వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 2014 వెంటాడుతోంది. గెలుస్తామని పక్కాగా ధీమాతో ఉన్న ఆ పార్టీలో 2014లో జరిగినట్లే జరగదన్న గ్యారంటీ ఏమిటన్న భయం కూడా లోలోన ఉంది. ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ విషయంలో చాలా టెన్షన్‌తో ఉన్నారని.. వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. పోలింగ్ ముగిసిన రోజున… మీడియాతో మాట్లాడిన ఆయన ఇంత వరకూ.. నోరు తెరవలేదు. కనీసం.. అభ్యర్థులతో కూడా మాట్లాడలేదు. పోలింగ్ సరళి, విజయావకాశాలపై కూడా సమీక్ష చేసుకోలేదు.
అభ్యర్థులతో సమావేశమూ వాయిదా..!
కౌంటింగ్‌కు ముందు జగన్మోహన్ రెడ్డి.. ఒక రోజు అభ్యర్థులతో సమావేశం అయి.. జాగ్రత్తలు చెప్పాలని అనుకున్నారు. ఇందుకు 21వ తేదీన ముహుర్తంగా నిర్ణయించారు. కానీ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత జగన్ మరింత మూడీగా మారిపోయారని.. ఆ భేటీని కూడా రద్దు చేశారని వైసీపీ వర్గాలు తెలిపాయి. దీంతో.. వైసీపీ వర్గాల్లో ఏదో ఆందోళన వ్యక్తమవుతోంది. జగన్మోహన్ రెడ్డి… ఎన్నికలు అయిన తర్వాత అభ్యర్థులతో మాట్లాడి భరోసా ఇవ్వాల్సింది పోయి.. మొత్తానికే.. ఆయన సైలెంట్‌గా అయిపోవడం.. మరో వైపు విజయసాయిరెడ్డి… ప్రతిపక్షానికే పరిమితమవుతామన్నట్లుగా… ట్వీట్లు చేస్తూండటంతో… చాలా మంది నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అభ్యర్థులతో మాట్లాడటానికి జగన్ ఎందుకు ఆసక్తి చూపించడం లేదో ఎవరికీ అర్థం కావడం లేదు.
ఫలితాలు చూసేందుకు మాత్రమే అమరావతికి..!
గత వారం పులివెందులలో ప్రజలను కలిసిన జగన్… ఆ తర్వాత అమరావతికి వచ్చి మూడు రోజుల పాటు ఉండి… పార్టీ నేతలతో సమావేశమై.. ఫలితాలను కూడా అమరావతిలోనే చూస్తారని వైసీపీ వర్గాలు చెప్పుకొచ్చాయి. కానీ.. ఫలితాల ముందు రోజు.. బుధవారం సాయంత్రం మాత్రమే వస్తారని… ఫలితాలు మాత్రం అమరావతిలో చూస్తారని చెబుతున్నారు. ఫలితాలు అనుకూలంగా ఉంటే సరే.. లేకపోతే… అదే రోజు సాయంత్రం.. మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోయే అవకాశం ఉందంటున్నారు. శుక్రవారం.. కోర్టుకు హాజరవ్వాల్సి ఉంటుందని.. గెలిచినా వెళ్లక తప్పదని… కొంత మంది సెటైర్లు వేస్తున్నారు.
కళ్ల ముందు 2014 ప్రత్యక్షం..!
2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయడమే ఆలస్యం అన్నట్లుగా పరిస్థితి ఉండేది. వైఎస్ చనిపోయిన భావోద్వేగం.. అంతకు మించి.. ప్రచారం… ఎగ్జిట్ పోల్స్, సర్వేలు అన్నీ… జగన్‌కి గొప్ప నమ్మకాన్ని కలిగించాయి. కానీ… ఒక్క లగడపాటి రాజగోపాల్ మాత్రమే… అసలు సర్వే ఇచ్చారు. అదే నిజం అయింది. గతలో గెలుస్తామని.. చెప్పిన ఎగ్జిట్ పోల్స్, సర్వేలు కూడా.. ఈ సారి జగన్ గెలుస్తాడని చెబుతున్నాయి. కానీ.. వాటి మెథడాలజీ, చెబుతున్న లెక్కలు, ఓట్ల శాతం.. చూస్తూంటే… కాకిలెక్కలనే భావన వైసీపీ వర్గాల్లోనే ఉంది. అన్నింటికీ మించి లగడపాటి సర్వే జగన్ శిబిరాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో ఆయన చెప్పిన సర్వేలు సక్సెస్ కావడంతోనే ఈ గుబులు. అందుకే.. జగన్మోహన్ రెడ్డి.. ఫలితాల తర్వాతే మాట్లాడాలని నిర్ణయించుకున్నారంటున్నారు.