవాలని ఏజెంట్లకు శిక్షణ ఇచ్చారన్నారు. అంతేకాదు, స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్లను ఇప్పటికే టీడీపీ కొనేసిందనీ, తమకు అనుకూలంగా కౌంటింగ్ హాల్లో పనిచేసే విధంగా వారినీ మభ్యపెట్టిందని సాక్షి ఆరోపించింది.
వీవీప్యాట్ల స్లిప్పులు, ఈవీఎంలలో ఓట్ల లెక్క సమానంగా లేకపోతే ఎన్నిసార్లైనా రీకౌంటింగ్ కి డిమాండ్ చేయాలంటూ ఏజెంట్లకు చంద్రబాబు చెప్పడం తప్పు అన్నట్టుగా సాక్షి రాసింది. అయితే, వారికి అసలు విషయం తెలియదేమో…! కొద్దిరోజుల కిందటే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్రాలకు దీనిపై స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. వీవీప్యాట్ల స్లిప్పులు, ఈవీఎంలలో ఓట్లు సరిపోయే వరకూ ఎన్నిసార్లైనా లెక్కించాలనేది కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం. అంతేకాదు, ఒకవేళ లెక్క సరిపోకపోతే… అంతిమంగా వీవీప్యాట్ల స్లిప్పులనే ప్రామాణికంగా తీసుకుని, ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తామని సీఈవో ద్వివేదీ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. దీన్నే ఏజెంట్లకు చంద్రబాబు చెబితే… అది తప్పు అన్నట్టుగా వేలెత్తి చూపితే ఎలా..? ఉద్రిక్తతలకు వ్యూహంగా చూపిస్తే ఎలా..?