ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేసిన తరువాత, తొలి ప్రసంగంలోనే తన రాజకీయ వైఖరి ఎలా ఉండబోతుందో స్పష్టం చేసేశారు. ప్రతిపక్ష పార్టీ పట్ల తాము అనుసరించబోతున్న విధానాలు ఏ విధంగా ఉంటాయో కూడా సంకేతాలు ఇచ్చేశారు. అంతేకాదు, చివరికి మీడియాకి కూడా చెప్పాల్సింది చెప్పేశారు. తాము పారదర్శకంగా నిర్వహించే టెండరింగ్ విధానాలపై అడ్డగోలు విమర్శలు చేస్తే… పరువు నష్టం కేసులు పెడతామని హెచ్చరించారు! ఏడాదిలోగా సుపరిపాలన ఏలా ఉంటుందో చూపించడమే తన ప్రథమ లక్ష్యం అని చెప్పినా… రాజకీయంగా తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడటమే అధికార పార్టీ అప్రకటిత మొదటి లక్ష్యంగా కనిపిస్తోందనడంలో సందేహం లేదు.
నిజానికి, ఎన్నికలకు ఏడాదిన్నర ముందుగానే ఏపీలో రాజకీయ వేడి మొదలైపోయింది. తెదేపా, వైకాపా నేతల మధ్య విమర్శలతో రాజకీయాలు హీటెక్కిపోయాయి. ఎన్నికల్లో ఓటమి ఎదుర్కొన్న వెంటనే, టీడీపీ కూడా ఇప్పట్లో ప్రభుత్వంపై విమర్శలకు దిగదు అనే వాతావరణమే కనిపించింది. పార్టీ నేతలతో ఇదే మాట చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. ప్రజలకు వైకాపా చాలా హామీ ఇచ్చిందనీ, కొన్నాళ్లపాటు వేచి చూద్దామని పార్టీ నేతలతో చంద్రబాబు అన్నారు. అయితే, ముఖ్యమంత్రి హోదాలో జగన్ తొలి ప్రసంగం చూశాక… ఆ విరామం ఏపీ రాజకీయాల్లో ఉండదేమో అనిపిస్తోంది. ప్రతిపక్షమైన టీడీపీ మీద మాటల దాడి ప్రారంభించేశారు. ఇక, శాసన సభ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అన్నట్టుగా ఉంది!
తొలిరోజు నుంచే టీడీపీ మీద మాటల దాడులు చెయ్యడం తప్పా, గత పాలనపై విమర్శలు చేయడం తప్పా, మీడియాపై మాట్లాడకూడదా అంటే… అన్నీ చెయ్యొచ్చు. కానీ.. ముఖ్యమంత్రి తొలి ప్రసంగంలోనే అవి ప్రముఖంగా కనిపించకుండా ఉంటే బాగుండేది. ఎన్నికల ప్రచార సభలో మాదిరిగానే… తొలి ప్రసంగంలో కూడా టీడీపీ మీద విమర్శలు చేయడం అనేది ప్రస్తుతం అనవసరం కదా! టీడీపీని ప్రజలు విశ్వసించలేదు కాబట్టే… వైకాపాకి అధికారం కట్టబెట్టారు. ఇప్పుడు ప్రజలు జగన్ నుంచి ఎదురుచూసేది… టీడీపీని బాగా ఎండగడుతున్నారనో, గట్టి విమర్శలు చేస్తున్నారనో కాదు కదా! జగన్ చేసే రాజకీయ ప్రసంగాలకు ఇకపై ప్రజల్లో ప్రాధాన్యత తగ్గిపోతుంది. పరిపాలనాపరంగా మాత్రమే ఆయన్ని చూస్తారు. ఏదేమైనా, మరికొద్ది రోజుల్లో ఎండల తీవ్రత తగ్గుతాయేమోగానీ… ఏపీలో రాజకీయాల వేడి తగ్గేట్టుగా ప్రస్తుతానికి కనిపించడం లేదు..!