మన వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్ గా మీడియా ఉంటుంది. పత్రికలు ఎప్పుడూ ప్రతిపక్ష పాత్రే పోషించాలి. అంటే, ప్రజల పక్షాన ఉండి ప్రశ్నించాలి. కానీ, మీడియా పాత్రను పాలకులు శాసించే పరిస్థితి ఉంటే… అది సరైన రాజకీయ స్ఫూర్తి కాదు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తొలి ప్రసంగంలోనే మీడియా విషయంలో తన వ్యవహార శైలి ఎలా ఉంటుందో హెచ్చరించేశారు. ఓ మూడు మీడియా సంస్థల పేర్లను బహిరంగ సభలో ప్రస్థావించి మరీ… వారు వాస్తవాలు రాయరు, అడ్డగోలుగా కథనాలు రాస్తారు అంటూ మండిపడ్డారు. ఆ ప్రముఖ మీడియాలను నమ్మొద్దు… సాక్షి మాత్రమే నిజాలు రాస్తుందనే భావన కల్పించే ప్రయత్నమే ఇది అనేది జగన్ స్పందనలో మరో కోణంగా చూడొచ్చు.
నిజానికి, దివంగత వైయస్సార్ హయాంలో కూడా ఇలానే మీడియాపై ఆయన విమర్శలు చేసేవారు. ఆ రెండు పత్రికలు అంటూ మాట్లాడేవారు. ఆ రెండూ వాస్తవాలు ప్రజలకు చెప్పడం లేదంటూ.. సొంతంగా సాక్షి పత్రికను స్థాపించారు. కానీ, సాక్షి పత్రిక కేవలం వైకాపా గొంతు మాత్రమే. అందుకే, ఇతర పత్రికలతో లేదా ఛానెల్స్ తో పోల్చుకుంటే ప్రజాదరణ విషయంలో కాస్త వెనకబడుతూనే ఉంటుంది. ఇన్నాళ్లూ సాక్షి పోషించింది ప్రతిపక్ష పాత్రే. ఎందుకంటే, వైకాపా ప్రతిపక్షంలో ఉంది కాబట్టి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు కదా. ఇకపై ప్రభుత్వ వ్యతిరేక కథనాలు అనేవే కనిపించవు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఇదీ అదీ అంటూనే ఇకపై వారి ప్రధాన కథనాలుండే అవకాశం ఉంది. కాబట్టి… సాక్షి పత్రిక రోల్ పూర్తిగా మారిపోతుంది. అలాంటప్పుడు, ఇతర మీడియా సంస్థలు కూడా అదే తరహాలో పనిచేయాలంటే ఎలా? మీడియాకి ఆంక్షలు పెట్టడమంటే… ప్రజల సమస్యలపై దృష్టి పెట్టొద్దనీ, ప్రభుత్వ పాలనలో లోపాలను ఎత్తి చూపకూడదని పాలకులే నిర్దేశించడమే. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా కొన్ని మీడియా ఛానెల్స్ పై అనుసరించిన వైఖరి ఏంటో చూశాం. కొన్ని ఛానెల్స్ ప్రసారాలను తెలంగాణలో కొన్నాళ్లు రానీయకుండా ప్లగ్ తీసేశారు. బహుశా అదే బాటలో జగన్ కూడా నడుస్తున్నట్టున్నారు!
ఇంకో వాస్తవాన్ని కూడా పాలకులు గ్రహించాలి. కేవలం మీడియా ద్వారా వస్తున్న కథనాలపై ఆధారపడి మాత్రమే ప్రజల రాజకీయ అభిప్రాయాలు మారడం లేదు. ఏ మీడియాలో ఏ తరహా కథనాలు వస్తాయనేది ప్రజలకే బాగా తెలుసు. మరో వాస్తవాన్ని కూడా పాలకులు దృష్టిలో పెట్టుకోవాలి. పాలన బాగుంటే, ఎక్కడా లోపాలకు ఆస్కారం లేకుండా, అవకతవకలకు అవకాశం ఇవ్వకపోతే… పరిపాలన భేష్ అనే కదా ఏ మీడియా అయినా చెబుతుంది. కాబట్టి, పాలకులు ఫోకస్ చెయ్యాల్సింది మీడియా మీద కాదు… పాలన మీద. తాజా ఎన్నికల ఫలితాలే తీసుకుంటే… జగన్ తనకు వ్యతిరేకంగా చాలా మీడియా సంస్థలున్నాయనీ, వాటిపై కూడా పోరాటం చేస్తున్నానని ప్రచారం చేశారు. ఆయన దృష్టిలో మీడియాలో మెజారిటీ వర్గం తనకు వ్యతిరేకంగా ఉందనే అభిప్రాయం ఉంది! అలాంటప్పుడు, మెజారిటీ మీడియా వర్గమంతా వ్యతిరేకంగా ఉన్నా కూడా… జగన్ అధికారంలోకి రాగలిగారంటే అర్థమేంటి? ఆయనకున్న అభిప్రాయం ప్రకారమే చూసుకున్నా… మెజారిటీ మీడియా తన విజయాన్ని ఆపలేకపోయిందనే కదా. అలాంటప్పుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి కాగానే… మీడియాపై ఇలాంటి హెచ్చరికలు ఎందుకు..?