నిన్న ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యే ముందువరకూ జాతీయ రాజకీయాల్లో భాజపా పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు అన్నట్టుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలన్నీ ఒకే కూటమిగా ఏర్పడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే సందర్భంలో కొత్త పొత్తుల కోసం మోడీ కూడా చూస్తున్నారన్నట్టుగా ప్రకటనలూ నడిచాయి. అయితే, ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కేంద్రంలో మోడీ నేతృత్వంలోని భాజపాకి అనుకూలంగా ఉన్నాయని తేల్చాయో… ఆ పార్టీలో సంబరాలు మొదలైపోయాయి. భాజపాకి అనుకూలంగా సర్వేలు ఉన్నాయి కాబట్టి, ఆ పార్టీవారికి కొంత ఆనందంగా ఉండటం సహజం. అయితే, మరో అడుగు ముందుకేసి… ఎన్డీయే పార్టీలకు విందులు కూడా ఇచ్చేయబోతున్నారు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో మంగళవారం నాడు భాగస్వామ్య పక్షాలకు విందు ఇవ్వనున్నట్టు సమాచారం! అదేంటీ, అసలు ఫలితాలు రాకముందే ఈ స్థాయిలో సంబరాలు ఏంటా అనిపిస్తుంది కదా! కానీ, ఇలా సంబరాలు చేసుకోవడం, విందులు ఇవ్వడం వెనక కూడా ఒక మైండ్ ఉన్నట్టుగా కనిపిస్తోంది.
ఎగ్జిట్ పోల్ ఫలితాలు నూటికి నూరు శాతం నిజమౌతాయన్న గ్యారంటీ లేదు. కానీ, ప్రస్తుతం వెల్లడైన ఫలితాల ప్రభావం ప్రతిపక్షాలపై బలంగా కనిపిస్తోంది. ఇవాళ్ల సోనియా, రాహుల్ గాంధీలతో ఢిల్లీలో మాయావతి భేటీ జరగాల్సి ఉంది. ఎగ్జిట్ పోల్స్ వల్ల అది వాయిదా పడిందని అంటున్నారు. యూపీలో మాయావతి కూటమి ఈసారి జాతీయ రాజకీయాల్లో కీలకం కాబోతున్నారనే అంచనాల మధ్య, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆమెతో చర్చించారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు అసాధ్యమని చెబుతూ వచ్చిన ఆమె… రాహుల్ తో భేటీకి సిద్ధం కావడం ప్రతిపక్షాల్లో మంచి ఊపును తెచ్చిన పరిణామమే. ఎప్పుడైతే ఈ ఎగ్జిట్ పోల్స్ బయటకి వచ్చాయో… ఈ సమావేశం ఆగింది. సోనియా అధ్యక్షతన జరగాల్సిన విపక్షాల సమావేశంపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ఇది అమిత్ షా మైండ్ గేమ్ నేపథ్యంలో చోటు చేసుకున్న మార్పుగా చూడొచ్చు. ఎలా అంటే… భాజపాలో ఒక్కసారిగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగినట్టు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఎన్డీయే కూటమిని సంబరాల మూడ్ లోకి తెచ్చేశారు. విందులు కూడా ఇస్తున్నారు. అంటే, రాబోయేది వారి ప్రభుత్వమే కాబట్టి… విపక్షాలన్నీ ఒక కూటమిగా ఏర్పడ్డా, దాన్లో చేరడం సరికాదేమో అనే ఆలోచనా ధోరణిలోకి ఇతర పార్టీలను నెట్టాలనేదే షా వ్యూహంగా కనిపిస్తోంది. దీంతోపాటు, కొన్ని మిత్రపక్షాలు భాజపాకి కాస్త దూరమయ్యే ఆలోచనలో ఉన్నాయన్నదీ తెలిసందే. ఇప్పుడీ ఎగ్జిట్ పోల్ సంబరాలతో వాళ్లనీ ఎటూ కదలనీయకుండా ఉంచెయ్యొచ్చు అనేది వారి మైండ్ గేమ్ గా కనిపిస్తోంది. లేదంటే, ఎగ్జిట్ పోల్ అంచనాలకే జాతీయ పార్టీలు సంబరాలు చేసుకునే పరిస్థితి ఎప్పుడైనా చూశామా?