దక్షిణాది రాష్ట్రాలతో కలుపుకుని మొత్తంగా ఓ వంద ఎంపీ సీట్లు ఒక దగ్గరకి చేర్చి, కూటమిగా ఏర్పాటు చేయాలనేది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన. కేంద్రంలో భాజపా, కాంగ్రెస్ పార్టీలకు సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే సీట్లు రావనేది ఆయన అంచనా. ఆ లెక్కలతోనే ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కానీ, ఇప్పుడు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చాక… కేంద్రంలో మరోసారి మోడీ సర్కారు రాబోతోందనే అంచనాలు బలపడ్డాయి. అంతేకాదు, కేసీఆర్ అంచనాకి భిన్నంగా… కేంద్రంలో సింగిల్ గానే భాజపా పెద్ద సంఖ్యలో సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ లెక్కల్లో తేలింది. దీంతో, మూడో ప్రత్యామ్నాయానికి కేంద్రంలో అవకాశమే లేదనే వాతావరణం ఇప్పుడు కనిపిస్తోంది. దీంతో కేసీఆర్ అనుకున్న ఫెడరల్ ఫ్రెంట్ ప్రయత్నాలు పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఉంది. దీంతో ఇప్పుడు కేసీఆర్ ఎలా స్పందిస్తారనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో కీలకం కావాలనే కేసీఆర్ ప్రయత్నాలకు బ్రేకులు పడ్డట్టా..? ఈ ప్రశ్నకు జవాబు ఏంటంటే… ప్లాన్ – బిని కేసీఆర్ అమలు మొదలుపెట్టేశారని తెలుస్తోంది!
తెలంగాణలో కేసీఆర్ కి దాదాపు 14 లోక్ సభ స్థానాలు గ్యారంటీ అని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ నంబర్ కూడా తక్కువేం కాదు. అయితే, ఈ నంబర్ తో కేంద్రంలో కొంత ప్రాధాన్యతను సాధించుకోవచ్చు అనేది కేసీఆర్ ప్లాన్ -బిగా చెప్పుకోవచ్చు. ఎన్డీయేకి పదో పదిహేనో సీట్లు అవసరం వచ్చిన పరిస్థితి వస్తే… ఆ మేరకు మద్దతు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు భాజపాకి తెరాస వర్గాల నుంచి వెళ్లినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే, లాబీయింగ్ మొదలైందనీ, దీనికి సంబంధించి కీలక నేతల్ని కేసీఆర్ కేంపు నుంచి భాజపాని కలిసే ఛాన్స్ ఉందని వినిపిస్తోంది. ఓ కేంద్రమంత్రి పదవి, కొన్ని నామినేటెడ్ పోస్టులపై భరోసా కల్పిస్తే… మద్దతుకు సై అనే ప్లాన్ లో కేసీఆర్ వర్గం నుంచి ప్రతిపాదనగా కనిపిస్తోంది.
ఫెడరల్ ఫ్రెంట్ ద్వారా కాకపోయినా, ఈ విధంగానైనా సరే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలనేది కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంది. అందుకే, తెరాస నుంచి కొన్ని పాజిటివ్ సంకేతాలు ముందే పంపడం ద్వారా… ఫలితాల తరవాత పరిస్థితులు ఎలా ఉన్నా కూడా తనకంటూ జాతీయ రాజకీయాల్లో కొంత స్పేస్ ఉండేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అనుకోవచ్చు. అయితే, ఎన్డీయేకి కేసీఆర్ గెలవనున్న 14 ఎంపీ సీట్ల అవసరాన్ని బట్టి, ఆయనకు ఢిల్లీలో దక్కే ప్రాధాన్యత స్థాయి ఏపాటిది అనేది తేలుతుందనేది వాస్తవం! ఏదేమైనా, ఫెడరల్ ఫ్రెంట్ అజెండాను ఆయన పక్కనపెట్టాల్సిన వాతావరణం క్లియర్. అయినాసరే, కేంద్రంలో చక్రం తిప్పడానికి కేసీఆర్ ఏదో ఒకటి చేస్తారనేది కూడా అంతే స్పష్టంగా కనిస్తోంది.