నరేంద్ర మోడీ కల నెరవేరింది. పూర్తి మెజారిటీతో వరుసగా రెండోసారి కొలువుదీరిన మొదటి కాంగ్రెసేతర ప్రధానిగా మోడీ రికార్డులకెక్కారు. రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో మోడీ రెండోసారిప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశ విదేశాల నుంచి వచ్చిన అతిరథ మహారథులు, విద్యుత్ దీపాల అలంకరణ మధ్య రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో భారత ప్రధానిగా మోడీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. మోడీ తో రాష్ట్రపతి కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. 58 మందితో మోదీ కేబినెట్ కొలువు దీరింది. ఇందులో 25 మంది కేబినెట్ మంత్రులుకాగా, 9 మంది స్వతంత్ర మంత్రులు, మిగిలిన 24 మంది సహాయ మంత్రులు..
కేబినెట్ మంత్రుల్లో ఎక్కువగా పాతవారికే ప్రాధాన్యం కల్పించారు. అయితే ఈసారి అమిత్ షా కేబినెట్లో చేరడం ప్రధానమైనది.. కేబినెట్ మంత్రులుగా రాజ్‌నాథ్, అమిత్ షా, గడ్కరీ, సదానంద గౌడ, నిర్మలా సీతారామన్, రామ్‌విలాస్ పాశ్వాన్, నరేంద్ర సింగ్ తోమర్, రవిశంకర్ ప్రసాద్,హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్, తావర్ చంద్ గెహ్లాట్,జయశంకర్, రమేష్ పొక్రియాల్, అర్జున్ ముండా, స్మృతి ఇరానీ, హర్షవర్థన్, జవదేకర్, పియూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, ముక్తార్ అబ్బాస్ నక్వీ, ప్రహ్లాద్ జోషీ, మహేంద్రనాథ్ పాండే, అరవింద్ సావంత్, గిరిరాజ్ సింగ్, గజేంద్రసింగ్ షెకావత్ ప్రమాణ స్వీకారం చేశారు. స్వతంత్ర మంత్రులుగా 9 మంది సంతోష్ గాంగ్వర్, రావు ఇందర్జిత్ సింగ్, శ్రీపాద నాయక్, జితేంద్ర సింగ్, కిరణ్ రిజుజు, ప్రహ్లాద్ సింగ్, రాజ్‌కుమార్ సింగ్, హర్దీప్ సింగ్ పురి ప్రమాణ స్వీకారం చేశారు.
ఇక 24 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో కిషన్‌రెడ్డి ఉన్నారు.. హిందీలో ప్రమాణ స్వీకా రం చేసిన కిషన్‌రెడ్డి భారత్‌మాతాకీ జై అంటూ ముగించారు.. సహాయ మంత్రుల్లో అనురాగ్ ఠాకూర్, వీకే సింగ్, అథవాలే, నిరంజన్ జ్యోతి, సుప్రియో తదితరులు ఉన్నారు. అయితే గత కేబినెట్లో చోటు దక్కించుకున్న ఉమాభారతి, మేనకా గాంధీ, అరుణ్‌జైట్లీ, సుష్మా స్వరాజ్‌లకు ఈ కేబినెట్లో చోటు దక్కలేదు. ఇక సీనియర్లు రాధామోహన్ సింగ్, బీరేంద్ర సింగ్‌లకు కూడా వయసు కారణాలతో చోటు దక్కలేదు. ప్రమాణస్వీకార వేడుక అట్టహాసంగా జరిగింది.